Tuesday, September 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘నాసా’ దుర్వినియోగం.. యోగిపై న్యాయస్థానం ఆగ్రహం

‘నాసా’ దుర్వినియోగం.. యోగిపై న్యాయస్థానం ఆగ్రహం

- Advertisement -

మోడీ, యోగి సర్కార్లు రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను ఎంత నగ్నంగా బేఖాతరు చేస్తున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ ఆకృతి చౌదరిపై మోపిన నాసా కేసు. ఆకృతి చౌదరి అనే 25 ఏండ్ల యువతిని జాతీయ భద్రతా చట్టం (నేషనల్ సెక్యురిటీ యాక్ట్ – నాసా) కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైల్లో పెట్టడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పు పట్టింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడమే కాదు, తప్పుడు ఆరోపణలతో నాసా కేసు మోపి అరెస్టుకు ఆదేశించిన నోయిడా జిల్లా కలెక్టర్ ఆమెకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సెప్టెంబర్ 2న అరుదైన తీర్పు చెప్పింది. ఆకృతి చేసిన పాపమంతా వేతనాలు పెంచాలని, హర్యానాతో సమానంగా జీతాలు చెల్లించాలని ఆందోళన చేస్తున్న నోయిడా కార్మికుల వైపు నిలబడటమే.

కార్మికుల పక్షాన నిలబడటమే నేరమా?
ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీల మధ్య నోయిడాలో కార్మికులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ ప్రదర్శనలను ఎగదోస్తున్నారని ఆకృతితో పాటు మరికొందరిపై ప్రభుత్వం కేసులు బనాయించింది. ఆకృతిపై ఏకంగా నాసా కింద కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏప్రిల్ 13న కార్మికులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆకృతిని పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లు విసరమని, తగలబెట్టమని ఆమె కార్మికులను రెచ్చగొట్టిందనేది పోలీసుల ఆరోపణ. ఐదు నెలలకు పైగా ఆమెను జైల్లో బంధించారు. తన వద్ద ఎలక్ట్రానిక్, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు కోర్టు ముందు చెప్పారు. కానీ ఏ సాక్ష్యాధారాన్నీ చూపలేకపోయారు. పైగా ఆమె రెచ్చగొట్టే ప్రసంగం చేసిందని పోలీసులు ఆరోపించిన తేదీన ఆమె పోలీసు కస్టడీలోనే ఉన్నట్లు విచారణలో తేలింది. రాతపూర్వక హెచ్చరిక నోటీసు ఇవ్వడానికే ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లామన్న పోలీసుల వివరణ కూడా నిలువలేదు. పోలీస్ జనరల్ డైరీని పరిశీలించిన హైకోర్టు, ఆమెను కస్టడీలోకి తీసుకున్న తర్వాతే పోలీసులు నోటీసును సిద్ధం చేశారని నిర్ధారించింది. దీంతో ఆకృతిపై మోపిన చార్జీలు ఒక కట్టుకథ అంటూ న్యాయస్థానం ప్రభుత్వ వాదనను కొట్టేసింది.

నాసా చట్టం పేరుతో పౌర హక్కుల హరణ
దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టే వారిపై ప్రయోగించాల్సిన నాసా చట్టాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని ఎండగడ్తున్న వారిపై ప్రయోగిస్తున్నారు. అత్యంత కఠిన పరీక్షలను దాటుకొన్న తర్వాత నెలల తరబడి శిక్షణ పొందే ఐఏఎస్, ఐపిఎస్ విద్యావంతులు ఇలా ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ పౌర హక్కులకు తిలోదకాలు వదుల్తున్నారు. ఇలాంటి కేసులు ఉత్తరప్రదేశ్‌లో చాలా ఎక్కువ. నాసా కేసుల్లోనే కాదు, ఉపా కేసుల్లోనూ దానిదే అగ్రస్థానం. నాసా కింద అరెస్టయిన వ్యక్తి కనీసం మూడు నెలలపాటు జైల్లో ఉండాలి. ఆ గడువును ఎంతకాలమైనా పొడిగించవచ్చు. దీనిపై పరిశీలన కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సలహా బోర్డును ఏర్పాటు చేస్తుంది. వారు హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడానికి అర్హతగలవారు కావచ్చు. బోర్డు నాసా కింద మోపిన ఆరోపణలను విచారించి సదరు వ్యక్తి నిర్బంధంలో ఉండతగినవాడా కాదా నిర్ణయిస్తుంది. అయితే సలహా బోర్డు ముందు నిందితుడికి న్యాయవాదిని నియమించుకొనే అవకాశం ఉండదు. వందలాది పేజీల ఆరోపణలకు నిందితుడే సమాధానం చెప్పుకోవాలి. ఆకృతి కేసులో జిల్లా కలెక్టర్ చేసిన తప్పుడు ఆరోపణలను సలహా బోర్డు ఎలా ఆమోదించింది అన్నది ఒక ప్రశ్నే. దేశ వ్యాపితంగా నాసా కింద నమోదయ్యే కేసుల సంఖ్యను జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) కూడా వెల్లడించడం లేదు. ఉపా కింద నమోదైన కేసుల్లో నేర నిర్ధారణ జరిగి శిక్షలు పడినవి అత్యల్పం. అయితే నేర నిర్ధారణకు ముందే నెలలు, ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

కఫీల్ ఖాన్ కేసులోనూ అదే తీరు
గతంలో యోగి ప్రభుత్వం డా. కఫీల్ ఖాన్ అనే పిల్లల వైద్యుడిపై మోపిన నాసా కేసును కూడా అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. కఫీల్ ఖాన్‌ను విడుదల చేస్తూనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ యోగి సర్కారుకు చివాట్లు పెడుతూ అప్పీల్‌ను తిరస్కరించింది. కఫీల్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ ఆయన తల్లి మొదట హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అది హైకోర్టు విచారించదగిన అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకు పిటిషన్ బదలీ చేసింది. విచిత్రంగా ఆ ఫైలు మాయమైంది. తాము ఫైలు పంపించామని సుప్రీంకోర్టు చెప్తే, తమకు రాలేదని అలహాబాద్ హైకోర్టు అధికారులు చెప్పారు. చివరకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆదేశించడంతో హైకోర్టు కేసును విచారించింది. కఫీల్ ఖాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా విద్యార్థుల సమావేశంలో మాట్లాడారు. ఆయన విద్యార్థులను రెచ్చగొట్టారంటూ ప్రభుత్వం కేసు పెట్టి జైల్లో వేసింది. అలీగఢ్ జిల్లా చీఫ్ మెజిస్ట్రేట్ ఆరోపణలను కొట్టేసి విడుదల చేయాలని ఆదేశించినా, ప్రభుత్వం నాసా కేసు బనాయించి జైల్లోనే ఉంచింది. డాక్టర్ ఖాన్ ఉపన్యాసం వీడియోను పూర్తిగా పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు, కలెక్టర్ ఉపన్యాసాన్ని పూర్తిగా చూపకుండా నాసా కింద అరెస్టుకు ఆదేశించారని తప్పుబట్టింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలోనే ఆయన మాట్లాడారని తేల్చి చెప్పింది. కేసును కొట్టేసి ఆయనను విడుదల చేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా పరాభవం పాలైంది. అంతకుముందు గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా లేని కారణంగా చిన్నారులు చనిపోయారని ఆరోపిస్తూ కఫీల్ ఖాన్‌ను సస్పెండ్ చేసి జైల్లోకి పంపింది. శాఖాపరమైన విచారణలో ఆయన ఏ తప్పూ చేయలేదని తేలింది. అయినా తర్వాత అలీగఢ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను రెచ్చగొట్టారంటూ మళ్లీ జైల్లోకి తోసింది. నాసా కేసు కూడా న్యాయస్థానంలో నిలబడలేదు. అయినప్పటికీ నాసా కేసు వీగిపోయిన తర్వాత కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఆయన పేరును హిస్టరీ షీట్‌లో నమోదు చేశారు.

అరెస్టు అంటే స్వేచ్ఛను అడ్డుకోవడమే
ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం, విచారణ పేరుతో జైల్లో వేసే అవకాశం తమకు ఉందనే భావన పోలీసుల్లో ఇప్పటికీ బలంగా ఉంది. గతవారం కర్ణాటక హైకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసులో భూ వివాదంలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని అరెస్టుకు రాతపూర్వక ఆర్డర్ ఏదైనా జారీ చేశారా అని న్యాయమూర్తి పోలీసు ప్రతినిధిగా హాజరైన ఎస్‌ఐని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. సివిల్ వివాదంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారో కూడా చెప్పలేకపోయాడు. అరెస్టు అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడమే. కాని పోలీసు వ్యవస్థలో ఆ స్పృహ ఉందా అన్నది అనుమానమే. ఇలాంటి స్థితిలో ప్రభుత్వాలు కూడా తోడయితే మానవ హక్కుల హననం నిరాటంకంగా జరిగిపోతుంది.
ఆకృతి కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ యోగి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ఆకృతిని జైలు నుంచి విడుదల చేసినా ఐదు లక్షల నష్టపరిహారాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టును కోరవచ్చు. ఆ నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ చెల్లించాలని హైకోర్టు చెప్పడం యోగి ప్రభుత్వానికి చెంపదెబ్బే. సుప్రీంకోర్టు నష్టపరిహారం చెల్లించనవసరం లేదని చెప్పినా, దానినే తమ విజయంగా నమ్మబలుకుతూ యోగి కండువా ఎగురేస్తూ తిరగొచ్చు.
గతంలో కఫీల్ ఖాన్ కేసులో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఆకృతిని యూపీ ప్రభుత్వం ఇంతటితో వదిలిపెడుతుందా అన్నది అనుమానమే. ఇప్పుడామె దిమాగీ నక్సల్ కేటగిరీలోకి వస్తారేమో కూడా! ఏదేమైనా, ఈ కేసులో బాధితురాలికి జిల్లా కలెక్టర్ నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం ఒక హైలెట్. బహుశా ఇతర కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు ఇదో హెచ్చరిక కావాలని న్యాయస్థానం భావించి ఉండవచ్చు.
ఎస్. వినయ కుమార్, 9989718311

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -