దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పౌర పురస్కారం భారతరత్న. దేశానికి, సమాజానికి వివిధ రంగాల్లో అందించిన అసాధారణ సేవలకు ఇచ్చే అత్యున్నత గుర్తింపు. అలాంటి గౌరవాన్ని అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావుకు ‘సర్’ నోటీసులు రావడం దిగ్భ్రాంతికరం. తొంభై రెండేళ్ల వయసులో భారత శాస్త్రరంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత శాస్త్రవేత్త పేరు ఓటర్ల జాబితాలోని పాత రికార్డుతో సరిపోలలేదనే కారణంతో సమస్యాత్మకంగా మారడం ఎన్నికల సంఘం పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో కర్ణాటక ఎన్నికల సంఘం తప్పును ఎలా సరిచేయాలో మల్లగుల్లాలు పడుతోంది. మొదట ఆయన పేరు తప్పుగా ఉందని చెప్పి, ఇప్పుడు నోటీసులే ఇవ్వలేదని బుకాయిస్తోంది. కానీ ఆయన పేరు ‘డిస్క్రెపెన్సీ’ జాబితాలోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. సి.ఎన్.ఆర్.రావు ‘నేను భారత పౌరుడినే’ అని నిరూపించుకోవాలా? ‘నాకు భారతరత్న కూడా ఇచ్చారు, నన్ను గుర్తించండి’ అంటూ వేడుకోవాలా? అసలు ‘సర్’ పేరుతో ఏం జరుగుతోంది దేశంలో? సి.ఎన్.ఆర్.రావు ఒక వ్యక్తి మాత్రమే కాదు. నిర్మాణాత్మక రసాయన శాస్త్రం, పదార్థాల శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనలు భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చాయి.
దేశంలో శాస్త్ర పరిశోధనా సంస్థల అభివృద్ధికి, కొత్త తరాల శాస్త్రవేత్తల తయారీకి ఆయన చేసిన సేవలు అపారం. అందుకే దేశం 2014లో ఆయనను భారతరత్నతో గౌరవించింది. అలాంటి వ్యక్తి పేరు ఒక చిన్నపాటి రికార్డు తేడాతో అనుమానాల జాబితాలోకి రావడం భారతరత్న గౌరవానికే అవమానం. ఇక్కడ ప్రముఖులు, చిన్నవారు, పెద్దవారు అందరూ సమానమే కదా అన్న ప్రశ్న వస్తుంది. కానీ, అస్సాంలో ‘సర్’ చేపట్టిన ప్పుడు మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను ఏరివేయడానికేనని కేంద్రం చెప్పింది. తర్వాత బెంగాల్‌లో బంగ్లాదేశ్, బర్మా నుంచి వచ్చిన చొరబాటుదారుల కోసమనేని వాదించింది. ఇప్పుడు కర్ణాటకలో ఎవరున్నారు? తెలంగాణలోకి ఎవరు వచ్చారు? ‘సర్’ పేరుతో ప్రముఖులకు నోటీసులు పంపడం, వారు దేశానికి చేసిన సేవలను అవమానించడమే తప్ప వేరేకాదు. ఇది ఒక్క సి.ఎన్.ఆర్.రావు వ్యవహారంగా చూడలేం. పద్మశ్రీ గ్రహీత హరేకళ హజబ్బా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కుటుంబం, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితర ప్రముఖుల పేర్లు కూడా ‘సర్’లోని డిస్క్రెపెన్సీ లేదా మ్యాపింగ్ సమస్యల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నటుడు మహేశ్ బాబు, తదితరులకు ‘సర్’ నోటీసులు వచ్చినట్లు తాజా సమాచారం. ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది.
ఇదంతా ‘సర్’ దుశ్చర్యలో ఓ భాగం మాత్రమే. అసలు సమస్య సామాన్య ఓటర్లది. కర్నాటకలోనే 43.81 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పేరు మారడం, పాత రికార్డుతో వివరాలు సరిపోకపోవడం వంటి కారణాలతో పౌరులు తమ గుర్తింపును పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పత్రాలు అందజేసినా రశీదు ఇవ్వడం లేదని పలువురి ఆందోళనగా ఉంది. తెలంగాణలోనూ భారీ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం, ఇప్పటికే లక్షలాది పేర్లు తొలగింపు, మరికొందరికి నోటీసుల ప్రక్రియ ప్రజల్లో అను మానాలకు తావిస్తోంది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయడం అవసరమే. నకిలీ ఓట్లను తొలగించాల్సిందే. కానీ ఆ పేరుతో అసలైన ఓటర్లను తొలగించడం లేదా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పౌరులే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి తలెత్తడం మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ‘సర్’ ప్రారంభానికి ముందే ఢిల్లీ ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారన్నది ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నది.
ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలపై తలెత్తుతున్న వివాదాలు చూస్తే ‘సర్’ను కేవలం సాంకేతిక ప్రక్రియగా కొట్టిపారేయలేం. ముస్లింలు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు, పేదలు, బీజేపీ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని ఓట్లను ఏరి మరీ తీసేస్తున్నట్టు తెలుస్తోంది. కారణంగా ఏదో ఒక తప్పును వెతికి, దానికి కావాల్సిన ఆధారాలు చూపించమనడం వారిని ఓటుకు దూరం చేసే ఎత్తుగడనే! ఎన్నికల సంఘం కూడా దీనికి వంతపాడే విధానాలే అవలంభిస్తోందన్నవి ‘సర్’ ప్రారంభం నుంచి వస్తున్న విమర్శలే. దాని చర్యలు, నిర్ణయాలు ప్రతిపక్షాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా, ఒక తొత్తులా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావివ్వకుండా తన స్వతంత్రతను నిరూపించుకోవడంలో అది విఫలమవుతోంది. అందుకే రాజ్యాంగబద్ధ సంస్థగా ఈసీపై ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడం, ఓటర్లలో అభద్రతను తొలగించడం అత్యంత అవసరం. ‘సర్’ ప్రజాస్వామ్యాన్ని మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే ప్రక్రియ కావాలి. కానీ అదే ప్రక్రియలో ఓటరే తన పౌరసత్వాన్ని, తన ఉనికిని, తన ఓటు హక్కును నిరూపించుకోవాల్సి వస్తే అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. భారతరత్న పొందిన శాస్త్రవేత్తకే తన పేరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే, సామాన్య ఓటరు పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తప్పక తలెత్తుతుంది. ఓటరు జాబితాను శుద్ధి’ చేయడమే కాదు, ఓటు హక్కును కాపాడటమే ఎన్నికల సంఘం మొదటి బాధ్యత.
‘సర్’ దుశ్చర్య!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



