భారత విప్లవోద్యమానికీ అదే ప్రధాన ఆటంకం
ప్రజల్ని చీల్చుతున్నది కులతత్వమే…
పాలకులకు కావాల్సిందీ అదే
పెట్టుబడిదారుల అదనపు దోపిడీకి అదొక ఆయుధం
కుల వ్యతిరేక ఉద్యమాలు, ఆర్థిక పోరాటాలు జమిలిగా సాగాలి : సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కులవ్యవస్థ పోతేనే అమెరికా, చైనా మాదిరిగా మన దేశం కూడా సూపర్ పవర్‌గా ఎదగడం సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి, విప్లవోద్యమానికి కులమే ప్రధాన ఆటంకంగా మారిందని తెలిపారు. అది ప్రజలు ఐక్యం కాకుండా నిలువునా చీల్చుతున్నదనీ, పాలకులు కూడా అదే కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. పెట్టుబడిదారుల దోపిడీకి కూడా అది ఒక ఆయుధంగా మారిందని చెప్పారు. మన దేశంలో బలంగా పాతుకుపోయిన కులవ్యవస్థ పోవాలంటే కుల వ్యతిరేక, ఆర్థిక పోరాటాలు జమిలిగా సాగాలనీ, ఆ దిశగా కలిసొచ్చే శక్తులను కలుపుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి రెండో వర్థంతి సభను సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.ప్రభాకర్, హైదరాబాద్ సెంట్రల్‌సిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొన్నారు. సభలో ‘కుల నిర్మూలన-మార్క్సిస్టు దృక్పథం’ అనే అంశంపై బీవీ.రాఘవులు స్మారకోపన్యాసం చేశారు. లౌకిక, ప్రజాస్వామిక, భారత రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, దేశంలో మతోన్మాద శక్తుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు సీతారాం ఏచూరి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
మన దేశంలో వేళ్లూనుకుని పాతుకుపోయిన కుల వ్యవస్థ విప్లవోద్యమానికి ప్రధాన ఆటంకంగా మారిందని చెప్పారు. దాన్ని నిర్మూలించకుండా ముందుకు పోలేమని స్పష్టం చేశారు. కులం శ్రమను గౌరవించదనీ, కుల వ్యవస్థ మనిషి పుట్టుక నుంచే శ్రమజీవులను చిన్నచూపు చూస్తోందని తెలిపారు. మహిళలు, దళితులు, వెనుబడిన తరగతుల వారికి చదువే అవసరం లేదని కులం చెబుతున్నదనీ, అలాంటప్పుడు దేశం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించారు. మన కంటే చిన్న దేశాలు ఉత్పాదకతలో, జీడీపీలో ఎంతో ముందు వరుసలో ఉన్నాయనీ, మన దేశం అలా ఎదగకపోవడానికి కులం కూడా ఒక కారణమని చెప్పారు. దేశంలో మతోన్మాద శక్తుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఢిల్లీ ఐఐటీ ప్రాంగణంలో బ్రాహ్మణులు తెలివిగలవాళ్లు..శూద్రులు తెలివితక్కువ వాళ్లు అని పోస్టర్లు వెలవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఉపన్యాసం చేసిన వేదికను హిందూత్వ సంస్థకు చెందినవాళ్లు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దేనికి సూచిక? అసలు మన దేశం ఎక్కడకు పోతుంది? అని ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని కూల్చేయడాన్ని బట్టే పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం చేసుకోవాలన్నారు.
కుల వ్యవస్థ పోకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆనాడే భక్తి ఉద్యమకారులు, గౌతమబుద్ధుడు, అంబేద్కర్, ఫూలే, భగత్‌సింగ్, వివేకానందుడు, సింగారపువేలు శెట్టియార్, తదితరులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తమ అధిక మిగులు కోసం, ప్రజల్ని చీల్చడం కోసం, అతి చౌకగా శ్రామికుల శ్రమను వాడుకోవడం కోసం కుల వ్యవస్థను వాడుకుంటున్న తీరును క్షుణ్ణంగా వివరించారు. బూర్జువా పార్టీలు మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న తీరును ఎండగట్టారు. దేశాన్ని మళ్లీ వెనుకటి కాలానికి తీసుకెళ్లడానికి బీజేపీ పాలకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి బలమైన కుల నిర్మూలన ఉద్యమాలు రావాలనీ, కుటుంబం నుంచే సంస్కరణ మొదలు కావాలనీ, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కుల,మతద్వేషాలు లేకుండా చైతన్యపూరితంగా పెంచే రోజులు రావాలనీ, కులాంతర వివాహాలు పెరగాలని ఆకాంక్షించారు. అలా అన్ని పాయలు కలిస్తేనే కులవ్యవస్థ నాశనం సాధ్యమవుతుందని చెప్పారు.



