లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలి
వానాకాలంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
అక్టోబర్ 1 నాటికి 8,283 కొనుగోలు కేంద్రాలు
దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌పై అధ్యయనం
ఏడు సన్న రకాల ఎంపిక
బియ్యం అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని, ధాన్యం విక్రయించిన అనంతరం నగదు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళికతో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్–2026-27లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని వెల్లడించారు. శనివారం మంత్రి హైదరాబాద్ లో అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటిలో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, మరో 731 ఇతర కేంద్రాలు ఉంటాయని వివరించారు. అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో 15 రోజుల ముందుగానే ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 కనీస మద్దతు ధరగా నిర్ణయించిందని తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధాన్య సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్టు చెప్పారు. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ–సోనా, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలకు ఈ బోనస్ వర్తిస్తుందని వెల్లడించారు. వీటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరం మెరుగైన ధర లభించే అవకాశమున్న రకాలుగా గుర్తించామని వివరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేదా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నా రైతుకు గిట్టుబాటు ధర లభించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలోనూ స్థిరమైన ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుత వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 119.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలిపారు.
ఇందులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కలిపి మొత్తం 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. నవంబర్‌లో 24.72 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్‌లో 25.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం,నాణ్యత నిర్ధారణ పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. టెండర్లలో పాల్గొనే రవాణా కాంట్రాక్టర్లకు అవసరమైన సంఖ్యలో లారీలు సొంతంగా ఉన్నాయా లేదా వాటిని సమకూర్చుకునే విశ్వసనీయ ఏర్పాట్లు ఉన్నాయా అనే విషయాన్ని ముందుగానే నిర్ధారించాలని సూచించారు. 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరమనీ, ప్రస్తుతం 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయనీ, మిగిలిన సంచుల సేకరణ వేగవంతం చేయాలని కోరారు. ప్రతి జిల్లా సమగ్ర నిల్వ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అనధికారికంగా ధాన్యం రాకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.



