Sunday, April 19, 2026
E-PAPER
Homeకవితనేటి కొత్త పదం

నేటి కొత్త పదం

- Advertisement -

యుగాలు, కాలాలు మారుతుంటాయి
నయా నాయకులు వస్తారు
ప్రజలను మాయలతో మైమరిపించటానికి
నూతన పదాలను, అర్థాలను సృష్టిస్తారు
నేటి సరికొత్తపదం ‘యుద్ధం’
తాజాగా అందరూ జపిస్తున్న పదం
శాంతి కోసం కవాతు చేస్తున్నది
హిరణ్యకశిపుడిలా
నింగీ, నేలా, నీరూ ఎక్కడైనా
మరణం లేని కొత్త వైరస్‌
సహస్త్ర బాహువులతో, కోటి అస్త్రాలతో
ముందుకుసాగుతున్న ఆయుధ స్రవంతి
ప్రపంచ శాంతి కోసం, శాంతికాముకులు
చేస్తున్న సరికొత్త యుద్ధం
వసుదైక కుటుంబంలా
ఏకతాటిపై నడవడానికి
మారణహోమం చేయాలి
లెక్కలేనన్ని బలిదానాలు చేయాలి
పసిపిల్లల ఆర్తనాదాలే
సమర శంఖారావాలౌతున్నాయి
లెక్కలకు అందనంత విధ్వంసం
మనిషి మహనీయుడిగా
కితాబు అందుకోవడానికి
వినాశనం సృష్టించాలి
శాంతిదూతగా అవతార దర్శనం కోసం
అగ్నికి తైలాభిషేకాలు చేయాలి
ప్రపంచశాంతి కోసం
అహింసా జపంతో
యుద్ధతాండవం చేయాలి
డా.నీరజ అమరవాది, 9849160055

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -