ప్రస్తుత సెషన్ వరకూ తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి సస్పెన్షన్
శాసనమండలి చైర్మెన్ నిర్ణయం
అట్టుడికిన ఉభయ సభలు
అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి దామోదర తీర్మానం
కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
స్పీకర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ
పలుమార్లు వాయిదా పడిన శాసనసభ, మండలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌పై మండలి చైర్మెన్ సస్పెన్షన్ వేటేశారు. ఈ సెషన్ వరకూ వారిద్దరినీ మండలి నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో మంగళవారం శాసనసభ, శాసనమండలి అట్టుడికాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే బీఆర్ ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు… ఏకంగా స్పీకర్‌పైన్నే ఎదురుదాడికి దిగారు. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఎందుకు స్పందించటం లేదని సభాపతిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా ఉండే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్… హరీశ్‌రావుపై తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మన్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్ పద్మావతి, యశస్వినీ రెడ్డి తదితరులు స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం సోమవారం నాటి పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ సభ్యుల వ్యవహారశైలిని ఆక్షేపించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ బీఆర్ ఎస్‌ను ప్రశ్నించారు. ఇదే సమయంలో 22ఏ వ్యవహారంపై చర్చించాలంటూ బీజేపీ సభ్యులు పట్టుబట్టటంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఇదే అంశంపై వారు ఫ్లకార్డులను ప్రదర్శించటంతో అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ వాటిని లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ సభ్యులు కాగితాలను చించి గాల్లోకి ఎగరేశారు. ఈ దశలో సభను గాడిలో పెట్టేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాయశక్తులా ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో సభను పావుగంట సేపు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉదయం 10.45 గంటలకు వాయిదా పడిన సభ… తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రారంభమైంది. కాగా ఉదయం పూట సభాపతి స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఆసీనులు కాగా… మధ్యాహ్నం తర్వాత కొనసాగిన సభకు ప్యానెల్ స్పీకర్ హోదాలో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి అధ్యక్షత వహించారు.
స్పీకర్ పై బీఆర్ ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించగా, ప్యానెల్ స్పీకర్… ఆ తీర్మానాన్ని మండలికి పంపారు. కాగా స్పీకర్‌ను సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శించారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అటు మండలినీ ఓ కుదుపు కుదిపింది. ఈ అంశంపై తొలుత కాంగ్రెస్ సభ్యుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడింది. ఉదయం 10.20కి వాయిదా పడిన సభ… 11 గంటలకు ప్రారంభమైంది. అనంతరం 11.40కి వాయిదా పడింది. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై… నాలుగైదు నిమిషాలకే వాయిదా పడింది. ఈ సమయంలో తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని ప్రస్తుత సెషన్ వరకూ బహిష్కరిస్తున్నట్టు మండలి చైర్మెన్ ప్రకటించారు. ఈ దశలో బీఆర్ ఎస్ సభ్యులు… చైర్మెన్ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన వారిని పట్టించుకోకపోవటంతో నినాదాలు చేస్తూ… బయటకు వెళ్లిపోయారు. కాగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించిన మధు, నవీన్ కుమార్‌లను మార్షల్స్ అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బయటకు పంపేశారు. ఈ పరిణామాల అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.



