Tuesday, September 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅ‘ధర’ కొడుతున్నాయి..!

అ‘ధర’ కొడుతున్నాయి..!

- Advertisement -

‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. నాగులో నాగన్న.. ధరలెట్లా పెరగబట్టే నాగులో నాగన్న’’ అన్న పాటే నేడు ప్రతి సామాన్యుడి నోట వినిపించాల్సిన పరిస్థితి. మార్కెట్‌కు వెళ్తే సంచి నిండా సరుకులు రావడం లేదు.. కానీ జేబులోని డబ్బు మాత్రం ఖాళీ అవుతోంది. ఒకవైపు ఆదాయం పెరగడం లేదు.. మరోవైపు నిత్యావసరాల ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఉల్లి, చక్కెర, నూనె, పప్పులు, కూరగాయలు, పాలు, బియ్యం.. ఇలా ఒక్కో సరుకు ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటివరకు రూ.వందకు ఆరేడు కిలోలు వచ్చిన ఉల్లి.. ఇప్పుడు కిలో రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తోంది. రూ.40 ఉన్న చక్కెర రూ.70కు ఎగబాకి నోరు మరింత చేదెక్కిస్తోంది. వంటనూనె ధర పొయ్యి వెలిగించకముందే ఇంట్లో మంట రాజేస్తోంది. ఏం కొందామన్నా ధరే అడ్డుగా.. ఏం వండుకుందా మన్నా ఖర్చే భారమవ్వడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ధరల నియంత్రణపై చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.
ధరలు పెరగడానికి వాతావరణ పరిస్థి తులు, వర్షాభావం లేదా అధిక వర్షాలు, పంటల దిగుబడుల్లో హెచ్చుతగ్గులు, సరఫరా లోపాలు, రవాణా వ్యయం వంటి కారణాలు న్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, దిగుమతులపై ఆధారపడటం వంటివి వంట నూనెల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కొంతవరకు అర్థం చేసుకోదగినవే. కానీ ప్రతిసారీ ప్రకృతినో.. మార్కెట్‌నో సాకుగా చూపించి ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేవు. తగినంత నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరఫరా వ్యవస్థలో లోపాలు, దళారుల జోక్యం, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత వంటి వాటిని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం కూడా ధరల పెరుగుదలకు కారణమే. బఫర్‌ నిల్వలు, ధరల నియంత్రణ వ్యవస్థలు ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో మార్కెట్‌ను అదుపు చేయలేకపోతే అది పాలనావైఫల్యమే తప్ప వేరేకాదు.

ఇందులో ఇంధన ధరల ప్రభావాన్ని కూడా విస్మరించలేం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన కొద్దీ రవాణా వ్యయం పెరిగి ఆ భారం కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, నూనెల రూపంలో వినియోగదారుడిపైనే పడుతోంది. ఇంధన ధరలను అదుపు చేయకుండా నిత్యావసరాల ధరలను శాశ్వతంగా నియంత్రించడం కష్టం. ప్రజలపై భారాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలు ఇంధనంపై పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తే సామాన్యుడి కష్టం మరింత పెరుగుతుంది. అలాగే ధరలు పెరిగితే రైతు లాభపడుతున్నాడన్నదీ వాస్తవం కాదు. రైతు పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర దక్కని సమయంలో అదే ఉల్లి పట్టణ మార్కెట్‌లో కిలో రూ.60-70కు అమ్ముడవుతోంది. రైతు తక్కువకు అమ్ముతున్నాడు.. వినియోగదారుడు ఎక్కువకు కొంటున్నాడు. మరి ఈ మధ్యలో పెరుగుతున్న ధరలో అసలు లాభం ఎవరికి? పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ చేసి, కొరత ఏర్పడినప్పుడు అధిక ధరకు అమ్మే మధ్యవర్తుల వ్యవస్థ బలపడుతోంది. ఫలితంగా రైతుకూ నష్టం.. వినియోగదారుడికీ నష్టం.. దళారులు, నిల్వదారులకే లాభం. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన ప్రభుత్వాలు చేష్టలూడిగి చూడటమే ప్రజలపై ఈ ప్రభావం.
వంటనూనెల విషయంలోనూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. రైతులకు ప్రోత్సాహక ధర కల్పించాల్సి ఉన్నా దృష్టి సారించడం లేదు. నిల్వ, ప్రాసెసింగ్‌, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. నూనె, గ్యాస్‌ ధర పెరిగితే దాని ప్రభావం ఇంటి వంటకే పరిమితం కాదు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, చిరుతిళ్ల ధరల రూపంలోనూ ప్రజలపై పడుతుంది. దీన్ని ఎలా పరిష్కరిం చాలన్న ఆలోచన ప్రభుత్వాల దగ్గర ఉందా?లేదా? ఉంటే ఎందుకు అమలు చేయడం లేదు. ఒక్కో సరుకుపై ఇరవై నుంచి ముఫ్పై శాతం ధరల ప్రభావం పడితే అది చిన్న సమస్యనా? దాన్ని పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ధరల నియంత్రణకు తక్షణ చర్యలే కాదు, దీర్ఘకాలిక విధానాలు అమలు చేయాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలను అరికట్టాలి. బఫర్‌ నిల్వలను అవసరమైనప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేయాలి. రైతు బజార్లు, ప్రభుత్వ విక్రయ కేంద్రాలను బలోపేతం చేసి రైతు నుంచి వినియోగదారుడికి నేరుగా సరుకు చేరేలా చూడాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి. ఉల్లి, చెరకు, నూనెగింజల వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించాలి.
ఇవేవీ చేయకుండా ధరలను నియంత్రిస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధి గణాంకాలు ఎన్ని చెప్పినా.. సామాన్యుడి పళ్లెంలో పదార్థాలు తగ్గి, జేబులో ఖర్చులు పెరుగుతున్నంతకాలం ఆ అభివృద్ధికి అర్థం లేదు. వంటింటి మంట తగ్గించి.. రైతుకు గిట్టుబాటు, వినియోగదారుడికి ఉపశమనం కల్పించడమే ప్రభుత్వాలకు అసలైన పరీక్ష. ఆ పరీక్షలో పాలకులు ఎప్పుడు నెగ్గుతారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -