Thursday, September 10, 2026
E-PAPER
Homeజాతీయంమరణశయ్యపై ఉపశమనం

మరణశయ్యపై ఉపశమనం

- Advertisement -

ఇంటి వద్దే రోగిని సంరక్షించి సాంత్వన కలిగించే ‘పాలియేటివ్‌ కేర్‌’..
ఆర్థిక భారం నుంచి కుటుంబాలకు ఊరట
న్యూఢిల్లీ : మరణానికి చేరువ అవుతున్న రోగుల సంరక్షణ విషయంలో తాను ఈ విధానాన్ని సూచిస్తున్నానని డాక్టర్‌ ఫిలిప్స్‌ తెలిపారు. రోగి బతికే అవకాశం ఏ మాత్రం లేదని వైద్యులు నిర్ధారించిన తర్వాత ఖరీదైన అత్యాధునిక వైద్య సేవల పేరుతో అతనిని ఇబ్బంది పెట్టే బదులు కుటుంబసభ్యుల మధ్య చివరి రోజులను ఇంటి వద్దే గడిపే అవకాశాన్ని కల్పించడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో దీర్ఘకాలిక చికిత్స జేబులు ఖాళీ చేస్తుందని, కుటుంబంపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో డాక్టర్‌ ఫిలిప్స్‌ పెట్టిన పోస్ట్‌ ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మన దేశంలో పాలియేటివ్‌ కేర్‌ (తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి బాధను కొంతమేరకైనా ఉపశమింపజేయడం) ఎంత వరకూ అందుబాటులో ఉంది? ముఖ్యంగా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స అందుబాటులో ఉన్నప్పుడు ఇంటి వద్ద లేదా ఇంటి వాతావరణాన్ని తలపించే ప్రత్యేక కేంద్రాలలో రోగిని సంరక్షించడం ఎలా సాధ్యం?.

ప్రభుత్వం ఏం చెబుతోంది?
వాస్తవానికి ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులకు పాలియేటివ్‌ కేర్‌ అవసరం ఉంది. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత డిసెంబరులో లోక్‌సభకు ఇచ్చిన సమాధానం ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల నుంచి కోటి మందికి పాలియేటివ్‌ కేర్‌ అవసరం ఉంది. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ పాలియేటివ్‌ కేర్‌ (ఎన్‌పీపీసీ) కింద పాలియేటివ్‌ కేర్‌ సేవలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని సుమారు 600 జిల్లాలలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలి పింది. ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి అందించిన తాజా వార్షిక గణాంకాల ప్రకారం ఎన్‌పీసీసీ కింద 60,82,069 మంది రోగులు ఔట్‌పేషెంట్‌ పాలియేటివ్‌ కేర్‌ సేవలు పొందారు. 25,17,663 మంది ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందారు. ఇక 5,50,056 మంది గృహ ఆధారిత సేవలు పొందారు.

బంధుమిత్రుల సమక్షంలో చివరి క్షణాలు గడిపే అవకాశం
ఎవరైనా తీవ్రమైన లేదా ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు…అంటే మరణానికి చేరువ అయినప్పుడు అతని వ్యాధిని నయం చేయడంపై కంటే నరకయాతన అనుభవిస్తున్న ఆ రోగికి సాంత్వన కలిగించడం పైన, బాధను ఉపశమింపచేయడం పైన దృష్టి సారిస్తే ?. రోగి కుటుంబానికి అది అత్యంత క్లిష్టమైన దశ కావచ్చు. ఆసుపత్రికి తరచూ తీసుకొని వెళ్లాల్సి రావడం, ఖరీదైన చికిత్స చేయించాల్సి రావడం ఏ కుటుంబానికి అయినా ఇబ్బందికరమే. ఇలాంటి పరిస్థితులలో ‘ఇంటి వద్దే రోగిని సంరక్షించే’ అవకాశం లభిస్తే బంధువులకు ఎంతో ఊరట కలుగుతుంది. ‘దిలివర్‌డాక్‌’గా పేరొందిన హెపటాలజిస్ట్‌ డాక్టర్‌ సిరియాక్‌ అబ్బీ ఫిలిప్స్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. ఈ విధానంపై ఇటీవలి కాలంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

అందుబాటులో ప్రైవేటు-స్వచ్ఛంద సేవలు
శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ వాలంటీర్ల ద్వారా పాలియేటివ్‌ కేర్‌ సేవలను అందిస్తారు. ఆరోగ్య సంరక్షణ బృందాలు రోగులకు, వారి కుటుంబాలకు ఇంటి వద్దే అవసరమైన మద్దతు ఇస్తాయి. పైన తెలిపిన గణాంకాలు కేవలం ప్రభుత్వ పాలియేటివ్‌ కేర్‌ కార్యక్రమానికి సంబంధించినవి మాత్రమే. ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు లేదా ఇతర సంస్థల ద్వారా సంరక్షణ పొందిన రోగులను ఇందులో చేర్చలేదు. అంటే మన దేశంలో పాలియేటివ్‌ కేర్‌ సేవలు పొందుతున్న వారి సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. గత సంవత్సరానికి…అంటే 2025-26కు సంబంధించిన పాక్షిక డేటాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబర్‌ వరకూ సుమారు 12.6 లక్షల మంది రోగులకు ఔట్‌పేషెంట్‌ సేవలు, 19 లక్షల మందికి గృహ సంబంధమైన సేవలు, 3.3 లక్షల మందికి ఇన్‌పేషెంట్‌ పాలియేటివ్‌ కేర్‌ సేవలు లభించాయి.

పాలియేటివ్‌ కేర్‌ అంటే…
పాలియేటివ్‌ కేర్‌ అంటే రోగికి వైద్య చికిత్స నిలిపివేయడం కాదు. నెప్పి, ఇతర లక్షణాలకు చికిత్స అందిస్తారు. తీవ్రమైన అనా రోగ్యంతో బాధ పడుతున్న వారి శారీరక, భావోద్వేగ సంబంధమైన, సామాజిక అవసరాలకు మద్దతు ఇస్తారు. సంరక్షణ విషయంలో, నిర్ణయాలు తీసుకోవడంలో రోగి బంధువులకు సాయపడతారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల ద్వారా అందిస్తున్న 12 అత్యవసర వైద్య సేవలలో పాలియేటివ్‌ కేర్‌ కూడా ఒకటని ప్రభుత్వం చెబుతోంది. ఇంటి వద్ద సంరక్షణ అవసరమైన రోగులను ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ వాలంటీర్లు గుర్తిస్తారు. వారిని తరచూ సందర్శిస్తారు. అవసరమైనప్పుడు కుటుంబాలను ఆరోగ్య సంరక్షణ సేవలతో అను సంధానించడంలో సాయపడతారు.

గ్రామీణ ప్రాంతాలకు చేరని సేవలు
పాలియేటివ్‌ కేర్‌ సేవలను ప్రభుత్వం గణనీయంగా విస్తరిం చింది. అయితే 600 జిల్లాలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతి రోగి వాటిని ఇంటి వద్దే సులభంగా పొందుతాడని అర్థం కాదు. ఈ సేవలను ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలోనే అందజేస్తారని, అదే సమయంలో గృహ ఆధారిత సేవలను శిక్షణ పొందిన సిబ్బంది, వాలం టీర్ల ద్వారా అందిస్తారని గత డిసెంబరులో ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. సేవలను ఎంతగా విస్తరించి నప్పటికీ వాటి అవసరం ఉన్న వారిలో…అంటే 70 లక్షల నుంచి కోటి మందిలో…కేవలం నాలుగు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే అవి సకాలంలో అందుతున్నా యని స్వతంత్ర పరిశీలనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో ఈ విషయంలో అంతరం చాలా ఎక్కువగా ఉంది. ఆధునిక చికిత్స అందించి నప్పటికీ అర్ధవంతమైన ప్రయోజనం చేకూరే అవకాశం లేనప్పుడు రోగు లకు, వారి కుటుంబ సభ్యులకు గృహ ఆధారిత సంరక్షణ గురించి సమాచారం అందిం చాల్సిన అవసరం ఉంది. చికిత్స చేయించాలా లేక వదిలేయాలా అనే విషయంపై మాత్రమే రోగి కుటుంబం ఆలోచించదు. ఎందుకంటే మరణ శయ్యపై ఉన్న వారికి…అంటే జీవనయానంలో చివరి దశలో ఉన్న వారికి సరైన వైద్య సంరక్షణతో పాటు సౌకర్యం, గౌరవం, జీవన నాణ్యత కూడా అవసరమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -