– ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్
– నల్లగొండలో ‘ఫూలే, అంబేద్కర్ జనజాతర సభ’
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
భారతదేశంలో దశాబ్దాలుగా నాటుకుపోయిన అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక దోపిడీ వంటి అసమానతలపై అక్షరయుద్ధం చేసిన జ్ఞాన జ్యోతులు మహాత్మాజ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. భారత సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం కొండేటి శ్రీను అధ్యక్షతన ‘ఫూలే, అంబేద్కర్ జనజాతర సభ’ నిర్వహించారు. వారి చిత్రపటాలకు అబ్బాస్ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మాజ్యోతిబా ఫూలే, బీఆర్.అంబేద్కర్ భారతీయ సమాజంలో సామాజికన్యాయం, సమానత్వం స్థాపనకు శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులన్నారు. ఫూలే విద్యను సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేయగా, అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంను సంస్థాగతంగా స్థాపించారన్నారు. ఈ ఇద్దరి ఆలోచనల్లో మానవతావాద సమానత్వం, కులవివక్ష వ్యతిరేక సిద్ధాంతం కీలక స్థానాన్ని పొందాయన్నారు. ఫూలే సామాజిక సంస్కరణలను ప్రజల్లో చైతన్యంతో ముందుకు తీసుకెళ్లగా.. అంబేద్కర్ చట్టబద్ధ మార్గాల ద్వారా హక్కులను స్థిరపరిచారన్నారు. వారి పోరాటం కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా సమగ్ర మానవ సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని కొనసాగించారని చెప్పారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ.. అవమానాలకు గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఫూలే, అంబేద్కర్ చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ మాట్లాడుతూ.. ఫూలే, అంబేద్కర్ ప్రతిపాదించిన మానవ గౌరవ సమానత్వ దృక్పథం భారతీయ సమాజానికి శాశ్వత మార్గదర్శకంగా నిలిచాయన్నారు. కులం ఆధారంగా ఏర్పడిన అసమానతలను నిర్మూలించడం సమాజ అభివృద్ధికి అత్యవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, వివిధ ప్రజాసంఘాలు, దళిత, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సామాజిక విప్లవ జ్యోతులు ఫూలే, అంబేద్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



