– రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
– అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
నవతెలంగాణ-సత్తుపల్లి
అటవీ పరిరక్షణలో ప్రాణాలర్పించిన అమరుల సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం అటవీ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దయానంద్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అటవీ అమరుల స్తూపానికి డాక్టర్ దయానంద్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల జ్ఞాపకార్థం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ… ప్రకృతి సంపదను, అడవులను కాపాడే క్రమంలో స్మగ్లర్లు, వేటగాళ్ల చేతుల్లో వీరమరణం పొందిన అధికారుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
స్థానిక అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. 1928 సెప్టెంబర్ 11న చందనపు దొంగలను అడ్డుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారి శ్రీనివాసన్ త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. సమాజ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరుల త్యాగ నిరతి ఎందరికో స్పూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని, వృక్ష సంపదను రక్షించుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ రెహానా కమల్ స్థానిక అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



