కితాబ్ ఘర్
తెలుగువారి ఆత్మగౌరవ సంకేతం. తెలుగు భాషకు, ఆ భాషలో వెలసిన కావ్య రత్నాలకు, వేదశాస్త్రాలకు, ఉర్దూ సాహిత్యానికి, ఆంగ్ల వాజ్మయానికి నిలయంగా విరాజిల్లుతున్న ఈ మహాసౌధం హైదరాబాద్ సుల్తాన్ బజార్ నడిబొడ్డున ఆత్మాభిమానంతో నిలబడి ఉంది. అదే శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం.
ఇది కేవలం ఒక గ్రంథాలయం కాదు. తెలుగు జాతి జ్ఞానతృష్ణకు ప్రతిరూపం, మన సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక. 1901 సెప్టెంబర్ 1వ తేదీన.. అంటే దాదాపు ఒకటిన్నర శతాబ్దం కిందట ప్రారంభమైన ఈ పొత్తపు గుడి ఇప్పటికీ తన వెలుగును చిమ్ముతోంది. ఆనాటి తెలంగాణలో తెలుగు భాష దుస్థితికి బాధపడి, విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగాన్ని స్మరించుకుని, దిగ్గజులు రూపొందించిన ఈ సంస్థ తెలుగు సంస్కృతి, సాహిత్యాలకు పునరుజ్జీవనం తెచ్చింది. అద్భుతం! వారికి ఎంతటి దూరదృష్టి ఉండాలి? గ్రంథాలయం అనేది పుస్తకాలను దాచే గది కాదు. తరతరాల జ్ఞానాన్ని భవిష్యత్తుకు భద్రపరిచే జీవంతమైన జ్ఞానభాండాగారం. ఒక గ్రంథాలయం మూసుకుపోతే ఒక భవనం మాత్రమే నిశ్శబ్దం కాదు.. ఒక సమాజపు జ్ఞాపకాల స్వరం మౌనమవుతుంది
చారిత్రక నేపథ్యం
నిజాం పాలనలో తెలుగు భాష అణచివేతకు గురైన ఆ రోజుల్లో, మునగాల రాజా నాయని వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు కలిసి ‘ఏ ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథాన్ని చదివి రాయలనాటి తెలుగు వైభవాన్ని ఊహించుకుని, నేటి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ బాధే వారిని చైతన్యపరిచింది. ఆ చైతన్యమే నేడు మనం చూస్తున్న ఈ భవ్య గ్రంథాలయంగా రూపుదాల్చింది. కందుకూరి వీరేశలింగం పంతులు, ఆంధ్రకవుల చరిత్ర వారికి స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర్యోద్యమంలోనూ, హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ ఈ గ్రంథాలయం కీలకపాత్ర పోషించిందని చెబితే ఆశ్చర్యం వేయదు. ఆంధ్రపత్రిక చదివితే దేశద్రోహమని పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు, ఆ ధైర్య సాహసాలు ఇక్కడి చరిత్రలో భాగం. ఎంతటి ఉద్వేగమంత!
వైవిధ్యమైన గ్రంథసంపద: ప్రాచీన-ఆధునిక సమ్మేళనం
ఈ గ్రంథాలయంలో తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం.. ఇలా అనేక భాషలలో దాదాపు 50,000 పైచిలుకు గ్రంథాలు ఉన్నాయి. కానీ సంఖ్య
కన్నా విశిష్టతే ముఖ్యం. ఇక్కడ 1870ల నాటి బ్రాహ్మణ మహిమ్నా దర్శమనియు, 1882 నాటి విష్ణుపురాణం, 1892 నాటి రామాయణ శ్లోకీ, 1893 నాటి వసుచరిత్రము వంటి అరుదైన ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. ఇవి కేవలం పుస్తకాలు కావు. ఇవి మన పూర్వీకుల జ్ఞాన సంపదకు సజీవ సాక్ష్యాలు. వీటిని తాకినప్పుడు,
పుటలు తిప్పినప్పుడు పూర్వకాలపు ఘమం, వాసన హృదయాన్ని పులకింపచేస్తాయి. అంతేకాదు, పాత పత్రికల సంపుటాలు , ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలు, భారతి, కృష్ణా పత్రిక, గోల్కొండ, ప్రతిభ, నవ్వులతోట వంటి వందేండ్ల నాటి పత్రికలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఆ పత్రికలు కాలానికి అద్దాలు. అవి చదివితే అప్పటి సమాజం, సాహిత్యం, రాజకీయాలు కళ్ళముందు కదలాడుతాయి. అందుకే ఇది గ్రంథాలయం కాదు.. ఒక జీవంతమైన చరిత్రా భవనం!
గ్రంథాలయోద్యమానికి దిక్సూచి
తెలంగాణలో గ్రంథాలయాల చరిత్రలో ఈ సంస్థ ఒక మైలురాయి. ఈ భాషానిలయ స్ఫూర్తితోనే నిజాం రాష్ట్రవ్యాప్తంగా 114 పొత్తపు గుళ్ళు వెలిశాయి. ఒక్కో గ్రామంలో, పట్టణంలో ఏర్పడిన ఆ గ్రంథాలయాలు తెలుగు భాషా సాహిత్యాల ప్రచారానికి, ప్రజల్లో పఠనాభిరుచికి, వామపక్ష భావజాలానికి వేదికలయ్యాయి. ఈ నిలయం ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు, నూతి శంకరరావు వంటి మహనీయులకు కర్మభూమి. వారి త్యాగాలు, సేవలు మరువలేనివి. డా. ఎం.ఎల్. నరసింహారావు 50 ఏళ్లకు పైగా ఈ గ్రంథాలయానికి ప్రాణం పోశారు. అలాంటి వారి జీవితమే ఈ నిలయానికి అంకితం. అటువంటి దాతృత్వానికి, సేవాభావానికి మనం ఎంతటి కృతజ్ఞులైనా తక్కువే. పుస్తకాన్ని సంరక్షించే గ్రంథాలయం ఒక తరాన్ని కాపాడుతుంది. జ్ఞానాన్ని సంరక్షించే గ్రంథాలయం అనేక తరాలను నిర్మిస్తుంది. గతాన్ని గ్రంథాల్లో భద్రపరిచి, వర్తమానానికి జ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు మార్గాన్ని చూపించేదే నిజమైన గ్రంథాలయం.
సాహిత్య సభలు, ఉత్సవాలు
గ్రంథాలయం కేవలం చదువుకునే చోటు కాదని, అది సాహిత్య చర్చలకు, కవి సమ్మేళనాలకు, ఆలోచనల పరిమళానికి వేదిక అని ఈ సంస్థ నిరూపించింది. నన్నయ, తిక్కన, పోతన, వేమన, శ్రీకృష్ణదేవరాయల జయంతులను, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి వారి వర్ధంతులను ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా నిర్వహించేవారు. ఆ ఉత్సవాల సందర్భంగా అమూల్య ఉపన్యాసాలు, కవితా గోష్ఠులు, పురస్కారాలు.. ఇవన్నీ తెలుగు సాహిత్య ప్రపంచంలో మధుర స్మృతులు.
1927లో వజ్రోత్సవం, 1952లో స్వర్ణోత్సవం, 1990లో నవశతాబ్ది ఉత్సవం, 2002లో శతాబ్ది ఉత్సవం.. ప్రతి ఉత్సవం ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని
సృష్టించింది. ఆ సందర్భాలలో వెలువరించిన ప్రత్యేక సంచికలు నేడు పరిశోధకులకు స్వర్ణ ఖనులు.
సాహితీవేత్తల అడుగుజాడల్లో..
