నవతెలంగాణ – కామారెడ్డి
మొబైల్ ఫోన్ పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతినెలా సగటున 150కుపైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కేవలం 20 రోజుల్లోనే రూ.23 లక్షల విలువైన 139 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు రూ.1.81 కోట్ల విలువైన 1,133 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. గత ఏడాది సైతం రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 5,414 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.8.66 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఎస్పీ అభినందించారు.
ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సిమ్ కార్డును బ్లాక్ చేయాలని, అనంతరం సి ఈ ఐ ఆర్ పోర్టల్‌లో ఐ ఎం ఈ ఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని ఎస్పీ సూచించారు. పోయిన ఫోన్‌ను దుర్వినియోగం చేసి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అనుమానాస్పద కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రికవరీ అయిన ఫోన్లను పొందేందుకు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజును 8712686114 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.



