జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – అచ్చంపేట
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.
పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత కీలకమని, ప్రతి విభాగంలో శుభ్రతను నిరంతరం పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా వంటశాలలో ఆహారం తయారీ సమయంలో నాణ్యత ప్రమాణాలు, శుభ్రతపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
విద్యార్థులకు అందించే ఆహారం పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్ ప్లాన్ను అమలు చేయాలని, ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. నిల్వ గదుల్లో ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, గడువు ముగిసిన పదార్థాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంక్షేమ వారోత్సవాల భాగంగా నేడు నిర్వహిస్తున్న క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మమేకమై ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల మార్కులను అడిగి తెలుసుకుని, మెరుగైన ఫలితాలు సాధించిన వారిని అభినందిస్తూ, ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



