ప్రతియేటా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం వస్తుంది. పాఠశాలల్లో సభలు జరుగుతాయి. ఉపాధ్యాయులను సన్మానిస్తారు. పూలమాలలు వేస్తారు. శాలువాలు కప్పుతారు. అవార్డులు అందజేస్తారు. నాయకులు, మంత్రులు, అధికారులు ఉపాధ్యాయుల గొప్ప తనాన్ని కొనియాడుతూ “దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది” అంటారు. కానీ ఆ వేడుకలు ముగిసిన తర్వాత ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. దేశ భవిష్యత్తును నిర్మించే ఉపాధ్యాయుడి వర్తమానం ఎలా ఉంది? అతని జీతం సమయానికి వస్తుందా? బకాయిలు చెల్లిస్తున్నారా? ఉద్యోగ భద్రత ఉందా? బోధించే స్వేచ్ఛ ఉందా? అతని పని బోధనకే పరిమితమైందా? రోజురోజుకూ పెరుగుతున్న పరిపాలనా, డిజిటల్, ఎన్నికల, సర్వేలు, ఇతరేతర పనుల భారాన్ని తగ్గిస్తున్నారా? అతని వృత్తి గౌరవాన్ని ప్రభుత్వాలు కాపాడుతున్నాయా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు వెతకాలి. అప్పుడే ఉపాధ్యాయ దినోత్సవం కేవలం వేడుకగా కాకుండా విద్యా వ్యవస్థపై ఆత్మపరిశీలనకు ఒక సందర్భంగా మారాల్సిన అవసరం స్పష్టమవుతుంది. “ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత”, “దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు”, “తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం ఉపాధ్యాయుడిదే” వంటి మాటలు నేడు వినిపిస్తాయి. కానీ మాటలకు, విధానాలకు మధ్య ఉన్న అంతరమే అసలు సమస్య.
ఒక వృత్తిని నిజంగా గౌరవించాలంటే పూలమాలలు, శాలువాలు మాత్రమే సరిపోవు. మంచి జీతం, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితులు, వృత్తిపరమైన స్వేచ్ఛ, తగిన మౌలిక సదుపాయాలు, నిరంతర శిక్షణ, సముచితమైన పని భారం, సామాజిక భద్రత అవసరం.ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత బోధన. కానీ నేడు బోధనతో పాటు అనేక పరిపాలనా, డిజిటల్, ఎన్నికల, సర్వే తదితర పనులు అతనిపై పడుతున్నాయి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని చదివి వినిపించే యంత్రం కాదు. విద్యార్థుల సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకుని, వారి భాష, అనుభవాలు, సమస్యలను గమనించి, తగిన ఉదాహరణలతో బోధించే వ్యక్తి. ప్రతి అంశాన్ని పైస్థాయి ఆదేశాలతో నిర్ణయించి, ప్రతి దశను యాప్‌లు, ఫార్మాట్లు, రిపోర్టులతో నియంత్రిస్తే అతని వృత్తిపరమైన స్వేచ్ఛ ఎక్కడ మిగులుతుంది? విద్యార్థికి ఆలోచించే స్వేచ్ఛ కావాలంటే ముందుగా ఉపాధ్యాయుడికి బోధించే స్వేచ్ఛ ఉండాలి. ఉపాధ్యాయులపై రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యల విషయంలో కూడా పాలకులు బాధ్యతగా వ్యవహరించాలి.
ఉపాధ్యాయులను సోమరులు, బాధ్యత లేనివారు, పని చేయని వారు, కేవలం సెలవులు కోరుకునేవారిగా సాధారణీకరించే వ్యాఖ్యలు మొత్తం వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరి పనితీరుపై ఫిర్యాదులున్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. పర్య వేక్షణ వ్యవస్థను మెరుగుపరచవచ్చు. జవాబుదారీతనం నిర్ధారించవచ్చు. కానీ మొత్తం ఉపాధ్యాయ వృత్తిని అవమానిం చడం పరిష్కారం కాదు.ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించడం అవసరమే. అయితే అవార్డుల వ్యవస్థలో పారదర్శకత లేకపోతే సమస్య ఏర్పడుతుంది. ప్రాజెక్టుల ఫైళ్లు, ఫోటోలు, సర్టిఫికెట్లు, సిఫార్సులు, అధికారుల ధృవపత్రాలు, పరిచ యాలకే ప్రాధాన్యం పెరిగితే నిజమైన సేవ వెనక్కి నెట్టబడే ప్రమాదం ఉంది. ఉత్తమ ఉపాధ్యాయుడిని తయారు చేసే వ్యవస్థ కావాలి, ఉత్తమ అవార్డు దరఖాస్తుదారుడిని తయారు చేసే వ్యవస్థ కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్కరణల గురించి మాట్లాడుతున్నాయి. కొత్త విధానాలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి అవసరమే. కానీ వాటిని అమలు చేసే ఉపాధ్యాయుడికి తగిన శిక్షణ, సమయం, సిబ్బంది, వనరులు కల్పిస్తున్నారా అన్నదే కీలకం. ఉపాధ్యాయుడిని ఆదేశాల స్వీకర్తగా, పథకాల అమలుదారుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, ఎన్నికల సిబ్బందిగా మాత్రమే కాకుండా విద్యా విధాన రూపకల్పనలో భాగస్వామిగా చూడాలి. ఉపాధ్యాయ సంఘాలతో నిజమైన సంప్రదింపులు లేకుండా విద్యా సంస్కరణలు చేయడం ప్రజాస్వామిక పద్ధతి కాదు. ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం భవనం కాదు. భవనాలు, పుస్తకాలు, డిజిటల్ పరికరాలు, ఫర్నిచర్ ఉన్నంత మాత్రాన పాఠశాల ఏర్పడదు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం, స్వేచ్ఛ, వనరులు, ప్రజాస్వామిక వాతావరణం కలిసినప్పుడే ప్రభుత్వ విద్య బలోపేతమవుతుంది. అందులో ఉపాధ్యాయుడే కీలకమైన మానవ శక్తి. కాబట్టి ఉపాధ్యాయుడిని బలహీనపరిచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం సాధ్యం కాదు.
ప్రపంచ అనుభవాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఉపాధ్యాయుడికి సామాజిక గౌరవం, మెరుగైన ఆర్థిక స్థాయి, వృత్తిపరమైన స్వేచ్ఛ ఉన్న చోట విద్యా వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. దీనికి భిన్నంగా ఉపాధ్యాయుడిని కేవలం ఆదేశాలు అమలు చేసే ఉద్యోగిగా చూసే వ్యవస్థలో నాణ్యమైన విద్య సాధించడం కష్టం.సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుడికి శుభాకాంక్షలు చెప్పడం సులభం. కానీ అతని జీవితాన్ని గౌరవప్రదంగా మార్చడం అసలు పరీక్ష. పూలమాల వేసే చేతులు అతని పెండింగ్ బిల్లులు విడుదల చేసే చేతులుగా మారాలి. ఉపాధ్యాయుడి గొప్పతనాన్ని పొగిడే నోరు అతని వృత్తి గౌరవాన్ని కాపాడే మాటలు మాట్లాడాలి. అవార్డులతో సత్కరించే ప్రభుత్వం అతని ఆర్థిక హక్కులను కూడా గౌరవించాలి. విద్యార్థులకు ఆలోచనా స్వేచ్ఛను కోరే ప్రభుత్వం ముందుగా ఉపాధ్యాయుడికి బోధనా స్వేచ్ఛ ఇవ్వాలి.అందుకే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన నినాదం.
“ఉపాధ్యాయుడికి పూలమాల కాదు – హక్కులు కావాలి!”
“ఉపాధ్యాయులపై గౌరవం మాటల్లో కాదు – విధానాల్లో చూపాలి!”
ఉపాధ్యాయుడిని కాపాడటం అంటే ఒక ఉద్యోగిని కాపాడటం కాదు. ప్రభుత్వ విద్యను కాపాడటం, విద్యార్థి భవిష్యత్తును కాపాడటం, సమానత్వాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, సమాజ భవిష్యత్తును కాపాడటం.
(నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం)
ఎ.వెంకట్, 9490300685



