నిశ్శబ్దంగా క్షణం కుప్పకూలింది. కోడికూతనే లేపే పొద్దు అస్తమించినట్టు చీకట్లనే ముసల్ది నిద్దురలోనే కన్ను మూసింది. అందరున్నా ఒంటరి జీవితాన్ని గడుపుతూ గాలిలో దీపమైది. తెల్లారేసరికి లచ్చవ్వ అస్తమించిందని తెలిసేసరికి అందరూ చివరి చూపు సూడ్డానికి అవ్వ ఇంటికి బయలుదేరుతున్నారు. వస్తూ వస్తూ బాటలోనే అవ్వ జ్ఞాపకాలు కూడలిలో కలిసినట్టుగా ఏకమైతున్నయి. ఆడబిడ్డలు కొంగు సేతపట్టుకొని దుఃఖ క్షణాల్లో కదలలేక ఒకరినొకరు ఓదార్చుకుంటున్నరు. అయినా ఆడబిడ్డకు కన్నీటికి విడదీయని బంధం ఉన్నట్టుంది. కష్టాలను కడుపులో దాచుకుని మోయలేని బాధలను భరిస్తరు. అందుకే కన్నీటితో ఓదార్చుకుంటరు. అవ్వలేదనే విషయం తెల్సిన ఊరోళ్ళందరు అక్కడకు రావట్టే. అందరికీ ఆప్తురాలు కనుక ఈ సంగతి ఇంకా తెల్వని వారికి సమాచారం చేరుటకు సదువుకున్న పోరగాళ్ళు సెల్లులు సేతవట్టి సుట్టరికానికి కబురు పెడ్తున్నరు.
నిజానికి సావు ఎవరిని ఎపుడు పిలుస్తదో ఎవరికి ఎరుక. అవ్వ కన్నమ్మ కష్టాలు పడి సంసారాన్ని నడిపేది. తన పెనిమిటి తన కంటే ముందే పోయిన దిగులు కొంత ఉన్నా దైర్యం జేసుకొని పిల్లల మీదనే పాణం పెట్టుకొని, పూటకు లేకున్నా శాతనైన కాడికి రెక్కల కష్టం చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. కానీ జీవితంలో చివరి క్షణాలు గడ్డు పరిస్థితి ఇచ్చింది. ఇరుకు బతుకులు ఒద్దని ఇడి ఇడి కాపురాలు విసిరేసినట్టు పెట్టుకున్నరు కన్న బిడ్డలు. ఒక్కతే ఎలాంటి ఆసరా లేకుండ పాత మట్టింట్ల చీకటిని భరిస్తూ గాలి దీపమైది. కానీ ఒకప్పుడు గీ పాతింటికాడ అందరూ కలిసి ఉన్నపుడు ఉన్నదంట్లనే తృప్తిగా మసులుకుంట పెంపుడు జంతువులతో, పాడి పశువులతో ఉండేటోళ్లు.
‘‘గంజిబువ్వ, రోకలి తొక్కు రొట్టెలు తింటూ బైట వాకిల్ల మంచం ఏసుకొని బతుకు పాఠాలు సెప్పుకుంటా, కష్టాలను పంచుకుంటూ వేపసెట్టు గాలికి గడిపేటోళ్ళు. కానీ లేవలేని దినాల్లో పట్టించుకోక బెంగతోనే పోయిన్నట్టుంది’’ అంటూ అవ్వ పినుగకాడ ఎక్కెక్కి ఏడుస్తూ కొంగుతో కండ్లల్ల నీళ్ళను తుడుచుకుంటు దుఃఖాన్ని దిగమింగే మాటలు కదులుతున్నాయి.
పాలోల్లు, అవ్వపై అభిమానం ఉన్నోళ్లు అందరూ బాధలో మునిగారు. ఇంకా ఎవరికైనా సంగతి ఎరుకకాలేదోనని సత్తిగాడు లచ్చవ్వ పెద్దకొడుకును ఆకా తీయవట్టే. “ఇంకా అందని సంగతి ఐతివ అమ్మా ..” అంటూ ఏడ్వవట్టే.
