కేతిగాడు : యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా.. ఈ చీకటే మాసిపోదా (పాట).
అరేయ్ జుట్టుపోలుగా, యువత సాధిస్తున్న విజయానికి నా గుండెలు ఉప్పొంగుతున్నాయిరా. మొన్నటికి మొన్న జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమానికి కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఆ సందర్భంగా యువతపై, విద్యార్థులపై పోలీసులు చేసిన దమనకాండ చెప్పడానికి అలవి కాదు. ఇప్పుడు ఆ యువతపై (బొద్దింకలపై) పెట్టిన కేసులను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. జులై 20 నుండి 25 వరకు విద్యార్థి యువజన ఆందోళనలకు సంబంధించి దేశ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత గొప్ప విషయం. ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయం ఇంకా బతికే వుందని చెప్పుకోడానికి ఇదో చిన్న ఉదాహరణ. అలాగే నీట్ పరీక్ష లీక్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భానికి కారకుడైన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పు వెలువరించడం మరో విశేషం.
జుట్టుపోలుగాడు : ఇందులో విశేషం ఏముంది? చట్టం దాని పని అది చేసుకుపోతున్నది.
కేతిగాడు : అబ్బ ఛా.. 2002 గుజరాత్‌లో నరమేధం జరిగినప్పుడు, అప్పటి ప్రధాని వాజ్‌పాయ్ అన్నట్టుగానే నీవూ చెప్తున్నావు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఉన్నప్పుడే, ఆయన సారధ్యంలోనే ఈ నరమేధం జరిగినట్టు లోకం కోడై కూసింది. చేతులకు అంటిన రక్త పంకిలం అంత త్వరగా పోదు, గుర్తుంచుకో. సెప్టెంబర్ 12-13 తేదీలలో ఢిల్లీలో బ్రిక్స్ దేశాల సమావేశం సందర్భంగా మరోసారి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయితే.. అంతర్జాతీయంగా పరువు పోతుందేమోనన్న భయంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించిందని అర్థమవుతుంది.
జట్టుపోలుగాడు : అదిగో మళ్లీ ప్రభుత్వాన్ని, కోర్టును ఒకే గాటన కడ్తున్నావు. రెండింటిని వేరువేరుగా చూడటం నీకు చేతకావడం లేదు.
కేతిగాడు : అరేయ్ జుట్టుపోలుగా… కాస్త బుర్ర ఉపయోగించరా. జెన్ జీ తర్వాత తరం జెన్ ఆల్ఫా విద్యార్థి లోకం కూడా రోడ్లెక్కి ‘మా బడులు బాగు చేయండి. మాకు చక్కగా చదువులు చెప్పి మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి’ అని ఉద్యమిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఆరేళ్ల బీహార్ బుడ్డోడు ఆదిత్యే ఒక తార్కాణం. సోషల్ మీడియాలో ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పైగా మాపై కేసులు ఎత్తివేయకపోతే, విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయకపోతే సెప్టెంబర్ 5న మరల జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించింది.
జుట్టుపోలుగాడు : అందువల్లే సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చిందన్నమాట.
కేతిగాడు : అన్నమాటేంటి, ఉన్నమాటే. అందుకే ఆ సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ గళం విప్పబట్టే, తమ ఉద్యమానికి ఈ న్యాయం దక్కిందని వివరించాడు.
బంగారక్క : మావా కేతిగా.. మా బాగా చెప్పావు. రైతులైనా, కార్మికులైనా, మహిళలైనా, విద్యార్థులైనా.. రోడ్డెక్కిన ప్రతివారూ చేసే మొట్టమొదటి నినాదం.. వుయ్ వాంట్ జస్టిస్. మాకు న్యాయం కావాలి. న్యాయం ఎప్పుడూ బలహీనుల పక్షాన, బాధితుల పక్షాన ఉండాలి. అలాగాక, ప్రభుత్వ తప్పుడు చర్యలకు కొమ్ముకాస్తుంటే ఉద్యమాలు అనివార్యంగా పుట్టుకొస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్న, అసమ్మతి, ధిక్కారం సర్వసాధారణం. పాలకులు వాటిని ఆలకించి జవాబుదారీతనంతో వ్యవహరించడమే పాలనకు నిజమైన అర్థం. జస్టిస్ భుయాన్ తాజాగా చెప్పిన హితోక్తి అందరికీ శిరోధార్యం. ప్రజల శ్రేయస్సు కోసం పారదర్శకంగా పనిచేయటమే పాలకుల కర్తవ్యం. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, న్యాయ స్వాతంత్ర్యం సమకూరాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు తప్పనిసరిగా గళం విప్పాలి. పాలకుల మెడలు వంచడం అంటే పాలకులకు కొమ్ముకాసే న్యాయపాలకుల మెడలు వంచడం కూడా అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. లేకుంటే న్యాయాలు న్యాయాలుగానే, గాయాలు గాయాలుగానే మిగిలిపోతాయి.
కె.శాంతారావు, 99597 45723
న్యాయాలు
- Advertisement -
- Advertisement -



