పెద్దపులు, చీతాలు వంటి క్రూర మృగాల కదలికలను కనిపెట్టడం కోసం వైల్డ్‌లైఫ్ అధికారులు తీసుకొచ్చిన పరికరమే ఈ ‘డిజిటల్ గంట’. దీన్నే ‘రేడియో కాలర్’ అంటారు. పులికి అమర్చే ఈ రేడియో కాలర్ ద్వారా అది ఎటు వైపు వెళ్తుంది? రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతోంది? ఏ ఆవాసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తోంది? గ్రామాలు, రహదారులకు ఎంత దగ్గరగా వెళ్తోంది? అనే విషయాలను శాస్త్రీయంగా తెలుసుకోవచ్చు. ఇది చూడడానికి చిన్న పరికరమే, కానీ దాని ద్వారా వన్య మృగాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం లభిస్తుందంటున్నారు అధికారులు.
నార్మల్‌గా మనకు ఆధార్ అనగానే మనుషులకు ఇచ్చే ఐడీ ప్రూఫ్స్ గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా? అడవుల్లో తిరిగే పెద్దపులులకు ఆధార్ సంఖ్య మాదిరిగా ప్రతి దానికీ ఓ కోడ్ ఉంటుంది. వాటికి K-6, K-1, S-1, S-2 ఇలా పేర్లు పెడుతుంటారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా వాటి కదలికల్ని పర్యవేక్షిస్తుంటారు. అవి కొద్దిరోజులు కనిపించకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్లాయేమో అంటూ అక్కడి అధికారులను కనుక్కుంటారు. అయితే GPS రేడియో కాలర్ బిగిస్తే, పెద్దపులి సహా వన్యప్రాణుల కదలికలన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదవుతాయి.
జంతువుల మెడలో రేడియో కాలర్ అమర్చాలంటే ముందుగా వాటిని పట్టుకోవాలి. అయితే పెద్దపులి, చీతా వంటి వేటాడే జంతువుల్ని పట్టుకోవడం చాలా ప్రమాదం. అందుకే పాదముద్రలు, కెమెరా ట్రాప్‌లు వంటి ఆనవాళ్లతో పులి కదలికలను ఐడెంటిఫై చేస్తారు. అటవీశాఖ బృందం పర్యవేక్షణలో అనుభవం ఉన్న వెటర్నరీ డాక్టర్ వాటికి మత్తు మందు ఇస్తారు. అనంతరం వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బరువు, వయస్సు అంచనా, శరీర పరిస్థితి వంటి వివరాల్ని నమోదు చేస్తారు. ఆ తర్వాత పులి మెడకు జీపీఎస్ ఉన్న రేడియా కాలర్ అమర్చుతారు.
మత్తు వీడిన తర్వాత కాలర్ బిగించిన పులిని అడవిలో వదిలేస్తారు. అలా పులి మెడలో బిగించిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడ తిరుగుతుందో తెలుసుకుంటారు. ఏ ఒకవేళ పులి మానవ నివాసాలకు చేరువైతే అక్కడి ప్రజల్ని ముందస్తుగా హెచ్చరించి జాగ్రత్తలు తీసుకుంటారు. రేడియో కాలర్‌తో పులి ప్రయాణం ఎలా రికార్డవుతుందో చెప్పేందుకు ‘వాకర్’గా పేరొందిన C-1 మగపులి మంచి ఉదాహరణ. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ వ్యాఘ్రం తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించి, తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. 13 నెలల్లో ఏకంగా 3,020 కిలోమీటర్లు ఈ పులి ప్రయాణించినట్లు దానికి అమర్చిన కాలర్ ద్వారా తెలిసింది.
డిజిటల్ గంట
- Advertisement -
- Advertisement -



