ప్రజా సమస్యలపై సెప్టెంబర్ 2 నుంచి బీఆర్‌ఎస్ పోరుబాట
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. ఆలేరు పట్టణంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వెయ్యి రోజులు కావొస్తోందనీ, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భిక్షమయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇప్పటిదాకా ఇవ్వలేదనీ, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రైతుబంధుపై స్పష్టత లేదనీ, రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరోవైపు యూరియా, డీఏపీ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.
రైతు కూలీలకు రూ.12,500 ఆరు నెలలకోసారి ఇస్తామనీ, పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్న హామీని తుంగలో తొక్కారనీ, విద్యార్థులు, బీసీలు, మహిళలు, రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్ల పాటు నిరంతరం పోరాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నామనీ చురకలు అంటించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజల తరఫున బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని భిక్షమయ్య గౌడ్ అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రం
ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాల్సి ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో ప్రాజెక్టు నీటిని వినియోగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల ద్వారా రైతులకు నీటిని అందించకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతులను ఆదుకోవడంతో పాటు పెండింగ్ సాగునీటి పనులను పూర్తి చేసి ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని భిక్షమయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో రోడ్లు, సాగునీరు, రైతుల సమస్యలు, ఎరువుల కొరత తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని భిక్షమయ్య గౌడ్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, మాజీ సింగిల్ విండో చైర్మన్ మొగలగాని మల్లేశం, వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్, యాట శివ, టంగుటూరు, కొలనుపాక సర్పంచ్ జూకంటి అనిల్, యాకమ్మ వెంకటేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్, పూల శ్రావణ్, ఎలుగల హరికృష్ణ, జింకల రామకృష్ణ, ఎలుగల నరేష్ పార్టీ సభ్యుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



