ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన లో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’లో శిందేతో భేటీ అయిన దేవ్‌రా.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు తన నివాసం దగ్గర మీడియాతో మిలింద్ మాట్లాడుతూ.. అభివృద్ధి పథంలో నడిచేందుకు వెళ్తున్నానని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన (యూబీటీ) కూటమిలో భాగంగా దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్ధవ్ వర్గానికి సీటు కేటాయిస్తే టికెట్ దక్కడం కష్టమనే భయాలు మిలింద్‌లో నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై శివసేన (యూబీటీ) నేత సంజరు రౌత్ మాట్లాడుతూ దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదన్నారు. ఠాక్రే వర్గానికి చెందిన అరవింద్ సావంత్ అక్కడినుంచే రెండుసార్లు ఎన్నికయ్యారని.. మూడోసారి పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీకి సొంత బలం లేదంటూ ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శలు గుప్పించారు.