– ఏడీఏ పెంటేల రవికుమార్ సూచనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల సరళిలో మార్పులు చేసుకుంటూ ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ రైతులు చేసే శ్రమే వ్యవసాయం. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి లభ్యతపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వరి సాగును తగ్గించి ఆరుతడి, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. సాగునీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సాగు పద్ధతుల్లో మార్పులు
రైతులు తమ అనుభవంతో పాటు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకున్నారు. వరి తప్ప ఇతర పంటలు సాగు చేయలేని పల్లపు భూముల్లో వరి విత్తనాలను నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. దీంతో నాట్లు, కూలీల ఖర్చు తగ్గడంతోపాటు నీరు, ఇతర వనరులను సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.
సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పేర్లు నమోదు చేసుకొని మొక్కలు తెప్పించుకుంటుండగా, పలువురు ఇప్పటికే మొక్కలు నాటి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా వరి, పత్తి, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, అరటి, కూరగాయలు, జామాయిల్ తదితర పంటలను సాగు చేస్తున్నారు.
పత్తి సాగులో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నారు. వరి పొలాల గట్లపై పెసర, మినుము, కంది, బెండ, సొరకాయ వంటి పంటలను సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటల్లో సీడ్ డ్రిల్ ద్వారా వరి సాగు చేపడుతున్నారు. అపర పంటల్లో మినుము విస్తీర్ణం పెరగగా, నూనెగింజల పంటల్లో వేరుశనగ సాగు కూడా పెరిగింది.
మద్దతు ధర కల్పించాలి
రైతుల సృజనాత్మకతకు తోడు ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకం ద్వారా అందిస్తున్న రాయితీ విత్తనాలు కొంత భరోసా కల్పిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సన్న రకాల వడ్ల కు బోనస్ అందించిన తరహాలోనే అపరాలు, నూనెగింజల పంటలు సాగు చేసే రైతులకు కూడా మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రత్యామ్నాయ పంటల సాగుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో వంటి పరిణామాల నేపథ్యంలో పంటల సరళిలో మార్పులు తప్పనిసరి అవుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వరి సాగుపై అధిక ఆధారపడటాన్ని తగ్గించి నూనెగింజలు, అపరాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
విపత్కర పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులు, నేల స్వభావం, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ఏడీఏ రవికుమార్ సూచించారు. రైతులు అనుసరిస్తున్న వైవిధ్యమైన సాగు పద్ధతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం
వర్షాభావం లేదా ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమైన రైతులు సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించవచ్చు. సెప్టెంబర్ మొదటి పక్షం, రెండో పక్షం వారీగా అనువైన పంటలను ఎంపిక చేసుకోవచ్చని వ్యవసాయ సూచనలు పేర్కొంటున్నాయి. అయితే పంట ఎంపికలో నేల స్వభావం, నీటి లభ్యత, స్థానిక వాతావరణ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
సెప్టెంబర్ 1–15 మధ్య..
ఈ కాలంలో మొక్కజొన్న, మాగి జొన్న, సజ్జ, అలసంద, ఉలవలు, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, స్వల్పకాలిక కూరగాయలు సాగు చేసుకోవచ్చని సూచనలు ఉన్నాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు వంటి పంటలను తీసుకోవచ్చు. మాగి జొన్న ను మధ్యస్థం నుంచి భారీ నేలల్లో సాగు చేయడం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 16–30 మధ్య..
ఈ సమయంలో మొక్కజొన్న, మాగి జొన్న, కంది, అలసంద, ఉలవలు, పెసర, మినుము వంటి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. నీటి వసతి ఉంటే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సాగుకు అవకాశం ఉంటుంది. మాగి జొన్న ను మధ్యస్థం నుంచి భారీ నేలల్లో చేసుకోవచ్చని సూచించారు.
నీటి వసతిపై నిర్ణయం..
ఆలస్యంగా విత్తే పంటల్లో నీటి లభ్యత కీలకం. అందుబాటులో ఉన్న తేమ, సాగునీటి వసతి, నేల స్వభావాన్ని అంచనా వేసిన తర్వాతే విత్తనాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకునే సమయంలో స్థానిక వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.



