దురదృష్టకరం

Unfortunate–  అసంతృప్తిని కలిగించింది
– అదానీ కేసులో సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : అదానీ కేసులో నిస్పాక్షిక విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తిని కలిగించిందని, ఇది దురదృష్టకరమని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై త్వరితగతిన విచారణ జరపాలంటూ తనకు నిర్దేశించిన బాధ్యతను సెబీ సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని తెలిపింది. ‘అదానీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆరోపణ చేస్తూ 2014లో సెబీకి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) నివేదించింది. అదానీపై సెబీ విచారణ జరుపుతోందని 2021లో పార్లమెంటుకు తెలియజేశారు. అయితే అలాంటి విచారణ ఏదీ జరపడం లేదని న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్‌లో సెబీ తోసిపుచ్చింది. ఫిర్యాదులపై సెబీ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించాల్సిన న్యాయస్థానం ఆ పని చేయకుండా ఆ సంస్థ వాదనను పరిగణనలోకి తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇక రెండో విషయం…సెబీ తన సొంత నిబంధనలను మార్చివేసింది. వాటిలో ఎలాంటి పారదర్శకత లేదు. చివరికి లబ్దిదారు ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా చేసింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా సెబీ పనితీరుపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ సెబీ నిబంధనలలో సవరణలను సుప్రీంకోర్టు ఆమోదించింది. అంతిమ లబ్దిదారులైన విదేశీ పెట్టుబడిదారుల సంబంధాలను బహిర్గతం చేయకుండా సెబీ తాజా నిబంధనలు అడ్డుగోడగా నిలిచాయి. ఇక మూడో విషయం…హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలు నిబంధనలను విస్మరించాయా, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలా అనే విషయాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి బహిరంగంగా లైసెన్స్‌ ఇవ్వడం అత్యంత దురదృష్టకరం. మరో మాటలో చెప్పాలంటే హిండెన్‌బర్గ్‌ నివేదికను ప్రచురించిన మీడియా సంస్థలన్నింటినీ ప్రమదంలో పడేశారు’ అని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో వివరించింది. ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం తన విశ్వసనీయతను పెంచుకోలేదని వ్యాఖ్యానించింది.

Spread the love