అవ్వకు నలుగురు సంతానం. తొలుచూరు సంతానం ఆడబిడ్డ పురిట్లనే ప్రాణమిడిసింది. తర్వాత తొలిచూరు యాదగిరి, తర్వాత బిడ్డ అలివేలు, ఆఖరికి చిన్నోడు మల్లేశం. తొలిచూరు తర్వాత పుట్టిన పెద్దోడు అంటే పాణం. అందుకే అవ్వ స్పర్శను తాకుతూ ఏడుస్తున్నడు. తల్లికోసం పరితపించే లేగదూడలా అలివేలు అమ్మ కోసం వెతకవట్టే. కనపడ్డ వెంబడే శోకరాగంతో అవ్వ మీద పడ్డది … ఇది చూసిన ఊరి ఆడబిడ్డలంతా బోరున ఏడ్వవట్టే. ఎందుకంటే తల్లిబిడ్డలు ఏగిన బాధలన్ని యాదికొస్తున్నయి ఆ క్షణం. మనవళ్ళు మనవరాళ్లు నాయనమ్మ ఇక లేదని నమ్మలేకపొతున్నరు. లచ్చవ్వ కూలికొయి రేగుపళ్ళు, కలింకాయలు కొంగుల ఎరుకొచ్చేది. అలాగే ఆకుల సంచిల పైపల కోసం కొట్లాడుతుంటే సెరిసమానం జేసి ఇచ్చేది. కానీ ఇగ అవ్వలేకపోతే ఎట్లని పసిప్రాయం అందరి శోకరాగంలో కలిసిపోయారు. ఎదురుంగ సిలుకొయ్యకు ఏలాడుతున్న పెనిమిటి డప్పు దరువునై ఏడుస్థనటుంది…. కానీ చిన్నోడేమో ఇంకా ఆ మాయదారి మత్తులోనే ఒడ్డుకు రాపాయే. కానీ అమ్మ లేదని సెప్పినాక కండ్లల్ల నిప్పురాయి పడ్డంత పనైంది. ఇంత పరిస్థితుల్లో ఊరంతా పడావు పడ్డట్టు నిశబ్దంగా కాలం నెమ్మదిగా కదులుతున్నది.
ఇంతలోనే ఇదంతా జరిగే పనే పదా. అయ్యే కార్యం కానియ్యాలి అంటూ పెద్ద మనుషుల ఓదార్పుతో కూడిన జరంత ధైర్యం నింపే ప్రయత్నం. అవ్వ పార్ధీవదేహం వద్ద కాలంతో పాటె అగరొత్తులు కూడా బూడిదవుతున్నాయి. ఎదురుంగ పెనిమిటి డప్పు శిలుకొయ్యకు ఏలాడుతూ దీనంగా చూస్తున్నది… మిగతా కార్యంకై పెద్దమనుషుల ధైర్యపు మాటలు… కదులుతున్నాయి
అందరికి సమాచారం ఇస్తున్నట్టు వాట్సప్‌లో సత్తిగాని స్టేటస్ లచ్చవ్వ చూస్తూ ఒక్క క్షణంలో గుండెపలిగినంత పనాయే సూరికి. వెంబడే సత్తికి కాల్ కొట్టాడు …‘‘హాల్లో లచ్చవ్వకు ఏమైందిరా మొన్ననే ఫోన్ మాట్లాడితి …హాల్లో …హాల్లో ఏమాయెరా’’ అంటూ కంగారు మాటలు. అక్కడ సిగ్నల్ కంటే శోక రాగాలు డప్పు సప్పుల నడుమ ఏమి వినోస్తలేదు. అక్కడున్న ఆంతర్యం అర్థం చేసుకొని బయలు దేరిండు. తనకు కొంతసేపు సూపు ఆగినంత పనయింది. ఈ బాధను మోస్తూ వెలితిగా కదిలాడు తన చుట్టూ పరిళమించే పలకరింపులున్న వాడిపోయాడు ఎందుకంటే అవ్వతో ఉన్న అనుబంధం అలాంటిది. తను తల్లిలేని బిడ్డ తండ్రి చేవలేని స్థితిలో ఉంటే అవ్వ చెట్టునీడల ఆదుకునేది. నాకు మరో తోడు లేకుండ అయే తను ఎంతో సంపాదించి తన బిడ్డలను సదువనియలేదని అంతో కొంతో నన్ను సదవమనేది అవ్వ లేకపోతే నేను లేను.
