Sunday, September 6, 2026
E-PAPER
Homeహెల్త్కెరీర్‌ను స్తంభింపచేసే అవగాహనా లోపం

కెరీర్‌ను స్తంభింపచేసే అవగాహనా లోపం

- Advertisement -

మానసిక వికాసం
భవిష్యత్తులో మీ మనోభిష్టానికి తగిన విధంగా జీవించడానికి కావల్సిన చదువును ముందుగానే ఎంచుకోవాలి. అలా కాకుండా ఏదో ఒకటి చదివేస్తే అది పూర్తయిన అనంతరం ఉద్యోగాన్వేషణలో స్తబ్దత ఏర్పడి మిమ్మల్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుంది.
నా కాలేజీ చదువు పూర్తయింది. మంచి మార్కులు వచ్చాయి. సర్టిఫికెట్లు, ప్రశంసలు చేతిలో వున్నాయ్.. అప్పుడు నేను ఏం చేయాలో ఏమాత్రం బోధపడలేదు. అంతేకాదు నేను ఏం కావాలని కోరుకుంటున్నానో నాకు స్పష్టం కాలేదు. ఒక్కటి మాత్రం నాకా రోజుల్లో స్పష్టంగా తెలిసేది.. అది.. “నేను ఏదో ఒకటి చెయ్యాలని.’’.
ఏదైనా సరే ఎందుకు చెయ్యాలి..?
అవసరాలు పెరుగుతున్నాయి.
ఖర్చులు పెరిగాయి. నాన్నను పాకెట్ మనీ ఇవ్వమనిగానీ, పెంచమనిగానీ అడగలేను.
మా మమ్మీడాడీలు ఎంతసేపు నా గదిలోకి తొంగిచూడటమే సరిపోతుంది. నేను నా గదిలో కూర్చుని కాలాన్ని ఏ విధంగా పాడుచేస్తున్నానా అని వాళ్ళ కంగారు.
బయటకు బయలు దేరితే చాలు ‘ఏరా.. ఏ వుద్యోగానికి అప్లై చేశావూ’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
​5. ఇంటికి తిరిగి రాగానే “ఏమైంది నీ ఉద్యోగ ప్రయత్నం..?” మరో ప్రశ్న. ఎటుచూసినా ఉద్యోగం.. ఉద్యోగం.. ఉద్యోగం.. ఒకటే మాట. ఏ ఉద్యోగం చేయాలో నాకయితే అసలు బోధ పడేది కాదు. క్రమంగా రోజులు గడుస్తున్నాయి. భారం పెరుగుతోంది. ఇంట్లో ఈసడింపులు మొదలయ్యాయి. ఇక నిరీక్షించి లాభం లేదు. ఏదో ఒక ఉద్యోగంలో చేరాల్సిందే. పరిస్థితులు మనం చెప్పిన మాట వినటం లేదు. అవి మనల్ని బంధించటానికి చూస్తున్నాయి అని అన్పించేది. అయితే ఏ రకమైన ఉద్యోగం ఎంచుకోవాలో తెలియనే తెలియదు. ఎవరో ఏదో చెబితే గుడ్డిగా దరఖాస్తు పెట్టుకోవటం మినహా ఆ ఉద్యోగం మీద ఇదమితమైన అవగాహన వుండేది కాదు.
​ఏమిటో లోపం.. ఎక్కడుంది లోపం.. అని నన్ను నేను ప్రశ్నించుకునే వాడ్ని. అప్పట్లో నాకొక కల వస్తూవుండేది. నాకు అరవై ఏండ్లు నిండిపోయినట్లు. ఇంకా ఉద్యోగం కోసం నా సర్టిఫికెట్లు పట్టుకుని ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అన్నట్లుగా తిరుగుతూ ఉన్నట్లు. ఆ కల వచ్చినపుడు నాకు చాలా భయం వేసేది. నా బతుకిలా పూర్తి కావల్సిందేనా అని నిస్సత్తువ ఆవరించేది”
​ఇంతవరకూ మీరు చదివింది న్యూయార్కు చెందిన కెరీర్ కౌన్సెలర్ కెన్నెత్ జెడ్డింగ్ స్వీయ అనుభవం. ఇది కేవలం అతనికే కాదు, ఇంచుమించుగా చాలామంది చదువు పూర్తి చేసి, ఉద్యోగాల మహానగరంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఎదురుకావటం సర్వ సామాన్యంగా జరుగుతూ వుండేదే..!
​చదువు ఎంపిక చేసుకునే ముందరో, లేక చదువు వెలగబెడుతూ వున్న రోజుల్లోనో ‘ఏ రకమైన ఉద్యోగం చెయ్యాలి.. అనే అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన వుండి వున్నట్లయితే నాకు ఆ దుర్భర పరిస్థితి ఎదురై వుండేది కాదేమో’ అంటాడు కెన్నెత్ బెడ్డింగ్. ఈ అవగాహన లోపం చేత చదువు పూర్తయిన తరువాత ఒక్కసారిగా జీవితం స్తంభించిపోయినట్లన్పిస్తుంది. అంతేకాదు ఈ స్తంభన ఇంతేనేమో, తొలగిపోదేమోనన్న విచారం మొదలవుతుంది. స్తబ్దత మీద ఆందోళన పెరిగిపోతుంది. ఈ ఆందోళన స్తబ్దతను మరింత ద్విగుణీకృతం చేస్తుంది. ఒక్కసారి ఈ స్తబ్దత భయానికి లోబడిపోయామా.. జీవితాంతం స్తబ్దతను కౌగిలించుకుని బతుకుని అతి భారంగా నెట్టవల్సిందే అంటాడు కెన్నెత్. ఈ స్తబ్దతను పోగొట్టటానికి కెన్నెత్ రెండు విషయాలను చెప్తాడు.
​1. మీరెంచుకోబోయే ఉద్యోగం పట్ల అపారమైన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడం.
​2. మీరు ఎంచుకున్న లక్ష్యం వాస్తవరూపం దాల్చేలా ప్రయత్నించడం.
​స్తబ్దత తొలగిపోయి చైతన్యం ఏర్పడాలంటే ఈ రెండు అంశాలను పరిశీలించుకోవాలి అంటారు కెన్నెత్. మీరు ఎంపిక చేసుకున్న దాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించకపోతే మీ లక్ష్యాలకు వాస్తవ రూపం ఇవ్వడం సాధ్యం కాదన్నది ఇక్కడ అసలు విషయం.

డా.హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -