Wednesday, April 22, 2026
E-PAPER
Homeజాతీయంగందరగోళం సృష్టించేందుకే..

గందరగోళం సృష్టించేందుకే..

- Advertisement -

డిలిమిటేషన్‌, మహిళా బిల్లు కలిపేశారు : కేంద్రంపై ఎన్‌ రామ్‌ విమర్శలు
చెన్నై :
నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్‌)కు, మహిళా రిజర్వేషన్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. గందరగోళం సృష్టించేందుకు, ప్రతిపక్షాలపై నిందలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు బిల్లులను కలిపివేసిందని ది హిందూ గ్రూప్‌ మాజీ డైరెక్టర్‌ ఎన్‌ రామ్‌ విమర్శించారు. ‘తమిళనాడుకు భారీ విజయం! కేంద్ర ప్రభుత్వానికి ఓటమి!! ఎందుకు.. ఎలా’ అనే అంశంపై చెన్నై థింకర్స్‌ ఫోరం నిర్వహించిన ఒక సమావేశంలో ఎన్‌ రామ్‌ మాట్లాడారు. డిలిమిటేషన్‌ బిల్లు, మహిళా రిజర్వేషన్‌ బిల్లుల్లో అంతర్లీన వైరుధ్యాలు ఉన్నాయని, వీటిని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గానీ, ఇతర సమావేశాల్లో గానీ వివరించలేకపోయిందని ఎన్‌రామ్‌ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీతో సహా అనేక మంది నాయకులు చెప్పినట్లుగా నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్‌ను ఒక సాకుగా కేంద్రం వాడుకుందని విమర్శించారు. నిజానికి మహిళా రిజర్వేషన్‌కు, డిలిమిటేషన్‌కు ఎంతమాత్రం సంబంధం లేదని రామ్‌ తెలిపారు. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గందరగోళం సృష్టించడానికి, ఇండియా వేదికను విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి కపట వ్యూహాన్ని అనుసరించిందని ‘ది హిందూ’ సంపాదకీయాన్ని ప్రస్తావిస్తూ ఎన్‌రామ్‌ పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్య తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌పై పెద్దగా ప్రభావం చూపదని తెలిపారు. అలాగే కేంద్రం ఉద్దేశాలను అర్థం చేసుకుని, ఈ బిల్లుల్లోని లోపాలను తగిన వేదికలపై వెల్లడించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను రామ్‌ ప్రశంసించారు. జనాభా ఆధారిత డిలిమిటేషన్‌ అనేది జనాభా పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలిగిస్తుందని, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు శిక్ష వంటిందని రామ్‌ అభివర్ణించారు. ప్రస్తుత జనాభా లెక్కలను నిర్వహించకముందే, 2029 సాధారణ ఎన్నికలకు ముందే డిలిమిటేషన్‌ ప్రక్రియను నిర్వహించాలని బీజేపీ యోచిస్తుందని, తద్వారా హిందీ మాట్లాడే ప్రాంతంలో బలపడాలని బీజేపీ భావిస్తుందని ఆయన విమర్శించారు. రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోవడం తమిళనాడుకే కాదని, ఇండియా వేదికకు, దక్షిణాది రాష్ట్రాలకు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతీ ఒక్కరికీ లభించిన విజయమని ఎన్‌ రామ్‌ తెలిపారు. ఈ సమావేశంలో డీఎంకే ఎంపీ ఎ రాజా మాట్లాడుతూ డిలిమిటేషన్‌ అనేది ఒక చట్టబద్ధమైన నిబంధనని, రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టే ముందు దానిపై సభలో చర్చించి, మొదట ఆమోదించాల్సి ఉంటుందని తెలిపారు. సీట్ల సంఖ్యను నిర్థారించడం, డిలిమిటేషన్‌ కోసం సరిహద్దులను నిర్ణయించడం డిలిమిటేషన్‌ కమిషన్‌ పని. అయితే అది అమిత్‌షా, మోడీల పనికాదని ఆయన విమర్శించారు. అలాగే, ఈ సమావేశంలో చెన్నై థింకర్స్‌ ఫోరం కార్యదర్శి విజయ థాయన్‌బన్‌, ఉపాధ్యక్షుడు గుణనిధి అమృతం తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -