Sunday, September 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడు తరాల్ని ముంచేశారు

మూడు తరాల్ని ముంచేశారు

- Advertisement -

దగ్గర్లోనే కాంగ్రెస్‌ను నిషేధిత జాబితాలో పెట్టే రోజులు
పాలిటెక్నిక్‌ భూములపై ప్రభుత్వం కన్ను..జీవో 97ను అసెంబ్లీలో
ఎండగడతాం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / రాజన్నసిరిసిల్ల / వేములవాడ
​’కాంగ్రెస్‌ పార్టీనే నిషేధిత జాబితాలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ఒక్క మంత్రినే బర్తరఫ్‌ చేయడం కాదు.. ఆ ప్రభుత్వాన్నే బర్తరఫ్‌ చేసే రోజులొచ్చాయి’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చ కపోవడాన్ని నిరసిస్తూ.. కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ యూత్‌ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని డైలాగులు ‌కొట్టి వెయ్యి రోజులు దాటినా ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. బకాసురుల్లా మేస్తూ, కుంభకర్ణుల్లా పడుకుంటూ, పందికొక్కుల్లా తింటూ పాలనను గాలికి వదిలేశారన్నా రు. ‘ఇన్ని రోజులుగా యువతను మోసం చేసిన ధోకేబాజ్‌ రేవంత్‌ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. పేదల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్న కాంగ్రెస్‌ను రాబోయే రోజుల్లో ప్రజలే నిషేధిత జాబితాలో పెట్టడం ఖాయం’ అని అన్నారు.

​పాలిటెక్నిక్‌ భూములపై కాంగ్రెస్‌ కన్ను..
సిరిసిల్ల, వేములవాడ (అగ్రహారం) పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులను కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 97 వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌, సిరిసిల్ల, కరీంనగర్‌లోని విలువైన పాలిటెక్నిక్‌ భూములు, ఆస్తులను ఇతర అవసరాలకు మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవో 97ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ పర్యటనలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

​అలుగునూరులో తృటిలో తప్పిన ప్రమాదం
కేటీఆర్‌కు కరీంనగర్‌ ‌శివారులోని అలుగునూరు చౌరస్తా వద్ద మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ క్రేన్‌తో గజమాల వేసి సన్మానించాయి. ఈ సం దర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు కేటీఆర్‌కు పోటీపడి చేతినిండా రాఖీలు కట్టారు. కేటీఆర్‌ కారు వెనుక డోర్‌ తెరిచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో కారు డోర్‌ స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలూ కాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -