– రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో కోకో సాగు రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు కాసాని పద్మ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాసాని గార్డెన్స్ లో తెలంగాణ కోకో కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకో గింజల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కోకో సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో కోకో గింజలను విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోకో సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. కోకో రైతులు మార్కెటింగ్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, రైతులు తాడేపల్లి రవి ,కాసాని మురళీ లు పాల్గొన్నారు.



