– విద్యాశాఖ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ – అంకితోత్సవం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సంపాదకత్వంలో వెలువడిన విద్యార్ధుల కవిత్వం ’’కలికలు’’ పుస్తకాన్ని స్థానిక శాసన సభ్యులు జారె ఆదినారాయణ ఆవిష్కరించారు.స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి పి.ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన ఆవిష్కరణ సభలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జారె ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్ధుల్లో సాహిత్య విత్తులు నాటడం కవితలల్లించడం, కథలు వ్రాయించడం వాటిని పుస్తకాలు గా తీసుకురావడం ఎంతో అభినందనీయమని ఈ కాలపు పిల్లలు సెల్ఫోన్లో గడపకుండా సాహిత్యం వైపుకు మళ్లించడం అనేది అత్యంత విలువైన సామాజికాంశమని ఈ పనిని ప్రభాకరాచార్యులు ఎంతో ఉన్నత వ్యక్తిత్వంతో చేపట్టారని బాలసాహిత్యం పెంపొందించవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు.
ఇంతటి విలువైన పుస్తకాన్ని తనకు అంకితమివ్వడం తనపై మరింత బాధ్యతను మోపినట్లయిందని అన్నారు.అశ్వారావుపేట లో యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ స్కూల్ , తెలంగాణా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. పుస్తక సంపాదకులు ప్రభాకరాచార్యులు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్ధులు, ప్రజల సమక్షంలో శాసనసభ్యులకు అంకితమిచ్చారు. అనంతరం మండల విద్యాధికారి ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ ఎమ్మెల్యే అయినప్పటినుండి ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతొ కృషి చేస్తున్నారని అన్నారు.
సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారని అన్నారు. ఇటీవల నిర్వహించిన శతాధిక బాలకవిసమ్మేళనం కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు లో నమోదైనది. సంస్థ పంపిన ధృవీకరణ పత్రాన్ని, జ్ఞాపికను మండలవిద్యాధికారికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్పర్సన్ జూపల్లి శశికళ, ఆత్మ కమిటి ఛైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,జూపల్లి ప్రమోద్,చిన్నంశెట్టి సత్యనారాయణ,తుమ్మ రాంబాబు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



