రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతు సంక్షేమంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మండలంలోని కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో ఐదు మండలాల కేంద్రంగా కాటారంలో మరమ్మతు కేంద్రం ఉండగా ట్రాన్స్ఫార్మర్ల మరమత్తులో కొంత జాప్యం జరగడం వల్ల రైతులకు వెనువెంటనే సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న తీవ్రతను పరిశీలించి కొయ్యూరు లో కూడా ఒక మరమత్తు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని లక్ష్యంతో మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా రైతులు పండిస్తున్న పంటలకు మద్దతులతో కొనుగోలు చేసి బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ రైతు సంక్షేమమే వారి అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నాగులమ్మ నుండి తాడిచెర్ల వరకు తాడిచెర్ల నుండి ఖమ్మం పల్లి బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణానికి (హైబ్రిడ్ ఆంటీ మోడల్) స్కీం కింద నిధులు మంజూరు చేశామని అతి త్వరలోనే రోడ్ నిర్మాణ పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. మల్లారం ఎక్స్ రోడ్ నుండి పెద్దతూండ్ల వరకు పెద్దతూండ్ల నుండి చిన్నతూండ్ల వయ మల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. జెన్కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న తాడిచెర్ల గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం నిధులు మంజూరు కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా రూ.261 కోట్ల నిధులు మంజూరు చేసి ఆర్ అండర్ ప్యాకేజీ కోసం రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఇంటిని సర్వే చేసి భూనిర్వాసితులందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు జరుగుతున్నాయని తెలియజేశారు.
తాడిచెర్ల నుండి భూపాలపల్లి పట్టణానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అనంతరం కొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ పంపు ప్రారంభించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నాణ్యతతో కూడిన పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని సూచిస్తూ ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండేలా నిర్మించిన పెట్రోల్ పంపు, యజమాని సాయి కృష్ణ, ట్రాన్స్ఫర్ మరమ్మతు కేంద్ర యజమాని ముసుకుల సురేందర్ రెడ్డిలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, ఈజీఎస్ చైర్మన్ దండు రమేష్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, తాడిచెర్ల సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ కాటారం డీఈ నాగరాజు, సర్పంచ్లు కొండ రాజమ్మ, బండారి నర్సింగంతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.



