ఒక రైతు లక్ష రూపాయల అప్పు తీసుకుని పంట దెబ్బతినడంతో తీర్చలేకపోతే బ్యాంకు తలుపు తడుతుంది. వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది. చివరకు ఆస్తులు వేలం వేసే పరిస్థితి వస్తుంది. సామాన్యుడు ఈఎంఐ ఒక్కసారి కట్టకపోయినా నోటీసు అందుతుంది. చిన్న వ్యాపారి కొద్దిపాటి బకాయిపడినా బ్యాంకు అతని వెంట పడుతుంది. కానీ, వేల కోట్ల కార్పొరేట్ రుణాల దగ్గరకు వచ్చేసరికి ఆ కథ మరోలా ఉంటుంది. అప్పు తీసుకున్నవాడు ఎంత పెద్దవాడైతే అప్పు భారం అంత చిన్నదైపోతుంది. జీ, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో ఇప్పుడదే చర్చకు దారితీసింది. వేల కోట్ల రూపాయల క్లైయిమ్లకు ఐదారు కోట్లతో ఎన్‌సిఎల్‌టి పరిష్కార ప్రణాళిక ఆమోదించడం దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, రుణదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ వడంతో సెప్టెంబర్ ఒకటిన బెంచ్ మళ్లీ విచారణకు ఆదేశించింది. కానీ, ఈ దివాళా ప్రక్రియ కార్పొరేట్ల దోపిడీ స్వభావాన్ని బహిర్గత పరిచింది. సుభాష్ చంద్ర ఒకప్పుడు దేశంలోని పారిశ్రామికవేత్తల్లో ఒకరు.
ఆయన వ్యక్తిగత దివాళా కేసులో వేల కోట్ల రుణం తీసుకున్నా రని కాదు, ఎస్సెల్ గ్రూప్‌నకు చెందిన కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. ఆ కంపెనీలు రుణాలు చెల్లించలేక పోవడంతో హామీదారుగా చర్యలు మొదలయ్యాయి. అలా ఆయనపై అంగీ కరించిన రుణదాతల క్లైయిమ్లు రూ.22, 006.57 కోట్లకు చేరాయి. ఇక్కడే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్సీ ఎల్టీ) వ్యవహారం ముందుకొస్తుంది. ఇది కంపెనీల దివాలా, రుణ పరిష్కారం వంటి అంశాలను చట్ట ప్రకారం పరిశీలించే ప్రత్యేక న్యాయ సంస్థ. కేంద్ర ప్రభ త్వం ఏర్పాటు చేసినదే. అది సుభాష్ చంద్ర తరఫున రూ.6.25 కోట్లతో పరిష్కార ప్రణాళిక ఇచ్చింది. అంటే ఈ మొత్తం క్లెయిమ్‌లకు కేవలం 0.03 శాతం. దాదాపు 99.97 శాతం రుణంపై కోత పడే పరిస్థితి! ఈ కేసులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆ సంస్థకు రూ.1,322.39 కోట్ల క్లెయిమ్ ఉండగా, మొదట ఆమోదం పొందిన ప్రణాళికలో కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే ప్రతిపాదించింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు దీన్ని వ్యతిరేకిం చాయి. ఎల్ఐసీకి సంబంధించిన డబ్బు సామాన్యుల పొదుపులతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల డబ్బు కూడా ప్రజల ఆర్థిక వ్యవస్థలో భాగమే కదా. ఆ భారం ఎల్ఐసి మూలధనం మీద ప్రభావం చూపుతుంది. ఆ భారం ఇప్పుడు ఎవరు మోయాలన్నది ప్రశ్న.
సుభాష్ చంద్ర కేసు ఒక్కటే కాదు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి భారీ రుణ, ఆర్థిక అవకత వకల కేసుల్లో నిందితులు దేశం విడిచి వెళ్లిన ఉదాహరణలనేకం. 2014 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు బ్యాంకులు రూ.16.61 లక్షల కోట్ల రుణాలను రైట్ఆఫ్ చేశాయి. అందులో తిరిగి వసూలైనది రూ.2.69 లక్షల కోట్లు మాత్రమే. అంటే దాదాపు పదహారు శాతం. కానీ, ఇంత భారీ మొత్తంలో వసూళ్లు ఎందుకు తక్కువగా ఉన్నాయన్నది మాత్రం ప్రశ్నించాల్సిందే. ఎన్సీఎల్టీ ద్వారా ప్రక్రియ సాగినా ప్రభుత్వానికి బాధ్యత లేదని అనుకోలేం. దివాలా చట్టాన్ని రూపొందించింది పార్లమెంటే. ఎన్సీఎల్టీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విధానాలు, భారీ కార్పొరేట్ రుణాల మంజూరు, మొండి బకాయిల వసూళ్లపై కేంద్రానికి విధానపరమైన బాధ్యత ఉంది. భారీ రుణాలు ఎలా మంజూరయ్యాయి? సరైన హామీలు ఉన్నాయా? ఉద్దేశపూర్వక ఎగవేత జరిగిందా? ఆస్తులు ఎక్కడున్నాయన్నది తేలాలి.
ఈ పరిణామాలన్నింటిని చూస్తే దొడ్డిదారిన ‘డబ్బులెగ్గొట్టే పరిష్కారం’ ప్రభుత్వ,కార్పొరేట్ మైత్రిని బలపరుస్తోంది. అందుకు సుభాష్‌చంద్ర రాజకీయ నేపథ్యం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన హర్యానా నుంచి బీజేపీ మద్దతుతో ఎన్నికైన రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా. 2022లోనూ రాజస్థాన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తమను నమ్ముకున్న వారు ఎంత అవినీతిపరులైనా ‘వాషింగ్ మిషన్’లో శుద్ధి చేసే బీజేపీ ఈ కేసును కూడా ఎన్‌సిఎల్‌టి ద్వారా ముందుకు తీసుకెళ్తుందన్న ఆరోపణల్ని కొట్టిపారేయలేని పరిస్థితి! ఎందుకంటే, నోటీసులు అందుతున్న క్రమంలోనే అప్పటికే లాభాల్లో ఉన్న కంపెనీలు సడన్‌గా ఎలా నష్టాల్లోకి వెళ్లాయన్న రుణదాతల ప్రశ్నలకు సమాధానం లేదు. ఇప్పటికైనా ఎస్సెల్ గ్రూపునకు చెందిన మిగిలిన ఆస్తులు, వాటి వాస్తవ విలువ, అప్పుల పరిస్థితిపై పారదర్శక విచారణ జరగాలి. ప్రభుత్వం ఈ కేసును దివాలాగా చూడకుండా, ఆర్థికనేరానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి, బడా కార్పొరేట్ల పాత్రను వెలికితీయాలి. ఇక్కడ కార్పొరేట్ వ్యాపారానికి రుణాలివ్వడం తప్పుపట్టడం లేదు. కానీ, లాభం ప్రయివేటు వ్యక్తికి, నష్టం ప్రజలకు అనే పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం.
ఆర్థిక నేరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



