Saturday, September 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచివరి శ్వాస వరకు ప్రజల కోసమే...

చివరి శ్వాస వరకు ప్రజల కోసమే…

- Advertisement -

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి ఇక మన మధ్య లేరు. ఒక గొప్ప సహచరుడిని, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టును, రైతు ఉద్యమానికి అంకితమైన నాయకుడిని కోల్పోయిన బాధ మనందరిలో ఉంది. ఏడు దశాబ్దాలపాటు కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై, తన జీవితంలోని ప్రతి దశను ప్రజల కోసం, ముఖ్యంగా రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యల కోసం అంకితం చేసిన మల్లారెడ్డి 88 ఏళ్ల వయసులో 2026 ఆగస్టు 23న అమరుడయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందిన నాయకుడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యునిగా, జాతీయ కిసాన్ సభ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. పదవుల కోసం కాకుండా, బాధ్యత కోసం పనిచేసిన నాయకత్వం ఆయనది. ఉద్యమం ఎక్కడ బలహీనపడినా అక్కడ నిలబడటం, ప్రజల సమస్య ఎక్కడ కనిపించినా దానిపై పోరాడటం ఆయన సహజ స్వభావంగా మారిపోయింది.

నిర్బంధాల మధ్య నిలిచిన ధైర్యం
మల్లారెడ్డి రాజకీయ జీవితం వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామం తిమ్మంపేట నుంచి ప్రారంభమైంది. అప్పట్లో ఆయన గ్రామ పోలీస్ పటేల్‌గా పనిచేసేవారు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు మద్దికాయల ఓంకార్‌తో పరిచయం ఏర్పడటం ఆయన జీవిత గమనాన్నే మార్చింది. 1980వ దశకంలో వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది. నర్సంపేట తాలూకాలో కాంగ్రెస్ గుండాల దాడులు, హత్యలు, అక్రమ కేసులు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ సమయంలో మల్లారెడ్డి ఓంకార్‌కు సన్నిహిత సహచరుడిగా పనిచేస్తూ అవసరమైన సమాచారాన్ని అందించడం, నోట్స్ తయారు చేయడం, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయడం వంటి అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆయనపై కూడా అనేక అక్రమ కేసులు నమోదయ్యాయి. అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. వ్యక్తిగత భద్రత కంటే ఉద్యమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. 1984లో ఓంకార్ పార్టీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత వరంగల్ జిల్లా ఉద్యమాన్ని కాపాడటంలో మల్లారెడ్డి పాత్ర మరింత కీలకమైంది. తిమ్మంపేటను పార్టీకి బలమైన కేంద్రంగా నిలిపారు. నర్సంపేట అడవి ప్రాంతాల్లో గిరిజనుల భూముల కోసం, ఆసరవెల్లి రైతుల భూముల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించారు. ఆ క్లిష్ట కాలంలో జిల్లా నాయకత్వం దాదాపు పూర్తిగా విచ్ఛి న్నమైనా కొద్దిమంది నాయకులు ఉద్యమాన్ని నిలబెట్టారు. వారిలో మల్లారెడ్డి ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానేతలు జిల్లా ఉద్యమ పరిస్థితులపై నాయకత్వంతో చర్చించిన సందర్భాల్లో మల్లారెడ్డి ఇచ్చిన సూచనలు పార్టీకి ఎంతో ఉపయోగపడ్డాయి.

మళ్లీ ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు
ఓంకార్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత వరంగల్ జిల్లా ఉద్యమాన్ని తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పగూడెంలో జరిగిన జిల్లా మహాసభలో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. కొరటాల సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శిగా హాజరైన ఆ మహాసభలో కొత్త జిల్లా సెక్రటేరియట్, జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందులో మల్లారెడ్డి కూడా ఉన్నారు. జిల్లా ఉద్యమ అవసరాల కోసం తిమ్మంపేటను వదిలి వరంగల్ జిల్లా కేంద్రానికి రావాలని నిర్ణయిం చినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. ఆయన రాకతో జిల్లా కేంద్రంలోని పార్టీ బలపడింది. వరంగల్ నగర ఉద్యమం కూడా అభివృద్ధి చెందింది. కొద్ది సంవత్సరాల్లోనే మార్క్సిస్టు పార్టీ తిరిగి జిల్లాలో ఒక ప్రధాన వామపక్ష శక్తిగా ఎదిగింది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు గెలవడం, అనేక గ్రామాల్లో పార్టీ బలపడటం వెనుక ఆ కాలంలో జరిగిన నిరంతర నిర్మాణ కృషి ఉంది. ఆ పునర్నిర్మాణంలో మల్లారెడ్డి పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి.

రైతు సమస్యలపై నిరంతర అధ్యయనం
1996 తర్వాత హైదరాబాద్ రాష్ట్ర కేంద్రానికి వచ్చిన మల్లారెడ్డి రైతు సంఘం బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, జాతీయ కిసాన్ సభ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయన జీవితం రైతాంగ సమస్యల అధ్యయనం, ఉద్యమం, రచనలతో మరింతగా ముడిపడింది.భూమి సమస్యలు, రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరులు వంటి అంశాలపై ఆయన లోతైన అధ్యయనం చేశారు. అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. ఈ రంగాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందారు.దేశంలోని జాతీయ మీడియా ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, రైతు ఉద్యమ నాయకులు సమాచారం కోసం ఆయనను సంప్రదించేవారు. ఏ అంశంపై సమాచారం కావాలన్నా మల్లారెడ్డి వద్ద దొరుకుతుందనే విశ్వాసం ఉండేది. ఆయన గది ఎప్పుడూ సందర్శకులతో, చర్చలతో, ఉద్యమ సమస్యలతో కళకళలాడుతుండేది.

అందరివాడైన కమ్యూనిస్టు
మల్లారెడ్డి గొప్పతనం ఆయన రాజకీయ పరిజ్ఞానంలో మాత్రమే లేదు. ఆయన వ్యక్తిత్వంలో ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు కూడా ఆయనను అభిమానించేవారు. సాధారణ కార్యకర్తను సైతం ఎంతో గౌరవంగా పలకరించే వారు. వారి సమస్యలను ఓపికగా విని, తనకు చేతనైన సలహా ఇచ్చేవారు.ఎవరితో మాట్లాడినా ఆప్యాయత కనిపించేది. ఎన్ని బాధ్యతలు ఉన్నా తన దగ్గరకు వచ్చినవారిని నిర్లక్ష్యం చేయడం ఆయనకు తెలియదు. అందుకే మల్లారెడ్డి ఒక పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఎంతోమందికి ఆత్మీయుడిగా మారారు. చివరివరకు ప్రజల కోసమే తపించాడు. జీవిత చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయనలోని ప్రజా సేవా తపన ఏమాత్రం తగ్గలేదు. కుటుంబంలో వరుస విషాదాలు ఎదురైనా ఆ బాధను తనలోనే దాచుకున్నారు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. తాను బతికినంతకాలం ప్రజలకు సేవ చేయాలనే పట్టుదలను చివరి వరకు వదల్లేదు. మరణించిన తర్వాత కూడా తన శరీరాన్ని భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ఆస్పత్రికి దానం చేయడం ఆయన జీవిత తత్వానికి ప్రతీక. మల్లారెడ్డి అంతిమ యాత్రకు వచ్చిన స్పందన ఆయన జీవితానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఎల్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించారు.విభిన్న రాజకీయ భావజాలాలకు చెందినవారు ఒకే వ్యక్తికి నివాళులర్పించడం సాధారణ విషయం కాదు. అది మల్లారెడ్డి సంపాదించుకున్న విశ్వసనీయతకు, ఆయన వ్యక్తిత్వానికి, ప్రజలతో ఏర్పరచుకున్న ఆత్మీయ సంబంధానికి నిదర్శనం.

ఒక గొప్ప సహచరుడిని కోల్పోయిన బాధను మాటల్లో చెప్పడం కష్టం. ఐదు దశాబ్దాలుగా నేను మల్లారెడ్డితో కలిసి ఉద్యమంలో పనిచేశాను. మొదటి పాతికేళ్లు వరంగల్ జిల్లా ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర కేంద్రంలో కలిసి పనిచేశాం. ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చూశాం, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఆ ప్రయాణంలో మల్లారెడ్డి ఒక సహచరుడిగా మాత్రమే కాదు, నమ్మకమైన మిత్రుడిగా, ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా, ఆయన నడిచిన దారులు ఉన్నాయి. ఆయన చేసిన పోరాటాలు ఉన్నాయి. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆయన నిర్మించిన పార్టీ, ఆయనతో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా ప్రజల హృదయాల్లో ఆయనపై ఉన్న అభిమానం ఉంది. మల్లారెడ్డి జీవితం మనందరికి స్ఫూర్తి దాయకం. రైతుల కోసం, పేదల కోసం, ప్రజల కోసం, వామపక్ష ఉద్యమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన స్మృతికి కన్నీటి నివాళి కాదు-ఆయన చూపిన బాటలో ముందుకు సాగడమే నిజమైన నివాళి.

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి జోహార్! కామ్రేడ్ మల్లారెడ్డి అమర్ హై!!
(ఆగస్టు 07, రవీంద్రభారతిలో కామ్రేడ్‌ సారంపల్లి సంస్మరణ సభ)

జి. రాములు, 94900 98006

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -