Monday, September 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమృత్యురోదన

మృత్యురోదన

- Advertisement -

గాజాలోని శిథిలాల నుంచి వెలికితీసిన
100 మంది పార్థివ దేహాలు.. సామూహిక ఖననం
కన్నీరు మున్నీరైన బంధువులు

గాజా : పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమానికి తెరపడటంలేదు. నెతన్యాహు యుద్ధకాంక్షకు వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రంప్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ ప్రకటించినా.. ఇజ్రాయిల్ దమనకాండ ఏ మాత్రం ఆగటంలేదు. గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ సాగిస్తున్న విధ్వంసకాండలో ధ్వంసమైన, దెబ్బతిన్న భవనాల్లో ఇంకా వేలాది మంది మృతదేహాలు పూడ్చిపెట్టి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తాజాగా గాజా నగరంలోని జైటౌన్ ప్రాంతంలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి సుమారు 100 మంది మృతదేహాలను వెలికి తీశారు. వారిలో 60 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులు ఆ పార్థివ దేహాలను జైటౌన్ నుంచి గాజా నగర మధ్యభాగంలోని అల్-మామదానీ స్మశానవాటికకు ఖననం కోసం తీసుకువచ్చారు.

ఏం జరిగిందంటే…
అక్టోబర్ 2023లో గాజాలోని పాలస్తీనియ న్లపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమంలో ధ్వంసమైన ఇండ్ల శిథిలాలను పౌర రక్షణ సిబ్బంది, కుటుంబ సభ్యులు వారాల తరబడి తవ్వారు. మృతుల్లో చాలామంది విస్తృత మలకా కుటుంబానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఆ కుటుంబమే 55 మంది సభ్యులను కోల్పోయింది.
స్మశానవాటికల్లో తమ బంధువులను ఖననం చేసేందుకు ఆ కుటుంబాలు చాలా కాలం వేచి చూశాయని అల్-అలౌల్ అన్నారు. కుటుంబ సభ్యుల అవశేషాలను ఖననం చేసే అవకాశం ‘ప్రతి కుటుంబానికి అందుబాటులో లేదు’ అని ఆయన అన్నారు. యుద్ధ సమయంలో గాజాలోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దళాలు స్మశానవాటికలను సైతం ధ్వంసం చేసి, తవ్వేశాయని ఆయన పేర్కొన్నారు.
గాజా నగరంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ సమయంలో కూల్చివేసిన ఇండ్ల శిథిలాల నుంచి వెలికితీసిన పాలస్తీనియన్ల మృతదేహాల వద్ద సంతాపకులు కొవ్వొత్తులు వెలిగించారు. ఇజ్రాయిల్ ఆక్రమణ వల్ల మృతదేహాల వెలికితీత ప్రక్రియ ఆలస్యం అయిందని, ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతోందని అల్-అలౌల్ అన్నారు.
గాజా పౌర రక్షణ సేవల అధిపతి రాద్ అల్-దహ్‌షాన్, గల్లంతైన వేలాది మృతదేహాల వెలికితీత కార్యకలాపాలు చేపట్టేందుకు తమ బృందాలు ప్రణాళికలు రూపొందించాయని, అయితే భారీ యంత్రాల కొరత కారణంగా ఆ పని ఆలస్యమవుతోందని అల్ జజీరాకు తెలిపారు.

శిథిలాల కింద ఇంకా సుమారు 8,000 మృతదేహాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, సరైన పరికరాలు ఉంటే వాటిని వెలికితీసే ప్రక్రియను దాదాపు 90 రోజుల్లో పూర్తి చేయవచ్చని దహ్‌షాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ పరికరాలను గాజాలోకి రానివ్వకుండా అడ్డుకుంటే… ఈ పని ఏండ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయితే, అవసరమైన పరికరాల జాబితాను అంతర్జాతీయ సంస్థలకు అందించామని, ఆ సామగ్రిని నేరుగా తమ (సివిల్ డిఫెన్స్) వద్ద కాకుండా అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచడానికైనా సిద్ధమేనని ఆయన తెలిపారు. మృతదేహాలను తక్షణమే గుర్తించి వెలికి తీయడానికి తమ బృందాలకు భారీ ఎక్స్‌కవేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, అన్వేషణ పరికరాలు అవసరమని ఆయన చెప్పారు.

మృతదేహాలను గుర్తించేందుకు దాడి సమయంలో భవనంలో ఎవరు, ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రాణాలతో బయటపడిన వారు, పొరుగు కుటుంబాలపై ఆధారపడుతున్నట్టు ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో లభించిన వాటిని వర్గీకరించి నమోదు చేసే ఇంజనీర్ల బృందం కూడా వారికి సహకరిస్తోందని తెలిపారు. దాడులకు ముందు నివాసితులను అప్రమత్తం చేయడంలో ఇజ్రాయిల్ బలగాలు విఫలం కావడం వల్ల, వేలాది మృతదేహాల కోసం ఇండ్ల వద్ద ఇంకా శిథిలాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయ అధిపతి అజిత్ సుంఘే అల్ జజీరాతో మాట్లాడుతూ, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని దృశ్యాలు “ఈ సంఘర్షణలోని క్రూరత్వాన్ని” గుర్తుచేస్తున్నాయని అన్నారు. కొన్ని మృతదేహాలు 2023 నవంబర్ నాటివని ఆయన పేర్కొన్నారు.
“వేలాది మంది ప్రజలు ఇంకా ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు… ఇవి ఇజ్రాయిల్ సైనిక నియంత్రణలో ఉండవచ్చని భావిస్తున్న ప్రాంతాలు – గాజాలో 70 శాతం వరకు ఇలాంటి పరిస్థితి ఉంది – మృతదేహాలను వెలికితీయడానికి ఈ ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉంది.”
“బాధ్యత నిర్ధారణ జరగాలి… ఈ సున్నితమైన సమయంలో మనకు లభించిన సాక్ష్యాలను భద్రపరచడం చాలా ముఖ్యం.” అని వివరించారు.
అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు కనీసం 73,651 మంది పాలస్తీనియన్లు మరణించగా, 174,592 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.

రెండు కుటుంబాలు.. 
100 మృతదేహాలు
ఇటీవలి వారాల్లో జరిగిన ఇలాంటి సహాయక చర్యల్లో, ఒకే దాడిలో మరణించిన అబూ షరియా, హసానియా కుటుంబాలకు చెందిన 100కు పైగా మృతదేహాలను, అలాగే అల్-తాజ్ టవర్ ప్రాంతం నుంచి 500కు పైగా మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు, కార్యకర్తలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -