Monday, April 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆన్‌లైన్‌ వేదికగా విద్యార్థుల 'ప్రగతి'

ఆన్‌లైన్‌ వేదికగా విద్యార్థుల ‘ప్రగతి’

- Advertisement -

వెబ్‌సైట్‌లో 1-9 తరగతుల మార్కుల నమోదు షురూ..
23న తల్లిదండ్రుల సమావేశం.. ఆ రోజే ప్రోగ్రెస్‌ కార్డుల పంపిణీ
నవతెలంగాణ- సిటీబ్యూరో

ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను, వారి వార్షిక ఫలితాలను పారదర్శకంగా వెల్లడించేందుకు విద్యాశాఖ ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరిచే పనిలో ఉపాధ్యాయులు నిమగమయ్యారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న నిర్వహించే తల్లిదండ్రుల సమావేశంలోనే విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందజేయాలని సంబంధిత ప్రక్రియను స్పీడప్‌ చేశారు.
ముగిసిన ఎస్‌ఏ-2 పరీక్షలు
హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 664 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 91,466 మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. వీరికి సంగ్రహణాత్మక(ఎస్‌ఏ-2) పరీక్షలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గత గురువారంతో ముగియగా, ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారంతో పూర్తయ్యాయి. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది.
పోర్టల్‌లో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ మార్కుల నమోదు
విద్యార్థి విద్యాసంవత్సర కాలంలో సాధించిన ప్రగతిని అంచనా వేసేందుకు నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాలు (ఎఫ్‌ఏ1,2,3,4), రెండు సంగ్రహణాత్మక మూల్యాంకనాల(ఎస్‌ఏ1,2) ఫలితాలను ‘స్కూల్‌ ఎడ్యూకేషన్‌’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో మార్కుల నమోదు ప్రక్రియను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో సీఆర్పీలు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా మార్కులను ఉపాధ్యాయులు ఎంట్రీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఫలితాలను ఆన్‌లైన్‌ చేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, 23వ తేదీకి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని డీఈవో ఆర్‌.రోహిణి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆటోమెటిక్‌గా ‘ప్రోగ్రెస్‌ రిపోర్టు’ జనరేట్‌
ప్రగతిపత్రాల తయారీలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వెబ్‌సైట్‌లో మార్కులు నమోదు చేయగానే, విద్యార్థి వివరాలు, పాఠశాల సమాచారం, వారి ప్రతిభను విశ్లేషించే ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఆటోమెటిక్‌గా జనరేట్‌ అవుతాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిజిటల్‌ రూపంలో ఉండటం వల్ల రిపోర్టు కార్డుల్లో తప్పులు దొర్లే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
23న ముగింపు వేడుక.. పేరెంట్స్‌కు ఆహ్వానం
ఈనెల 23వ తేదీని విద్యా సంవత్సరం చివరి పని దినంగా నిర్ణయించారు. ఆ రోజున ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతిపై చర్చించి, సిద్ధం చేసిన ప్రోగ్రెస్‌ కార్డులను వారికి అందజేయనున్నారు. అయితే నిజానికి ప్రోగ్రెస్‌ కార్డులతో పాటు వాల్యూవేషన్‌ చేసినా జవాబుపత్రాలు కూడా తల్లిదం డ్రులకు ఇచ్చి వారి సంతకం తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ.. దీనిపై పర్యవేక్షణ లేకపోగా.. పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇక కొంతమంది ప్రధానో పాధ్యాయులు కనీసం వారి ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లు, ఆన్‌లైన్‌లో వేసినా మార్కులు కూడా వెరిఫై చేయడం లేదనీ, దానికితోడు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా వరకు నిరక్ష్యరాసులు అవ్వడంతో వాళ్లు అడిగే సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఎలాగో ఆర్టీఈ యాక్ట్‌ ప్రకారం తర్వాతి క్లాస్‌కు పిల్లలు ప్రమోట్‌ చేయాలి కాబట్టి అటు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, మండల విద్యాధికారులు కానీ ఈ విషయంలో సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీని ఫలితంగా ఆన్‌లైన్‌లో పిల్లల మార్కులు ఎక్కువగా ఉంటుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం చదవడం, రాయడం రాని పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని అనేక సర్వేల నివేదికలు చెబుతున్నాయి. ఇకముందునైనా ఈ విషయంలో హెచ్‌ఎంలు, సంబంధిత అధికారులు సీరియస్‌గా పర్యవేక్షిస్తే పిల్లల విద్యాప్రమాణాల స్థాయి గుర్తించి వాటిని అభివృద్ధి చేయటానికి బాగుంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరి ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -