Saturday, September 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘బ్రిక్స్‌’ సమ్మిట్‌ - భారత్‌ స్వతంత్రతకు ఓ పరీక్ష‍

‘బ్రిక్స్‌’ సమ్మిట్‌ – భారత్‌ స్వతంత్రతకు ఓ పరీక్ష‍

- Advertisement -

ప్రపంచశక్తి సమీకరణాలు మారుత న్నాయి. నిన్నటి వరకు ప్రపంచ వ్యవహారాల్లో తుది మాటగా వినిపించిన స్వరాలకు ఇప్పుడు సవాళ్లు ఎదురవుతు న్నాయి. కొత్త దేశాలు, కొత్త ఆర్థిక శక్తులు, కొత్త రాజకీయ సమీకర ణాలు ముందుకు వస్తున్నాయి. ఈ మార్పునకు ముఖ్యమైన సంకేతా లలో ‘బ్రిక్స్’ ఒకటి. కానీ ఇప్పుడు అది కేవలం కొత్త శక్తుల సమూహంగా మిగిలిపోతుందా? లేక ప్రపంచంలో అసమానతలు తొలగించే రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? అన్నది దాని ముందున్న అసలు ప్రశ్న. నేడు ఢిల్లీలో ప్రారంభమవుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సందర్భం. పదకొండు దేశాలకు విస్తరించిన బ్రిక్స్ ప్రపంచ జనాభాలో 49.5శాతానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నలభై శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అంటే తగిన సంఖ్యాబలమూ ఆర్థిక సామర్థ్యమూ ఉంది. కానీ, ఆ బలం ఒక ఉమ్మడి రాజకీయ దిశగా మారుతుందా అన్నదే అసలు పరీక్ష. బ్రిక్స్ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రశ్న కూడా ఇదే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొన్ని దేశాల ఆధిపత్యం ఎందుకు కొనసాగాలి? అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమాన నిర్ణయాధి కారం ఎందుకు ఉండకూడదు? ఈ అసమానతను ప్రశ్నించడానికి ఏర్పడిన బ్రిక్స్ ఇప్పుడు తన చారిత్రక ఉద్దేశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందన్నది కీలకం.

అందువల్ల బ్రిక్స్ లక్ష్యాన్ని కేవలం ‘ఆర్థిక సహకారం’గా పరిమితం చేయలేం. ప్రపంచాన్ని ఒకే శక్తి శాసించే పరిస్థితికి ప్రత్యామ్నాయంగా బహుళ ధ్రువ వ్యవస్థను బలోపేతం చేయడం దాని చారిత్రక బాధ్యత. అంతర్జాతీయ సంస్థలను ప్రజాస్వామికీకరించడం, అభివృద్ధి చెందుతున్న దేశాల నిర్ణయాధికారాన్ని పెంచడం, పరస్పర ఆర్థిక సహకారాన్ని విస్తరించడం దాని ప్రధాన కర్తవ్యాలు. కానీ, ఇప్పుడు బ్రిక్స్ ఒక కీలక మైన మలుపు వద్ద నిలిచి వుంది. బ్రిక్స్ విస్తరించింది. దాని బలం పెరిగింది. అదే సమయంలో సభ్యదేశాల మధ్య విభేదాలూ పెరిగాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్య ఉంది. రష్యా-నాటో దేశాల ఘర్షణ కొనసాగుతోంది. అమెరికాతో ప్రతి సభ్యదేశానికీ సంబంధాలు ఒకేలా లేవు. పశ్చిమాసియాలోనూ ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్, యూఏఈ మధ్య విభేదాలు కూడా బ్రిక్స్ ఐక్యతకు పరీక్షగా మారాయి. గత మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని మరింత అస్థిరం చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు, హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఇంధన వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. చమురు ధరలు పెరుగుతున్నాయి. ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం ప్రపంచంలోని ప్రతిదేశ ఆర్థికవ్యవస్థను తాకే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో బ్రిక్స్ మౌనంగా ఉండే వేదికగా మిగలకూడదు. యుద్ధానికి వ్యతిరేకంగా, దౌత్యానికి అను కూలంగా, ఏకపక్ష ఆంక్షలకు వ్యతిరేకంగా స్పష్టమైన రాజకీయ స్వరం వినిపించాలి. ప్రపంచ శాంతి కోసం సమిష్టి ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడే భారత్ పాత్ర కీలకమవుతుంది. బ్రి‌క్స్‌‌కు అధ్యక్షత వహిస్తున్న దేశంగా భారత్‌‌కు ఇది ఒక చారిత్రక అవకాశం. అదే సమయంలో ఒక అసౌకర్యమైన ప్రశ్న కూడా ఉంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం బ్రిక్స్‌‌ను బలోపేతం చేస్తామని చెబుతున్న భారత్… అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే విషయంలో ఎంతవరకు స్వతంత్రంగా వ్యవహరిస్తోంది? ఈ ప్రశ్నను తప్పించుకోలేం. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి అనేక రంగాల్లో బలపడ్డాయి. చైనాను ఎదుర్కొనే అమెరికా వ్యూహంలో భారత్‌‌కు ప్రత్యేక స్థానం కల్పించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ‘క్వాడ్’ వంటి వేదికల్లో భారత్ భాగస్వామ్యం కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగమే. భారత్ తన భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, ఒక పెద్ద దేశాన్ని ఎదుర్కోవడానికి మరో పెద్ద దేశం పన్నే వ్యూహంలో భాగస్వామిగా మారడం తన స్వతంత్ర విదేశాంగ విధానానికి ఎంతవరకు అనుకూలం అన్నది ప్రశ్నిం చాల్సిందే. ప్రపంచాన్ని ఒకే శక్తి నియంత్రించకూడదని బ్రిక్స్‌‌లో చెప్పి, ఆసియాలో మరో శక్తిని అడ్డుకోవడానికి అమెరికా వ్యూహంలో భాగస్వామి కావడం పరస్పర విరుద్ధం కాదా?

ఈ వైరుధ్యాన్ని కప్పిపుచ్చి ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ అని చెప్పడం సరిపోదు. ఇరాన్ వంటి చిరకాల మిత్రదేశంపై అమెరికా-ఇజ్రాయిల్ సాగించిన దాడులను స్పష్టంగా ప్రశ్నిం చడంలో భారత్ ఎందుకు వెనుకాడుతోంది? రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలపై అమెరికా ఒత్తిళ్లు, ఆంక్షలు వచ్చినప్పుడు వాటిని లెక్కచేయకుండా తన జాతీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకునే స్వతంత్రతను భారత్ ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతోంది? బ్రిక్స్ ఆర్థిక లక్ష్యాల విషయంలోనూ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ అవసరమనే చర్చ చాలా కాలంగా ఉంది. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు బలోపేతం వంటి చర్యలు ఆ దిశలో ఉపయోగపడవచ్చు. అయితే భారత్ ఈ విషయంలో ‘జాగ్రత్త’ పేరుతో అమెరికా పట్ల స్వామిభక్తిని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. ‘డీ-డాలరైజేషన్’ను అధికారిక బ్రిక్స్ లక్ష్యంగా పెట్టకూడదన్న భారత వైఖరి కూడా బయటపడింది. జాగ్రత్త అవసరమే. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రశ్నించే విషయంలో వెనుకడుగు వేయడం బ్రిక్స్ ఉద్దేశానికే విరుద్ధం. ఈ మాట కేవలం అమెరికా వ్యతిరేకత గురించి కాదు. ఏ ఒక్క దేశానికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అసాధారణమైన నియంత్రణ ఉండకూడదనే సూత్రం గురించి.

బ్రిక్స్ ముందున్న కర్తవ్యం కూడా ఇదే. ఒక ఆధిపత్యానికి బదులు మరో ఆధిపత్యాన్ని సృష్టించకూడదు. చైనా ఆధిపత్యం గానీ, రష్యా ఆధిపత్యం గానీ, మరే పెద్ద దేశ ఆధిపత్యం గానీ బ్రిక్స్ లక్ష్యం కాదు. బహుళ ధ్రువ ప్రపంచం అంటే అనేక పెద్ద దేశాలు తమ తమ ప్రభావ ప్రాంతాలను పంచుకోవడం కాదు. చిన్నా పెద్దా దేశాలకు సమాన హక్కులు ఉండే ప్రపంచ వ్యవస్థ. అందుకే బ్రిక్స్ ఐక్యతకు రాజకీయ పునాది అవసరం. విభేదాలు ఉన్నా యుద్ధానికి వ్యతిరేకంగా ఒకే మాట చెప్పగలగాలి. వాణిజ్య ప్రయోజనాలు భిన్నంగా ఉన్నా ఏకపక్ష ఆర్థిక ఆంక్షలను ప్రశ్నించగలగాలి. జాతీయ ప్రయోజనాలు వేర్వేరైనా అంతర్జాతీయ సంస్థల ప్రజాస్వామికీకరణ కోసం కలిసి నిలబడగలగాలి. భారత్ అధ్యక్షత ఈ దిశగా ఉపయోగపడాలి. గ్లోబల్ సౌత్ నాయకత్వం గురించి మాట్లాడటం మాత్రమే కాదు, ఆ నాయకత్వానికి అవసరమైన రాజకీయ స్వతంత్రతను కూడా చూపాలి. అమెరికా ఒత్తిడి ఉన్నప్పుడు ఒక మాట, రష్యా విషయంలో మరో మాట, చైనా విషయంలో ఇంకో మాట అనే లెక్కలకంటే భారత విదేశాంగ విధానానికి ఒక స్పష్టమైన ప్రాథమిక సూత్రం ఉండాలి. దేశాల సార్వభౌమత్వం, సమానత్వం, శాంతి, స్వతంత్ర నిర్ణయాధికారం… అదే బ్రిక్స్ స్ఫూర్తి. ఢిల్లీ సమావేశం అందుకే కేవలం ఒక శిఖరాగ్ర సమావేశం కాదు.

ప్రపంచం ఎటువైపు వెళ్తుందన్న దానిపై జరుగుతున్న పెద్ద రాజకీయ చర్చలో ఇది ఒక మలుపు. విస్తరణతో వచ్చిన సంఖ్యాబలం రాజకీయ బలంగా మారుతుందా? లేక విభేదాల మధ్య అది కేవలం సమావేశాల వేదికగా మిగిలిపోతుందా? బ్రిక్స్ తనను తాను ప్రశ్నించు కోవాలి. భారత్ కూడా ప్రశ్నించుకోవాలి. గ్లోబల్ సౌత్ నాయకత్వం అంటే ఒకవైపు పాశ్చాత్య ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, మరోవైపు అమెరికా వ్యూహానికి దగ్గరవడం కాదు. బహుళ ధ్రువ ప్రపంచం అంటే అమెరికాకు ఎదురుగా మరో శక్తిని నిలబెట్టడం కూడా కాదు. ఏశక్తి ఒత్తిడికీ లొంగకుండా, ప్రజల ప్రయోజనాల మేరకు స్వతంత్రంగా నిర్ణ యాలు తీసుకునే మార్గాన్ని నిర్మించడమే. అదే నిజమైన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి. ప్రపంచ ఆధిపత్య రాజకీయాలను ప్రశ్నిస్తున్న బ్రిక్స్‌‌కు అధ్యక్షత వహిస్తున్న వేళ, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన స్వతంత్ర విదేశాంగాన్ని నిలబెట్టుకోవడమే భారత్ ముందున్న అసలు పరీక్ష.

రమేష్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -