Saturday, September 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఏచూరి ఒక స్మరణ కాదు, ఆశయాల కొనసాగింపు...

ఏచూరి ఒక స్మరణ కాదు, ఆశయాల కొనసాగింపు…

- Advertisement -

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారీ
ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన గొంతు…
లౌకికవాదంపై దాడి జరిగిన ప్రతిసారీ
గట్టిగా ప్రతిఘటించిన స్వరం…
కార్మికులు, రైతులు, పేదలు,
అణగారిన వర్గాల హక్కుల కోసం
నిరంతరం పోరాడిన ఎర్రజెండా నాయకుడు…
మార్క్సిజాన్ని కేవలం అధ్యయనం చేయకుండా,
ఆ సిద్ధాంతాన్ని ప్రజాజీవితంలో ఆచరణకు తీసుకువచ్చిన దార్శనికుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. ​నేడు ఆయన రెండో వర్థంతి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతవేత్తగా దేశ రాజకీయా ల్లో తనదైన ముద్రవేసిన ఏచూరి గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రజా సమస్యలపై పదునైన వాదన, మార్క్సిజంపై లోతైన అధ్యయనం, ప్రజా ఉద్యమాల పట్ల అచంచలమైన నిబద్ధత ఆయన రాజకీయ జీవితానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన ఏచూరి హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి, ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్లారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు) లో విద్య నభ్యసించడంతో పాటు, ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి రెండు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్కడ అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఒక సందర్భంలో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో విద్యార్థి సమస్యలపై చర్చించి, తన వాదనా పటిమతో ఆమెను మెప్పించిన నాయకుడు.

అధ్యయనం- ఆచరణ
ఈ కాలంలోనే పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, సూర్జిత్ వగైరా నాయకుల తర్పీదుతో మార్క్సిజం-లెనినిజం సిద్ధాంత పునాదులను అధ్యయనం చేసి, పార్టీలో ఒక సిద్ధాంతవేత్తగా గుర్తింపు పొందారు. 1992లో మద్రాస్‌లో జరిగిన 14వ పార్టీ మహాసభల్లో మార్క్సిస్టు సిద్ధాంత సమకాలీనతపై విస్తృత చర్చ జరిగింది. సోవియట్ సోషలిస్టు శిబిరం విచ్ఛిన్నమైన రోజులవి. ఈ విచ్ఛిన్నానికి కారణాలేమిటి? అనే ప్రశ్నపై విశ్లేషణ సాగింది. మార్క్సిజం అజేయమనే తీర్మానాన్ని మహాసభ చర్చించింది. ఈ సందర్భంగా సోవియట్ వైఫల్య కారణాలను సైద్ధాంతికంగా వివరించి, మార్క్సిజం సమకాలీనతను సమర్థిస్తూ తన అద్భుత వాదనతో సభలో తీర్మానం పెట్టింది కామ్రేడ్ ఏచూరినే. అప్పటికింకా ఆయన పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా కాకపోయినా, నాయకత్వం ఆయన ప్రతిభకు ఆ ప్రాధాన్యతను ఇచ్చింది. కేంద్రకమిటీ సభ్యుడిగా ఉండి, ఆ సభలోనే ప్రకాశ్‌కరత్‌తో పాటు తానూ పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఆ బాధ్యతల్లో పనిచేస్తూనే 2024 సెప్టెంబర్ 12న తీవ్ర అనారోగ్యంతో మరణిం చారు. సిద్ధాంత అధ్యయనం మాత్రమే కాకుండా, దాని అమలు కోసం అహర్నిశలూ, అవిశ్రాంతంగా పనిచేసిన నాయకుడు కామ్రేడ్ ఏచూరి. బహుశా ఆయన జీవితంలో ఎక్కువ భాగం పార్టీ కార్యకలాపాల నిమిత్తం దేశం నలుమూలలా ప్రయాణిం చడంలోనే గడచి ఉంటుంది. ఏచూరి తన మన దేశం గురించి ఒక విషయాన్ని పదే పదే నొక్కిచెప్పారు. ‘ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వాదం, ఆర్థిక న్యాయం’ ఇవి భారత రాజ్యాంగానికి ప్రాథమిక స్తంభాలు. ఈ నాలుగిం టిలో ఏ ఒక్కదాన్ని బలహీన పర్చినా, మిగిలినవి నిలబడలేవని ఆయన వాదించేవారు.

ప్రజాస్వామ్యం-లౌకికవాదం
ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల ప్రక్రియగా మాత్రమే ఆయన చూడలేదు. భారతదేశ లౌకిక, బహుళత్వ స్వభావంలో ప్రజాస్వామ్యం విడదీయ రాని భాగమని భావించారు. వివిధ జాతులు, భాషలు, సంస్కృతులతో కూడిన భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్రం నుంచి ‘మెజారిటీ మతాధిపత్య రాజ్యం’గా, అంటే ‘హిందూ రాజ్యం’గా మార్చే ప్రయత్నం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆయన తరచూ హెచ్చరించేవారు. ప్రజాస్వా మ్యం అంటే ప్రతి పౌరుడినీ కలుపుకుని వెళ్లే వ్యవస్థ కావాలని, వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన స్పష్టం చేసేవారు.

పార్లమెంటు-భిన్నాభిప్రాయాలు
ఈ విషయంలో కామ్రేడ్ ఏచూరి చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు వెల్లడించేవారు. ‘ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేనపుడు, కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీగా నిలబెట్టేం దుకు ప్రతిపక్షం పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేయడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం కూడా ప్రజాస్వా మ్య ప్రక్రియలో భాగమే’ అని ఆయన చెపుతుండేవారు. ‘భిన్నాభిప్రా యాలను అణచివేయడం ద్వారా పార్లమెంట్‌ను నిర్వీర్యం చేస్తే రాజ్యాంగ వ్యవస్థే కుప్పకూలుతుంది’ అని ఆయన ఒకసారి రాజ్యసభలో తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆర్థిక ప్రజాస్వామ్యం-వర్గపోరాటం
రాజకీయ సమానత్వం మరియు సామాజిక-ఆర్థిక అసమానతల మధ్య వైరుధ్యం గురించి, మార్క్సిస్టు దృక్పథం నుంచి కామ్రేడ్ ఏచూరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన ఒక ముఖ్యమైన హెచ్చరికను తరచూ ప్రస్తావించేవారు. ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ అనే రాజకీయ సమానత్వం మాత్రమే సరిపోదు. అది నిజమైన ప్రజాస్వామ్యంగా మారాలంటే ‘ఒక వ్యక్తి – ఒక విలువ’ అనే ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఓటు విలువ సమానంగా ఉండటమే కాకుండా సమాజంలో అతని జీవితం, శ్రమ, హక్కులు, అవకాశాలకు కూడా సమాన విలువ ఉండాలి. ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటం వర్గపోరాటంతో విడదీయ రానిదని ఏచూరి బోధించేవారు. అందువల్ల కార్మికవర్గానికి సాధికారత కల్పించడం, వ్యవసాయ కార్మికుల హక్కులను పరిరక్షించడం, యువతకు విద్య, ఉపాధి కల్పించడం, ప్రభుత్వ నిధులతో నాణ్యమైన విద్య అందించడం, ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు కల్పించడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, మహిళా సాధికారతను సాధించడం వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అవసరం.

ప్రజాస్వామ్య రక్షణ-ఎన్నికల వ్యూహాలు
తన రాజకీయ జీవితంలోని చివరి సంవత్సరాలలో ఏచూరి సమకాలీన జాతీయ ఎన్నికలను ‘భారత ప్రజాస్వామ్య మనుగడ’కు సంబంధించిన ‘అస్తిత్వ పోరాటం’గా భావించారు. సాంప్రదాయిక రాజకీయ విభేదాలను దాటి ఆయన ‘ఇండియా’ ప్రతిపక్ష కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.వివిధ రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు రావటానికి ఆయన ‘విడివిడిగా పయనించండి – ఐక్యంగా పోరాడండి’ అనే యాంటీ ఫాసిస్టు వ్యూహాన్ని ఉపయోగించారు.

ఆరెస్సెస్, బీజేపీ ఎదుగుదల-లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత
ఆరెస్సెస్, బీజేపీ కూటమి 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలోకి రావడం దేశంలో పెరుగుతున్న మతోన్మాద శక్తుల ప్రమాదాన్ని స్పష్టంగా ముందుకు తెచ్చింది. దీంతో వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకికశక్తుల ఐక్యత మరింత అత్యవసరంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే యుపిఎ-1 ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకత్వంలో, వామపక్షాల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. వామపక్షాలకు 61, అందులో సీపీఐ(ఎం) ఒక్కదానికే 43 పార్లమెంట్ సీట్లు ఉండటం, బెంగాల్, కేరళ, త్రిపుర మూడు రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండటం, వామపక్షాల మద్దతుపైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆధారపడటం ఫలితంగా ఆ కాలంలో అనేక ప్రజానుకూల చర్యలు, చట్టాలు ఆమోదించబడ్డాయి.

కనీస ఉమ్మడి కార్యక్రమం- వామపక్ష ముద్ర
2004లో యుపిఎ-1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించి ఆమోదిం చబడింది. ఈ కార్యక్రమ రూపకల్పనలో సీతారాం ఏచూరి కీలక పాత్ర దారిగా ఉన్నారు. దీని ఆధారంగానే వామపక్షాల వత్తిడితో ఆ కాలంలో అనేక ప్రజానుకూల చర్యలు చేపట్టబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి: 1.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. 2.అటవీ హక్కుల చట్టం. 3.సమాచార హక్కు చట్టం. 4.ఆహార భద్రతా చట్టం. 5.విద్యాహక్కు చట్టం. 6.రైతులకు పాక్షిక రుణమాఫీ. 7.ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీ కరణపై కొంతమేర నియంత్రణ. ఇవన్నీ ప్రజానుకూల చర్యలుగా అమలు చేయబడ్డాయి.

రాజ్యసభలో సీతారాం ఏచూరి
కామ్రేడ్ సీతారాం 2005 నుంచి 2017 వరకు 12 సంవత్సరాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈ సమయాన్ని ఆయన శ్రామిక ప్రజల, విభిన్న వర్గాల ప్రజా సమస్యలను లేవనెత్తడానికి, పరిష్కారానికి సమర్థవం తమైన కృషి సాగించడానికి వినియోగించారు. ఆయన ప్రసంగాలు సూటిగాను, పదునైన విమర్శలతోనూ, లోతైన సిద్ధాంత అవగాహనతోనూ నిండి ఉండేవి. ఆయన ఉపన్యాసాలను ప్రత్యర్థులతో సహా అందరూ ఆసక్తిగా ఆలకించేవారు. ఆయన రాజ్యసభ ప్రస్థానాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటి నాలుగేండ్లు యుపిఎ-1 కూటమి భాగస్వామిగా, అదే సమయంలో నిర్మాణాత్మక విమర్శలు, సలహాలు ఇచ్చే నాయకుడిగా, రెండవ దశలో ఐదేండ్లు యుపిఎ-2 కాలంలో ప్రభుత్వంతో విభేదిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా, మూడో దశలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి రాజకీయ ప్రతిపక్షంగా ఆయన పాత్రను నిర్వహించారు.వివిధ అంశాలపై రాజ్యసభలో ఆయన చేసిన విశ్లేషణాత్మక, ఆధారాలతో కూడిన ప్రసంగాలు సీపీఐ(ఎం), వామపక్షాల రాజకీయ వైఖరులను స్పష్టంగా ప్రజల ముందుంచాయి. సీతారాం ఏచూరి పార్లమెంటరీ జోక్యం ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కేవలం ఒక పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వాదం, ఆర్థిక సామాజిక న్యాయం, సామాన్య ప్రజల హక్కుల కోసం వాదించే గొప్ప పార్లమెంటేరియన్‌గా తన పాత్రను నిర్వహించారు.

ఆయన చూపిన బాటలోనే ముందుకు
మరికొన్నేండ్లు దేశానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి విలువైన సేవలందించగలిగే వయసులోనే కామ్రేడ్ ఏచూరి అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం. ఆయన మరణించి రెండేండ్లు గడిచినా, దేశ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే ప్రతి పోరాటంలో ఆయన ఆలోచనలు, చూపిన మార్గం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఎత్తిన ప్రశ్నలు నేటికీ మన ముందే ఉన్నాయి. హెచ్చరించిన ముప్పులు నేడు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. అందుకే ఏచూరిని స్మరించుకోవడం అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం ఒక్కటే కాదు… ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం, లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడటం-అదే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనం అర్పించే నిజమైన నివాళి.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -