ఓపెన్ ఎండెడ్ కుల నమోదు ఇది వరకే విఫలం
మళ్లీ అదే విధానం తీసుకురావడానికి బీజేపీ కుట్ర
సమాచారం లేకుండా సమానత్వం సాధ్యం కాదు : సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓబీసీ హక్కుల కోసం దేశవ్యాప్తంగా వంద రోజుల పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ చేయనుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తెలిపారు. ఓబీసీ, జనరల్ కేటగిరీ కులాల కోసం ఓపెన్- ఎండెడ్ (స్వేచ్ఛాయుతమైన) కుల నమోదు నిబంధన ఇది వరకే విఫలమైందని గుర్తుచేశారు. తిరిగి అదే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడమంటే ఓబీసీలకు హక్కులు దక్కకుండా బీజేపీ పన్నిన కుట్రేనని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారని ఆయన తెలిపారు. ఎస్ఈసీసీ 2011లో 46 లక్షలకు పైగా కుల నమోదులు వెలుగు చూశాయని ఆయన చెప్పారు. 2021లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టుకు ఈ సమాచారం తప్పులు, లోపాలతో నిండి ఉందని, డ్రాప్ డౌన్ ఆధారిత కుల రిజిస్ట్రీయే సరైన పద్దతి అని తెలిపిందని రాజు గుర్తుచేశారు. ఈ పద్ధతి అమలైతే ఒకే కులం వేర్వేరు పేర్లు, అక్షర క్రమాలు (స్పెల్లింగ్ లు) లేదా ఉపకులాల కింద నమోదయి తప్పులు దొర్లే అవకాశముందని హెచ్చరించారు. ఈ పద్ధతి విఫలమవుతుందని బీజేపీకి ముందే తెలుసని ఆయన విమర్శించారు. అయినప్పటికీ అదే లోపభూయిష్టమైన విధానాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ సమాచారం లేకుండా న్యాయమైన వాటా, సమానత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికీ ప్రతి కులం జనాభా, వెనుకబాటుతనం, ప్రాతినిధ్యం గురించిన ఖచ్చితమైన సమాచారం లేదని తెలిపారు. ఓబీసీల విషయంలో మండల్ కమిషన్ కూడా చాలావరకు 1931 నాటి గణాంకాలపైనే ఆధారపడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇదే కుల గణన డిమాండ్ కు ఇదే ప్రధాన కారణమని వివరించారు. నమ్మదగిన గణాంకాలు లేకపోతే అదనపు రిజర్వేషన్లు, ఓబీసీ ఉప-వర్గీకరణ, న్యాయమైన ప్రాతినిధ్యం, 50 శాతం పరిమితి పునఃపరిశీలన వంటి డిమాండ్లను మళ్లీ వాయిదా వేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు కేటగిరీ (వర్గం), తర్వాత కులం. రాష్ట్రాలవారీగా ధృవీకరించబడిన డ్రాప్ డౌన్ ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో మొట్టమొదటి సారి డిజిటల్ జనాభా లెక్కలు, యాప్ ద్వారా డేటా సేకరిస్తున్నందనన దీన్ని అమలు చేయడం సులభమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనిని విజయవంతంగా ఎలా నిర్వహించవచ్చో నిరూపించిందని ఉదహరించారు. తమ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని కొప్పుల రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభా లెక్కలతో పాటే ఓబీసీ కులగణన జరుగుతుందని బీహార్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోడీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. కానీ ఓబీసీ కులగణన హామీని విస్మరించి జనగణన చేస్తుండటంతో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిలదీసిందన్నారు.
దాంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫ్యామిలీ సర్వేతో పాటు ఓబీసీ కులగణన చేస్తామని పార్లమెంటులో వెల్లడించారనీ, అయినా ఫ్యామిలీ సర్వేలో ఓబీసీ ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిర్వహించిన కులగణనలో ఖచ్చితంగా134 ఓబీసీ కులాలను గుర్తించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సోషియో ఎకనమిక్ సర్వేలో 46 లక్షల కులాలు వచ్చాయని, ఇది సరైన ఓబీసీ జనగణన కాదని కొట్టిపారేశారు. గత పదేండ్లుగా ఓబీసీల సామాజిక న్యాయ అజెండా అమలు కావడం లేదని కొప్పుల రాజు తెలిపారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన కులగణన నినాదం ఉద్యమంలా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా కుల సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలబడిందని తెలిపారు. తెలంగాణ మోడల్ ను కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాల్సిందేనని అన్నారు. బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతను తెలంగాణలోని బీజేపీ ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



