Monday, April 20, 2026
E-PAPER
Homeఖమ్మం70 సార్లు ఢిల్లీకి రేవంత్‌.. కల్లాల్లోకి ఒక్కసారి రాలే..!

70 సార్లు ఢిల్లీకి రేవంత్‌.. కల్లాల్లోకి ఒక్కసారి రాలే..!

- Advertisement -

– బేషరతుగా వడ్లు కొనుగోలు చేయకపోతే పోరాటానికి సిద్ధం
– తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకు నీళ్లు ఇచ్చే కుట్రలు
– ముఖ్యమంత్రి రేవంత్‌ కుమ్మక్కు రాజకీయాలు
– ఏ ఒక్క వర్గమూ సంతప్తిగా లేదు
– బీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్‌ రావు
– బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల సమక్షంలో మాజీ మంత్రి అజరు జన్మదిన వేడుకలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: ముఖ్యమంత్రి 70 సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ, ఒక్కసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల కష్టాలను చూడలేదు” అని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, దొడ్డు రకాలు, సన్న రకాలను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సన్న వడ్లకు బోనస్‌ రావడం లేదని, రైతు భరోసా ఇప్పటికీ అందరికీ అందలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే, బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. స్థానిక మమతా మెడికల్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన
బీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్‌ రావు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో మాజీ మంత్రి పువ్వాడ అజరు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్‌ రావు మాట్లాడుతూ… ఖమ్మంలోని వెలుగుమట్ల లో పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలను ”పోలీస్‌ అరాచకం”గా పేర్కొంటూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ చేసిందేమీ లేదన్నారు. చివరికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు కూడా ఇవ్వలేదని తెలిపారు. బడ్జెట్లో రూ .16 కోట్లు జర్నలిస్టులకు కేటాయిస్తామని తెలిపి 16 పైసలు కూడా ఇవ్వలేదు అన్నారు. జిల్లాలో ఒకడు భూ బకాసురుడు.. ఇంకొకరు కమీషన్‌ ఏజెంట్‌ అని, వాళ్ల కడుపే నిండడం లేదు.. మీ కడుపు ఏం నింపుతారు..? అని ప్రశ్నించారు.
అభివద్ధి పై ధ్యాసే లేదు.. ఓన్లీ కబ్జాలేనని విమర్శించారు.
రైతుబంధు పై బహిరంగ చర్చకు వస్తావా? అని మంత్రి తుమ్మలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అద్వానంగా తయారైందని, అసెంబ్లీ సాక్షిగా ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు ఇచ్చామని అబద్ధాలు చెప్పాడని, మీ నియోజకవర్గంలో రఘునాధపాలెం కు వస్తాను మీరు వస్తారా అంటూ హరిష్‌ రావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్‌ విసిరారు. జిల్లాలో ఒక మంత్రి భూ బకాసురుడు, డిప్యూటీ సీఎం కమిషన్‌ ఏజెంట్‌ గా ధ్వజమెత్తారు. వీళ్లు మంత్రులుగా ఖమ్మం కలెక్టరేట్‌ లో కూర్చొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేశారా అంటూ ఎద్దేవా చేశారు. ఇదే అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్కామ్‌ ను బయట పెడితే మమ్మల్ని సస్పెండ్‌ చేశారంటూ గుర్తు చేశారు. అసెంబ్లీలో పొంగులేటి చేసిన స్కాంను కప్పిపుచ్చేందుకు అనేక నాటకాలు వేశారని విమర్శించారు. తెలంగాణలో రైతులకు రైతుబంధు వేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఎప్పుడైనా సమయానికి రైతుబంధు వేశారా అన్నారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్‌ రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే దొంగలెక్కలు చెప్పి తప్పించుకున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లాను గోదావరి నీళ్లను అందించేందుకు సీతారామ ప్రాజెక్ట్‌ కెసిఆర్‌ ప్రారంభిస్తే ఇప్పుడున్న పాలకులు నీళ్లు నెత్తిమీద చల్లుకోవడమే తప్ప ఆ ప్రాజెక్టు ఎంత మేరా పనులు పూర్తి చేశారు చెప్పాలన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని రాబోయే రోజుల్లో అందరూ ఏకతాటి వచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించి మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తేనే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలిపారు.

ఏపీకి గోదావరి నీళ్ళు ఎత్తుకుపోయే కుట్ర
ఆంధ్రప్రదేశ్‌ కు గోదావరి నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో మన ముఖ్యమంత్రి ఉన్నారని హరీష్‌ ఆరోపించారు. అందుకే గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ, మేడిగడ్డ, సీతమ్మ సాగర్‌ వంటి ప్రాజెక్టుల పనులను సాగనీయటం లేదన్నారు. ముగ్గురు మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆస్తుల గురించి తప్ప ప్రజల గురించి ఈ ముగ్గురికీ ఆలోచన లేదని విమర్శించారు.

కేసీఆర్‌ ను సీఎంను చేసేదాకా తగ్గేదే లేదు: మాజీ మంత్రి అజయ్‌
కెసిఆర్‌ ను ముఖ్యమంత్రిని చేసేదాకా తగ్గేదే లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. అధికారం లేనప్పుడు పార్టీలో ఉన్నవారే నిబద్ధతగల వారని పేర్కొన్నారు. సంక్షేమం – అభివద్ధి రెండు కండ్లుగా కేసీఆర్‌ ఖమ్మం జిల్లాలో అభివద్ధి చేశారని తెలిపారు. 2028 సంవత్సరంలో కెసిఆర్‌ ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకే తాను ఆరోగ్యవంతునిగా వచ్చానన్నారు. అసెంబ్లీ గేటు తాకనీయనని ప్రేలాపనలు పేలిన ఆయనను 2028 లో అసెంబ్లీ గేటు తాకనీయొద్దని పిలుపునిచ్చారు. ఏనాడు జై తెలంగాణ అనని వాళ్లకు కెసిఆర్‌ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అవసరానికి కెసిఆర్‌, కేటీఆర్‌ వద్దకు వచ్చినవారు అధికారం పోగానే పార్టీలు మారుతున్నారని తెలిపారు. ప్రజలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని నిలదీశారు. అవకాశం కోసం కేసీఆర్‌ దగ్గరికి వచ్చి పదవులు, పనులు తీసుకున్న వారే ఇప్పుడు మొరుగుతున్నారని విమర్శించారు. ఈ సమ్మేళనంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, బానోత్‌ చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు , బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ మంత్రి అజయ్‌ కుమారుడు నయన్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -