Sunday, September 6, 2026
E-PAPER
Homeసోపతిఫ్రెండ్లీ యానిమల్..!

ఫ్రెండ్లీ యానిమల్..!

- Advertisement -


ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఓ జంతువు ఉందన్న విషయం మీకు తెలుసా? ఈ చిన్ని జంతువు ప్రపంచంలోనే అత్యంత సంతోషకర మైనది. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, స్నేహపూర్వక స్వభావంతో అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ మార్సుపియల్ ‘క్వోక్కా’ ఫొటోజెనిక్ ఆకర్షణతో భూమిపై అత్యంత సంతోషకరమైన జంతువుగా పేరొందింది. గుండ్రని ముఖం, మెరిసే కళ్లు, వంకర నోరు ఉండడం వల్ల అది నిరంతరం నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. ఇవి వాలబీ, కంగారూ కుటుంబాలకు చెందిన చిన్న మార్సుపియల్.
ఈ ముద్దులొలికే జీవి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించింది. దీంతో వీటిని చూసేందుకు పర్యటకులు పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు సమీపంలో ఉన్న బాల్డ్ ఐలాండ్, రాట్‌నెస్ట్ ఐలాండ్‌ వెళ్తుంటారు. ఈ భూభాగంలో వాటిని వేటాడే శత్రువులు లేకపోవడం వల్ల, ఈ ద్వీపాలు వాటికి సురక్షితంగా మారాయి. క్వోకాలు రాట్‌నెస్ట్ ద్వీపంలో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. అక్కడ అవి తరచుగా పర్యాటకులతో కలిసిపోయి తిరుగాడుతుంటాయి. స్నేహభావం కారణంగా ఎక్కువగా ఫొటోలు తీసుకుంటుంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఫొటోలు తీసే జంతువూ ఇదే కావడం విశేషం. క్వోక్కా ముఖ నిర్మాణం దాన్ని సంతోషకరమైన జంతువుగా చెప్పడానికి ప్రధాన కారణం. నోరు పైకి వంగి ఉండటం వల్ల ముఖంలో నిరంతరం ఒక చిరునవ్వు కనిపిస్తుంది.
 క్వోక్కా అనే పేరు గ్వాగా అనే ఆదివాసీ పదం నుంచి వచ్చింది.
 ఒకప్పుడు డచ్ అన్వేషకులు వాటిని పెద్ద ఎలుకలుగా భావించారు.
 అందుకే రాట్‌నెస్ట్ అని పేరు పెట్టారు. రాట్ నెస్ట్ అంటే ఎలుకల గూడు అని అర్థం.
 క్వోక్కాలు నిశాచరులు. అవి పగటిపూట నిద్రపోయి రాత్రిపూట బయటకు వస్తాయి.
 క్వోక్కాలను తాకడం లేదా వాటికి ఆహారం పెట్టడం చట్టవిరుద్ధం.
 సందర్శకులు వాటితో కేవలం ఫొటోలు మాత్రమే తీసుకోవచ్చు.
క్వోక్కాలు శాంతియుతమైన, సౌమ్యమైన జంతువులు. వాటి ఉల్లాసభరితమైన ప్రవర్తన వల్ల అవి సంతోషంగా, ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి. తక్కువ నీరు ఉండే కఠినమైన, పొడి వాతావరణంలో కూడా జీవిస్తూ వాతావరణ పరిస్థితులకు తొందరగా అలవాటుపడతాయి. క్వోకాలు శాకాహారులు. ఎక్కువగా తమ పరిసరాలలో కనిపించే గడ్డి, ఆకులు, మొక్కలను తింటుంటాయి.
 దాదాపు పెంపుడు పిల్లి పరిమాణంలో ఉంటుంది.
 ఎత్తు సుమారు 40సెం.మీ., పొడవు 54 సెం.మీ.
 బరువు 2.5 నుంచి 5 కిలోల మధ్య ఉంటుంది.
 ఆయుర్దాయం అడవిలో సుమారు 10 సంవత్సరాలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -