విద్యార్థులకు సులభతర బోధన పద్దతులకు గాను వరించిన పురస్కారం
ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందజేత
రాజ్యాంగంలోని సమాన అవకాశాల సాకారానికి విద్యే ప్రధాన సాధనం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ కామారెడ్డికి చెందిన ఉపాధ్యా యురాలు భవాని బొంపెల్లి ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ టీచర్స్ అవార్డు-2026’ను అందుకున్నారు. చిన్నారులకు చదువును ఆనందంగా మార్చడంతో పాటు బాలికల భద్రతపై ఆమె వినూత్న పద్దతుల్లో అవగాహన కల్పిస్తోన్న ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేశారు. మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా… శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా 27 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు సంస్థల నుంచి మొత్తం 48 మంది టీచర్లు ఈ అవార్డులను అందుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారిలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా భవాని బొంపెల్లి సేవలందిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులకు క్లిష్టమైన అంశాలను కూడా రైమ్స్, యాక్టివిటీస్, జోయ్ ఫుల్ లర్నింగ్ పద్దతుల్లో(ప్లే అండ్ డిజిటల్) సులభంగా అర్థమయ్యేలా బోధించడం భవాని ప్రత్యేకత. ముఖ్యంగా ఆడ పిల్లల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అంశాన్ని చిన్నారులకు భయం కలిగించకుండా పాటలు, రైమ్స్తో అవగాహన కల్పించే ప్రయత్నం ప్రత్యేక గుర్తింపు పొందారు.
గణితాన్ని, అచ్చులు-హల్లులు, ఇతర అంశాలను భవాని ఇన్నోవేషన్ పద్దతిలో భోదిస్తున్నారు. ఎడ్యుకేషన్ వీడియోస్తో పాఠాలు చెప్పే ఆమె, ‘యూట్యూబ్ పంతులమ్మ’ గానూ గుర్తింపు పొందారు. మండల, జిల్లా స్థాయిల్లో గుర్తింపు పొందడంతో పాటు 2025లో తెలంగాణ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని భవాని అందుకున్నారు. హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు కు జాతీయ పురస్కారం తెలంగాణకు చెందిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే మంగళగిరి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ బాబుకు పీడియాట్రిక్స్ విభాగంలో ఈ నేషనల్ అవార్డు వరించింది. కాగా.. నేషనల్ టీచర్స్ డే పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు (హెచ్ఈఐ), పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 21 మంది అధ్యాపకులను కేంద్ర విద్యాశాఖ ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 కు ఎంపిక చేసింది. ఇందులో కేంద్ర ఉన్నత విద్యాసంస్థల నుంచి 12 మంది, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ఐదుగురు (మూడు ప్రభుత్వ, రెండు ప్రయివేట్ కళాశాలలు), పాలిటెక్నిక్ కళాశాలల నుంచి నలుగురికి (రెండు ప్రభుత్వ, రెండు ప్రయివేట్ కళాశాలలు) అవార్డులు ప్రకటించింది. కాగా… తొలుత పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే ప్రకటించిన ఈ వార్డులను… 2023 తరువాత ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని విస్తరించారు.
రాజ్యాంగంలోని సమాన అవకాశాల సాకారానికి విద్యే ప్రధాన సాధనంః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని సమాన అవకాశాల ఆదర్శాన్ని సాకారం చేసుకోవడానికి విద్య అత్యంత ప్రభావవంత సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ప్రాథమిక పాఠశాల డ్రాపౌట్ రేటు దాదాపు జీరో పడిపోయిందని అభినందించారు. నేషనల్ టీచర్స్ అవార్డ్-2026 ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. విద్యా వ్యవస్థకు పాఠశాలలే విద్యా పునాదులని గుర్తు చేశారు. నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి భారత్ సాధ్యమవుతుందన్నారు. దేశాభివృద్ధిలో వైద్యా నైపుణ్యం, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విజ్ఞాన శక్తిగా ఎదగడంతో పాటు, భారత్ ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా నిలపడం దేశ ప్రాధాన్యత అని పిలుపునిచ్చారు. జ్ఞానమే గొప్ప శక్తి వనరు అని నొక్కి చెప్పారు. విద్య మనకు స్వతంత్ర్యంగా ఆలోచించడానికి, సరైన నిర్ణ యాలు తీసుకోవడానికి, దేశ ప్రగతికి అర్థవంత మైందన్నారు. అంకింతభావం కలిగిన ఉపాధ్యా యులే దేశ నిర్మాణంలో ముందుంటారని అన్నారు. ప్రాథమిక తరగతి గదుల్లో… పిల్లల మేధో, శారీరక, నైతిక వికాసంపై శ్రద్ధగా దృష్టి సారించడం ద్వారా, ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్యా ర్థులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ద గలరన్నారు. మహిళల హక్కులు, విద్య పురోగతలో సావిత్రిబాయి ఫూలే పోషించిన కీలక పాత్రను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.



