- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రిమాలలోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం తోలగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం పోచంపల్లి మండలం పరిధిలోని దోతిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రసాయన పరిశ్రమలు తోలగించాలని నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కెమికల్ పరిశ్రమల వ్యర్ధాలు భూమిలోకి చేరి నీళ్లలో కలిసి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కలుషితం వల్ల తాగు నీటి సమస్యతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిశ్రమల కాలుష్యం వల్ల ప్రజలకు క్యాన్సర్, చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మరోపక్క వ్యవసాయం కూడా దెబ్బతిని పంట నష్టం జరుగుతుందని అన్నారు.
దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలో 200 ఎకరాలకు పైగా రైతులు ప్రతీ పంటకు పంట నష్టపోతున్నారని అన్నారు. ఈ కెమికల్ పరిశ్రమల వల్ల పాడి రైతులు, కూరగాయల రైతులు, పండ్ల తోటల రైతుల తోపాటు గీత కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిశ్రమల వల్ల నిత్యము ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తమ జీవనోపాధి, జీవితాలనే కోల్పో వస్తుందని ఆందోళన చెందుతున్నారని నర్సింహ తెలిపారు. పరిశ్రమల యజమానులు పరిశ్రమలలో నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిగా వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని చేస్తున్నారని దీనిని నియంత్రించవలసిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని లేకపోతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని నర్సింహ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మాజీ మండల కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు పాల్గొని మాట్లాడగా.. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి ముద్దం సత్తయ్య, సీపీఐ(ఎం) నాయకులు గుర్రం రామచంద్రారెడ్డి, వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, పోన్నమోని కృష్ణ, పగిళ్ళ వేణుగోపాల్ రెడ్డి, యాస మల్లారెడ్డి, పగిళ్ల పాండురెడ్డి, చుక్క రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమోరండం అందజేశారు.



