సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టేకి నిరాకరణ

సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టేకి నిరాకరణ– కేంద్రానికి సుప్రీం నోటీసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో పాటు ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల నియామకానికి సంబంధించి గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ఆమోదించిన కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌, గోపాల్‌ సింగ్‌తో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్డిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ జయా ఠాకూర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వికాష్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్ధమని అన్నారు. ఈ చట్టంపై స్టే విధించాల్సిందిగా కోరారు. అయితే.. కేంద్రం వాదనలు వినకుండా స్టే విధించలేమని తెలుపుతూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ కాపీని కేంద్రం తరపు న్యాయవాదికి అందజేయాల్సిందిగా ధర్మాసనం సూచించింది. ఏప్రిల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్‌ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. దీనిపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికల సంఘానికి నియామకాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.

Spread the love