నవతెలంగాణ హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలెవరూ బయటకు రాకపోవడంతో నగరంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావడం లేదు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా అయితే ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ తాజాగా ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది.
సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్డోరాడో వెదర్ జాబితాలో మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే.. కొత్తగూడెం, గద్వాలలో 43.3, నిర్మల్, నిజామాబాద్‌లలో 43.0 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ప్రాంతంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి భౌగోళిక కారణాలతోపాటు అటవీ విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
మహారాష్ట్రలోని విదర్భ సరిహద్దులో ఉండటంవల్ల మధ్య భారతం నుంచి వీచే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను అమాంతం పెంచుతున్నాయి. దీనికి తోడు 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్లే సహజసిద్ధమైన చల్లదనం లోపించి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.