నేను లచ్చవ్వ తో కలిసి పరిగెపత్తి ఎరుటకు, కల్చుటకు వెళ్ళేవాడిని నా సాలు వెనకబడితే నాకు ఎదురు సాలు పట్టేది. నా పేదరికంలో అవ్వ బువ్వ అయేది అందుకే అందరున్న ఇట్టి పేదరికం పోదని ఎట్లనన్న సదువుకోరా అంటూ ఎప్పుడు సెప్తుండేది. అవ్వ కొడుకులు వేరుబడ్డంక పాత ఇంటికి దూరంగా ఇళ్లు కట్టుకున్నరు. దాంతో ఒక్కతే చీకటిలో చిన్న దీపమోలే ఒంటరిగా ఉండేది. మేము ఇరుగు పొరుగు కావడం కూడా నాకు తల్లి లేని లోటు లేకున్నది. కొన్నిసార్లు అవ్వ కూలికొయిన పైసలు నా వద్ద దాచుకునేది. లోకం బ్రతుకుటకు డబ్బు అవసరమే కానీ డబ్బునే నమ్ముకుంటుంది అందుకేనేమో అవ్వ పిల్లలు కూలినాలి చేసుకునే అవ్వ డబ్బులకు వాళ్లు ఎపుడు కొట్లాడుకునే వారు. అవ్వ మనువళ్ళకు ఇచ్చేది. కానీ ఊళ్లకు చిన్న చిన్న వ్యాపారం చేసుకొనేటోళ్లకు ఇన్ని నీళ్లు ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ బతుకుపాఠం చెప్పేది. సావు ఎపుడోస్థాదో అని అందరికి శెతనైన సాయం చేసేది అంతటి గొప్ప మనసు నేడు విడిపోతదని అనుకోలే అనుకుంటూ తన బ్యాగులో మరచి పోకుండా దాచుకున్న జ్ఞాపకాలన్నీ పెట్టుకొని బస్సులో రోతను మననం చేసుకుంటూ కదిలాడు ఎందుకంటే అక్కడ అవ్వను చివరి చూపు కోసం ఉంటదో ఉండదో అని ….
అగరొత్తులు ఆరిపోతూ బూడిదను ఇస్తున్నాయి కాలం విలువ తెలుపుతున్నాయి లచ్చవ్వ పెనిమిటి డప్పు ఎదురుంగనే శిలుకొయ్యకు వేలాడుతూ దరువుతో తన వద్దకు ఆహ్వానిస్తున్నట్టే.. ఇంతలోనే “అరేయ్ పొద్దు పోవట్టే కట్టే కట్టక తప్పదు ఎవరైనా పోవాల్సిందే కాకపోతే ముందు ఎనకా అంతే …పదండి పదండి ఇగ శాశ్వతం ఏది లేదు అంటూ దుఃఖ సంద్రం ను మరిసే ప్రయత్నం చేస్తుంది పెద్దరికం” కానీ దహన సంస్కారాలకు ఒక పిలుపు పలకరిస్తుంది గుంతలు తీయుటకు కట్టే కట్టుటకు కూలీ కుదరాలి ఆ పైకం ఇవ్వాలి అంటూ నిర్మొహమాటంగా మాట వచ్చింది. “ఉన్నప్పుడు ఆ ఇంటికే అంత ధార పోసిరు కదా ఇగ ఇప్పుడు ఒగల ఏడ్పులెందుకు ?” అంటూ చిన్న కోడలు మిట్ల కన్నుతో ఏడుపు తన మొగుడు తాగుబోతుడై సంసారం నాశనమైందనే కోపంతో అనవట్టే. అయిన పెదొళ్లకు చిన్నచితక పుల్ల అంటూ సేతకాకున్న ప్రేమతో ఇగురం చేసింది అంటూ చిన్నకొడలు. మాకెమి పోసింది దిక్కుతోచక నెట్టుకొస్తున్నాం. మీ ఇంటి దీపానికి నూనె అందించింది మరిచారా అంటూ పెద్ద కోడలు. ఒకరికి ఒకరు వాదించుకుంటున్నారు ఇంతలోనే “గివన్నీ అంటారమ్మ వెలుగు పోయినక చీకటి దాని గొప్పేమి లేదన్నట్టు మన బాధ్యత మనం నిర్వర్థించలే కదా “అంటూ మానవత్వం ను గుర్తుచేసిన పెద్ద మనుషులు .”ఎంత పని అయే అమ్మా నీవు పడ్డ తిప్పలన్ని యాదికొస్తున్నాయి నాకు జరమొచ్చి లేవలేకుండా పడితే కష్టపడి చేసుకున్న కళ్లకడియాలు అమ్మి వైద్యం సేయించినవ్ మాకేమో బలమైన తిండి పెట్టి నీవు మాత్రం పుంటికూర తో సర్దుకున్నావ్ మాయమ్మ. నీ క్షేమం కంటే, కష్టం కంటే ఏడ రాయి కన్పించిన దేవుదంటూ మొక్కినవ్ అన్ని కష్టాలు పడ్డ నీకు ఈ పేద బిడ్డలు ఇపుడు కూడా దిక్కులేని పక్షిగా చేసినం అమ్మా మమ్ముల క్షమించమ్మ ….పది మందికి సాయం చేసిన నీవు ఇట్ల పోవద్దు. ఇంత మాతృమూర్తి కోసం వంతులు చూసుకుంటున్నారు నా వద్ద చిల్లిగవ్వ లేకున్నా నాకు మిగిలిన ఆవుదూడ అమ్మైనా చేస్తాగాని చేయిరయ్యా”అంటూ అమ్మనికే లేస్తున్నాడు. ఇక చిన్నోడికి మాసిన ముఖంతో ఎం చేయాలో తొస్తలేదు తాగి తాగి అప్పుల మునిగి సప్పుడలేని మద్దెల అయిండు కానీ కన్నతల్లి ముందు సంటోనిలెక్క ఎక్కి ఎక్కి ఏడ్వవట్టే .ఇక ఆడబిడ్డ సంసారం కూడా అంతంతనే ఉండవట్టే ఇంతటి పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు. అదేందో ఆ గల్లీ బతుకుల్లో దినకూలి ఖచ్చితంగా కావాలె .పొద్దు గడవాలి అంటే డబ్బు కావాల్సిందే మానవవిలువలు సైతం నిర్మొహమాటంగా వదిలేసే పరిస్థితి ఎందుకంటే ఇయ్యాల చేస్తేనే రేపు భద్రం అన్నట్టు ….
అయితేవాయే అనుకుంటూ రోతల్లోనే అటు ఇటు వెతుకుతూ నుదుటిరాతను తిట్టుకున్నారు. పెద్దమనుసులు ఈ బాధను చూడలేక మాట్లాడలేక దుఃఖాన్ని మింగుతున్నారు. అది ముందుకే చిల్లరగల్లీ గాడ కొనేటోళ్లు ఎడుంటరు. వాళ్ళ బతుకులు అమ్ముకునుడే తప్ప. కానీ ఒక్కగానొక్క తాకట్టు లింగరాజు గాడు ఉన్నడు వానికి కఠిన పరిస్థితులొస్తే లాభం వాగుతుంది. కానీ శవమంటూ అడిగిన బిత్తరపోతడు. ఈ సమాజం పేదోని పరిస్థితులకు చిన్నచూపు చూస్తే చావక ఏం చేస్తాడు .అవ్వలంటి అమ్మమ్మ, నాయనమ్మల పరిస్థితులు ఎవరూ పట్టించుకోరు వారి అనుభవం అందిపుచ్చు కోరు. ఇగ పెద్ద మనుషుల తొందరపాటు నడుస్తుంది. వీరేమో రోతనలు దహన సంస్కరణలు అగుతుంటే “అయ్యా మానవత్వంగా మేమెందుకు చేయం కానీ సరుకులకైనా కావాలి లేకపోతే గిట్టే మనిషికి విలువలేకుండా పోతుంది. జర గాపని చూడుర్రి తప్పుగా అనుకోకుర్రి “అంటూ వాళ్లలో ఒకరొచ్చి అంటున్నరు. వాళ్ళకు ఎం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక అక్కడ కదిలిన బస్సు ఊరికొచ్చేసరికి నిశబ్దంగ సంగ్దిదంలో మునిగింది. తనను బస్సు సాగనంపుతుంటే తన వెంబడి వచ్చిన వారు ఒంటరి చేసినట్టు అవ్వ బాధను దగ్గరకు తోస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే చివరిగా అవ్వ ను చుదాల్సివస్తాదనుకోలే …
ఊరు ఊరంతా నిశబ్దంగా ఉంది ఎవరు కానొస్థలే బస్టాండు కాడ జాఫర్ కూడా హోటల్ బందుజేసీ పోయిండు అంతటి సేవ మూర్తి నా లచ్చవ్వ ..
ఇంతలోనే గుమిగూడిన జనంను చూస్తుంటే ఒక్కసారిగా దుఃఖం తన్నుకొస్తుంది అలాగే ఒక చిన్న సందేహం అవ్వ ఉందొ లేదోనని చివరిచూపు లేకుండానే విడిపోయిందే నా ఆత్మబంధువు అనుకుంటూ తన బ్యాగును వదిలేసి గబ గబ తన అవతనికి ఊరికిండు. కిక్కిరిసి జనం మధ్యలో అందర్నీ ఆణిముత్యం కోసం తవ్వుతున్నాడు ప్రక్కకు జరుపుతున్నాడు. అగరొత్తు ఆరిపోతూ శిలుకొయ్యకు వేలాడిన డప్పు రోతగా కదులుతూ ఆడపడుచుల శోక రాగలలో ధీనమైన పరిస్థితుల్లో లచ్చవ్వ ముఖం అగుపించించి. ఇక సూరికి దుఃఖం కట్టలు దెంచుకుంది. దాంతో తన జేబులో దాచుకున్న జ్ఞాపకాన్ని నెమరుకుంటు ఒక్కసారిగా అవ్వపై పడి పసివాడిలా ఏడ్వవట్టే.”నా కోసమే ఇంతసేపు ఆగవమ్మా నీ కడుపులో పుట్టకున్నా కాచుకున్నావు నా దోస్తువైనవు నిన్ను నీ జ్ఞాపకాలను ఇంకా పదిలంగ దాచుకున్న తల్లీ!! నన్ను కూడా ఒంటరి చేసి పోతివి …..! నాకున్న ఒక్కగానొక్క ధైర్యం పోతే నేనేట్ల అమ్మా…”అంటూ బాధను మింగలేక పోతున్నాడు.
అవ్వ బిడ్డలు కూడా ఒకరిని పట్టుకొని ఒకరు ఎదర్చుకునే ప్రయత్నం జేస్తున్నారు.
పొద్దు పోతుందని పెదమనుషుల ఆత్రం కానీ ఇంకా కార్యానికి కుదరని సరుకులు దాంతో అపుకోలేని దుఃఖం తో పెద్దోడు అవుదూడను అమ్మనికే లింగరాజును బ్రతిమాలనికే పోతుండు కానీ మనుషులే బ్రతికేది చెప్పలేం గొడ్డు ఎలా నమ్మశక్యం అయిన అది బక్కచిక్కిపోయింది రేపో మాపో పోతది తీసుకుంటాడో తిరస్కరిస్తాడో అనుకుంటూ తాడు ఇప్పుతున్నాడు. చిన్నోడు పెదొడు ఇది కుదరని పని అని అనుకుంటనే ఉండరు. పెద్ద మనుషులు కడు పరిస్థితి దీని వల్ల కాదని నఛ్చాచెప్పే ప్రయత్నం. ఇంత శోక యుద్ధాని భరిస్తూ తన జేబులో దాచుకున్న జ్ఞాపకాలను దువ్వుతున్నడు. తను చదువుకొనికే డబ్బులు లేకపోతే అవ్వ తను మోకాళ్ళ నొప్పులతో కూలికొయి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది. అది జీవితాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞతతో తను పట్నంలో చదువుకుంటూ చిన్న చితక పనులు చేసుకుంటూ వాటిని తిరికి తెచ్చుకొని భద్రంగా దాచుకున్నాడు అవ్వను చూసుకున్నాడు దంట్లో ..అందుకే తిరిగి అవ్వకు ఇతమనుకున్నాడు. అందుకే ఎంత కష్టమొచ్చినా తనతో చిల్లిగవ్వ లేకున్నా వాటిని మాత్రం తీసేటోడు కాదు ఎందుకంటే పోయిన నెలలోనే నాన్న చనిపోతే కూడా తియ్యలే. ఆ సొమ్ములను చూసుకుంటూ ఇంకా ఏడ్వవట్టే
కానీ అవ్వ అన్నే ఆగిపోయే అవ్వకు సంతోషంగా ఇద్దమని భద్రంగా పెట్టుకున్నాడు. వీళ్ళు కొట్లాటలో ఎంతకు కదట్లేదు బహుశా అవ్వ దీని కోసమే ఆగినట్టుంది. నన్ను పాణంగా చూసుకున్న అవ్వనే పోయినక ఇక నేనేమి చేసుకొను వీళ్లేమో పడని పాట్లు పడుతున్నారు ఇది ఆగని కార్యం అందుకేనేమో అవ్వ నాతో ఈ రోజు కోసమే ఇచ్చింది బహుశా రేపు నేను సస్తే ఇవే నన్ను సాగనంపుదయని కావొచ్చు. అందుకే నాతో దాపెట్టింది అని పట్టిండ్రు అన్న అంటూ తన జ్ఞాపకాన్ని సైతం ఇచ్చేసి బోరున ఏడుస్తున్నడు .
ఇక వాటిని పెద్ద మనుషులు తీసుకొని తాకట్టు లింగరాజుకు కొంత సొమ్ముతో సంస్కరణ సామాను తీసుకొచ్చి మిగతా కార్యం చేస్తున్నారు. అవ్వ కాటికి పోతుంటే సతిగాని ఇదేదో గొప్ప అనుభవ పాఠం అన్నట్టు దోస్తులకు చెబుతుండు “అరే అవ్వ ఇంత సంపాదించిన అక్కర రాలేదు కానీ కాళ్ళ నొప్పుల వయసులో కూడా భూమిని పాకుతూ కూలికిపోయి గా గెంటీలు చేపించుకున్నది అదే కాటికి తీసుకుపోతున్నది. అందుకేనేమో గీ ముసలోళ్లు అందరూ సంసారంను ఎత్తుకుంటే బరువు కాదు కానీ దింపుకుంటే కరువు అన్నట్టు వృద్ధ కాలం నేర్పుతుంది. అందుకేనేమో బక్క పలుచని ప్రాణాలను సేతులకు, కాళ్ళకు కడియాలు, సొమ్ములు ఆస్థులుగా పెట్టుకుంటారు… కొన ప్రాణానికి కొసరు విలువ అన్నట్టు మానవత్వం తెలియజేస్తుంది.
రామ్ పెరుమాండ్లు
గెంటీలు?
- Advertisement -
- Advertisement -



