జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై పేదల ధర్నా
ఆందోళనకారులపై పోలీసుల ప్రతాపం
ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసిన వైనం
సీపీఐ(ఎం) శ్రేణుల అరెస్ట్
ప్రజల మధ్య ఇందిరమ్మ లబ్దిదారులను ఎంపిక చేయాలి :సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి
నవతెలంగాణ- జనగామ
జనగామ కలెక్టరేట్ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ప్రజల మధ్య పారదర్శకంగా ఎంపిక చేయాలని, ఇప్పటికే ఇండ్లల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) నేతృత్వంలో, పేదలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు భారీకేడ్లను తన్నుతూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని మోకాళ్లు, మోచేతులతో గుద్దుతూ లాగి పడేసే ప్రయత్నం చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి రఘునాథపల్లి, లింగాల ఘన్పూర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. ఇండ్ల కేటాయింపునకు ముందు గ్రామ, వార్డు సభలు నిర్వహించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసిన అనంతరం మాత్రమే డ్రా తీయాలని డిమాండ్ చేశారు.
జనగామ పట్టణంతోపాటు మంచుప్పుల, కళ్లెం గ్రామాలు, అలాగే మూడో విడత ఇందిరమ్మ లబ్దిదారులు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో నివాసం ఉంటున్నందున పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి, అక్కడే నివాసం ఉంటున్న పేదలకు ఇండ్లను కేటాయించాలని కోరారు. జనగామ పట్టణంలో 2012-13లో 1,146 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, అనంతరం అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 2023లో డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పుడు మళ్లీ డ్రా పేరుతో వారికి అన్యాయం చేయడం సరికాదన్నారు. పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో 1991లో 50 మంది దళితులకు పట్టాలు ఇచ్చి, అదే స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వారు ఐదేండ్లుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. కళ్లెం గ్రామంలోనూ ఇండ్లు లేని పేదలు డబుల్ బెడ్రూమ్స్లో నివసిస్తున్నారని, వారిని పక్కనపెట్టి ఆన్లైన్ దరఖాస్తుల ఆధారంగా కొత్తగా డ్రా నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ల కోసం నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇల్లు కేటాయించకుండా తిరిగి మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టడం సరైనది కాదన్నారు. పోలీసుల పహారాల మధ్య జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా కలెక్టరేట్లో డ్రా పద్ధతి నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం చేపడతారని అర్ధరాత్రి నుంచే సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేసిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శేఖర్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సుంచు విజేందర్ ఉన్నారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సింగార రమేష్, మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమా, మండల కార్యదర్శులు మాచర్ల సారయ్య, రామవత్ మీట్యా నాయక్ తుటి దేవాదానం తదితరులు పాల్గొన్నారు.



