29న ఎస్‌ఎంసీల ఎన్నికలు

– రేపు నోటిఫికేషన్‌ విడుదల
– నాలుగేండ్ల తర్వాత నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు ఈనెల 29న ఎట్టకేలకు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన గురువారం షెడ్యూల్‌ జారీ చేశారు. ఎస్‌ఎంసీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం జారీ చేస్తామని తెలిపారు. అదేరోజు తల్లిదండ్రుల జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 24న తల్లిదండ్రుల తుదిజాబితా ప్రకటిస్తామని వివరించారు. ఈనెల 29న ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్‌ఎంసీల సభ్యులకు పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. నూతన సభ్యులను ముందుగా ఎన్నుకుంటారనీ, ఆ తర్వాత ఎస్‌ఎంసీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఎస్‌ఎంసీ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్ల ఎన్నికలుంటాయని వివరించారు. వారి ప్రమాణస్వీకారం అనంతరం అదేరోజు మొదటి ఎస్‌ఎంసీ సమావేశాన్ని మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని తెలిపారు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఎస్‌ఎంఎస్‌లను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2019, నవంబర్‌లో చివరి సారిగా ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. వాటి కాలపరిమితి రెండేండ్లు ఉంటుంది. గడువు ముగిసినా ఆ కమిటీలను రెండుసార్లు ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. దీనివల్ల స్కూల్‌లో చదువు పూర్తయిన విద్యార్థుల తల్లిదండ్రులే ఇంకా ఎస్‌ఎంసీలో కొనసాగుతున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త ఎస్‌ఎంఎస్‌ల నియామకానికి షెడ్యూల్‌ జారీ చేయడం గమనార్హం.
ఎస్‌ఎంసీ ఎన్నిక విధానం :
– ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వారిలో విధిగా ఇద్దరు మహిళలుండాలి. ఏకగ్రీవ ఎన్నికకు వీలవ్వకపోతే చేతులెత్తే పద్ధతిలో ఎన్నికను నిర్వహిస్తారు.
– స్కూల్‌ హెచ్‌ఎం కూడా సభ్యులుగా ఉంటారు. వారు కాకుండా స్థానిక కార్పొరేటర్‌, వార్డు మెంబర్‌, అంగన్‌వాడీ కార్యకర్త, హెల్త్‌ వర్కర్‌, మహిళా సమాఖ్య అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ముగ్గురికి తక్కువ కాకుండా స్థానిక ఎంఈవో కో-ఆప్షన్‌ సభ్యుడిని ఎంపిక చేస్తారు.
– ప్రాథమిక పాఠశాలలో మొత్తం 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 21 మంది సభ్యులుగా ఉంటారు. ఎన్నికైన సభ్యులు చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ను ఎన్నుకుంటారు. అవసరమైతే ఓటింగ్‌ నిర్వహిస్తారు.

Spread the love