భగ్గుమంటున్న చక్కెర ధరలు..
ముడి సరుకుల భారం
ధరలను పెంచుతున్న
ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు
పరిమాణానికి కోత..
న్యూఢిల్లీ : రానున్న పండగల సీజన్‌లో తీపి ఉత్పత్తులు అధిక ధరలతో చేదెక్కనున్నాయి. విపరీతంగా పెరిగిన చక్కెర, పాల ధరల కారణంగా బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, సంప్రదాయ మిఠాయిల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్కెట్‌లో ముడిసరుకుల భారం విపరీతంగా పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు, స్వీట్ తయారీదారులు ధరల పెంపును చేపడుతున్నాయని ఓ ఆంగ్ల మీడియా రిపోర్ట్ చేసింది.ఇప్పటికే ప్రముఖ స్వీట్స్ బ్రాండ్ బికాజీ ఫుడ్స్ తన మిఠాయిల ధరలను రెండు శాతం మేర పెంచగా.. రానున్న రోజుల్లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంది. భారత్‌లో సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వచ్చే పండుగల సీజన్‌లో చక్కెరకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అయితే ఈ ఏడాది అంతర్జాతీయ, దేశీయ
మార్కెట్లలో నెలకొన్న పరిణామాల కారణంగా చక్కెర ధరలు నింగినంటాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే చక్కెర ధరలు 19 శాతం, మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 20 శాతం మేర పెరిగాయి. దీనికి తోడు గత నాలుగు నెలల్లో పాల ధరలు కూడా సుమారు 16 శాతం వరకు పెరగడంతో మిఠాయి తయారీదారులకు పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో కిలో రూ.38 ఉన్న చక్కెర ధర కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.76 వరకు పలుకుతోంది. ప్రముఖ స్వీట్ల ధరలు కిలోకి రూ.550-560 నుంచి రూ.750-780కి చేరాయి. దాదాపు అన్ని రకాల మిఠాయిల ధరలు 30 శాతానికి పైగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.65.08 నుంచి రూ.62.57కు కొద్దిగా తగ్గినప్పటికీ.. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇది దాదాపు 27 శాతం అధికంగానే ఉంది. తయారీదారులు కేవలం ధరల పెంపు మాత్రమే కాకుండా ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల వినియోగదారులపై పరోక్షంగా ఆర్థిక భారం మరింత పడనుంది. కృత్రిమ కొరత, కొద్దిమంది వ్యాపారులు, మిల్లుల యజమానులు చేస్తున్న బ్లాక్ మార్కెటింగ్, ధరల ఊహాగానాలే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
మిఠాయిలు, చాక్లెట్లు ప్రియం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



