– సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి
– గణేష్ ఉత్సవ నిర్వాహకులతో ఏసీపీ అవగాహన సదస్సు
నవతెగాణ-సత్తుపల్లి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, నిర్వహించుకోవాలని సత్తుపల్లి (కల్లూరు) ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. మండపాల నిర్వాహకులు అందరూ policeportal.tspolice.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఏసీపీ తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదాలు జరగకుండా అత్యవసర మార్గాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
నాణ్యమైన విద్యుత్ తీగలను వాడటంతో పాటు నిపుణులతో వైరింగ్‌ను తనిఖీ చేయించాలన్నారు. ప్రతి మండపం వద్ద ఫైర్ ప్రూఫ్ జాగ్రత్తలతో పాటు తగినంత నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వివాదాస్పద స్థలాలు, ప్రధాన రహదారులపై మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రైవేట్ స్థలాలైతే యజమాని అనుమతి పత్రం తప్పనిసరి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు
మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. నాన్-డిస్టర్బెన్స్ లెవెల్లో కేవలం రెండు మైకులను మాత్రమే ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు అనుమతిస్తారని పేర్కొన్నారు. ప్రతి మండపం వద్ద ఇద్దరు ప్రతినిధులు 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, అత్యవసర వివరాలతో కూడిన నోటీసు బోర్డు, పాయింట్ బుక్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద అసభ్యకరమైన నృత్యాలు లేదా శబ్ద కాలుష్యానికి తావిచ్చే ప్రదర్శనలను పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
ఊరేగింపులు, నిమజ్జనాలు, జాగ్రత్తలు ఇలా…
పోలీసులను సమన్వయం చేసుకుంటూ, నిర్ణయించిన మార్గాలు, సమయాలను మాత్రమే పాటించాల్సి ఉంటుందని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేక పర్యవేక్షణ వహించాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ కోరారు. సమావేశం ప్రారంభానికి ముందు ఉత్సవ నిర్వాహకులకు సైబర్ అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు అశోక్, ప్రదీప్, కవిత, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.



