- Advertisement -
సూర్యోదయాలు చిమ్మేటప్పుడు
చెట్లనూ చీకట్లనూ
గుట్టలనూ పుట్టలనూ
అడ్డునట్లుగా భావించవు
చైతన్యం అణువణువు నిండి
మస్తకాన్ని మరో ప్రపంచంవైపు నడిపిస్తున్నాక
ఆలోచనా పొరల మధ్య
ఏ అగాధం మనసుని ఆపదు
కరుగుతున్న కాలం అంచులపై
ఎన్ని జ్ఞాపకాలు దొర్లిపోతున్నాయో
ఏ ఒక్కటీ నాతోపాటు నిదురించదు
రేపటి పొద్దుకోసం క్రియలన్నీ గూళ్ళు కట్టుకొని
ఒక్కొక్కటిగా ప్రతిఫలిస్తున్నట్టు
బలమైన కలల గోడలు
ఇటుకపై ఇటుకను పేర్చుకుంటున్నట్టు
ఎప్పుడూ లోలోన ఓ శ్రమగీతికారావమే
దేహమూ మనసూ
రెండూ రెండు ధవాలు కావెప్పుడూ
ఒకటిలో ఒకటి ఎప్పుడూ మమేకమే
మౌనంలోనూ మరుగుతున్న రక్తం
ఓ అంతరంగ యుద్ధ కేతనమే
పురిటినొప్పులు పడితేనేం…
ముద్దుబిడ్డగా..
ఓ అభ్యుదయం..ఓ అరుణోదయం
డా.కటుకోఝ్వల రమేష్, 9949083327
- Advertisement -