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయ ప్రస్థానం అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలు, పరిశోధకులు, భాషాభిమానులు, ప్రజా మేధావులతో ముడిపడి ఉంది. సురవరం ప్రతాపరెడ్డి, రావిచెట్టు రంగారావు, బూర్గుల రామకృష్ణారావు వంటి మహనీయుల సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్యానికి ఈ సంస్థ వేదికగా నిలిచింది. అనేక మంది రచయితలు, కవులు, పండితులు, మహిళా సాహితీవేత్తలు ఇక్కడ నిర్వహించిన సభలు, సమావేశాలు, సాహిత్య గోష్టులు, ఉపన్యాసాలలో పాల్గొన్నారు. అందువల్ల ఈ భవనం గోడలు కేవలం ఇటుకలు, సిమెంటుతో నిర్మించబడినవి కావు. తెలుగు సాహిత్య చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన గోడలు.
సభల వేదికగా గ్రంథాలయం
ఒకప్పుడు గ్రంథాలయ కార్యకలాపాలు పుస్తకాలను సేకరించడం, భద్రపరచడం, పాఠకులకు అందించడం వరకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ఆ సంప్రదాయాన్ని దాటి “గ్రంథాలయం ఒక సాంస్కృతిక వేదిక” అనే భావనను ఆచరణలో చూపించింది. ఇక్కడ అనేక సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, జయంతులు, వర్ధంతులు, స్మారక సభలు, ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి. గ్రంథాలయం పుస్తకాన్ని పాఠకుడికి అందించింది, సభ పాఠకుడిని ఆలోచించే వ్యక్తిగా తీర్చిదిద్దింది, చర్చ అతనిలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచింది. ఇదే గ్రంథాలయ సామాజిక బాధ్యత.
భవిష్యత్తు దిశ – జ్ఞానదీపం శాశ్వతం
ఈనాడు సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ఈ వారసత్వ గ్రంథాలయానికి డిజిటైజేషన్, సంరక్షణ, ఆధునికీకరణ ఎంతో అవసరం. ఇప్పటికే 2005-06లో కొన్ని ప్రాచీన గ్రంథాలను మైక్రోఫిల్మ్ చేశారు. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ గ్రంథాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా అభివృద్ధి పరచాలి. ప్రాచీన గ్రంథాల పరిరక్షణకు ప్రత్యేక నిధులు, సిబ్బంది, పరిశోధనా సదుపాయాలు, అంతర్జాల ద్వారా ప్రపంచవ్యాప్త పాఠకులకు సేవలు అందించాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, ఉన్నత విద్యాసంస్థల బాధ్యత. తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించిన ఈ మహాసంస్థను ఇంకా మరిన్ని శతాబ్దాలు కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం.
వెయ్యేళ్లు కాంతివంతంగా…
దాశరథి రంగాచార్య అన్నట్లు ‘వెయ్యేళ్లు ఈ సంస్థ కాంతిమంతంగా జీవించాలి’. ఇదే నేడు మన కర్తవ్యంగా మారాలి. ఈ గ్రంథాలయంలో ప్రతి పుస్తకం ఒక చరిత్ర, ప్రతి పత్రిక ఒక స్మృతి, ప్రతి గోడ ఒక సాక్షి. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి పాఠకుడు కొత్త ఉత్తేజాన్ని పొందుతాడు. ఇది తెలుగు సామాజిక సాంస్కృతిక రేఖ, భాషా సంస్కృతుల ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పొత్తపు గుడి. తెలంగాణ సోదరుల హృదయాలలో పరకాయ ప్రవేశం చేసిన ఈ జ్ఞాన నిలయం ఇక ఎన్నటికీ మరుగున పడనీయరాదు. తెలుగువారందరం ఏకమై ఈ దీపాన్ని వెలిగించుకుందాం. పఠన సంస్కృతిని పెంపొందించుకుందాం. భవిష్యత్ తరాలకు ఈ పొత్తపు గుడి అక్షయమైన వారసత్వంగా నిలిచేలా చూద్దాం.
డా. రవికుమార్ చేగోని
98669 28327
తెలుగు జాతి విజ్ఞాన గని
- Advertisement -
- Advertisement -



