Sunday, September 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసౌదీ పైప్‌లైన్‌పై ఇరాక్ డ్రోన్ దాడి

సౌదీ పైప్‌లైన్‌పై ఇరాక్ డ్రోన్ దాడి

- Advertisement -

ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ విచారణకు ఆదేశం
రియాద్ : సౌదీ అరేబియాకు చెందిన కీలక పైప్‌లైన్‌పై ఇరాక్ డ్రోన్ల దాడి జరిపింది. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయని, కొంత ఆస్తినష్టం సంభవించిందని సౌదీ తెలిపింది. దాడిని తీవ్రంగా ఖండించిన సౌదీ 1,200 కిలోమీటర్ల పొడవైన ఆ పైప్‌లైనును తాత్కాలికంగా మూసేసింది. దక్షిణ రాష్ట్రమైన మేసన్‌లోని ఓ ప్రాంతం నుంచి సౌదీ అరేబియా తూర్పు – పడమర పైప్‌లైన్‌పై దాడి జరిగిన విషయాన్ని ఇరాక్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మిలిటరీ కమాండర్‌ను విధుల నుంచి తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఇరాక్ ప్రధాని అలీ అల్ – జైదీ విచారణకు ఆదేశించారు. కాగా పరిపాలన, భద్రతా సంబంధమైన కారణాల దృష్ట్యా సరిహద్దు క్రాసింగులను మూసివేయాలని ఇరాక్ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ మద్దతుతో ఇరాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అనేక మిలిషియా గ్రూపులు తమ చమురు స్థావరాలపై దాడులు చేస్తున్నాయని సౌదీ అరేబియా చాలా కాలంగా ఆరోపిస్తోంది. హార్ముజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుండడంతో తూర్పు‘పడమర పైప్‌లైన్ ద్వారా సౌదీ చమురు సరఫరాలు చేస్తోంది. కాగా ఇరాక్ అభ్యర్థన మేరకు ఎలాంటి ప్రతీకార దాడులకు దిగబోవడం లేదని సౌదీ తెలిపింది. అయితే దేశ సార్వభౌమత్వం, భద్రత, కీలక సదుపాయాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తనకు ఉన్నదని స్పష్టం చేసింది.

హౌతీల అధీనంలో ఎర్ర సముద్రం దీవి
యెమెన్‌లోని హౌతీలు శుక్రవారం బాబ్ అల్ – మందెబ్ జలసంధిలోని వ్యూహాత్మక పెరిమ్ దీవిని స్వాధీనం చేసుకున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో మరో కీలక అంతర్జాతీయ నౌకామార్గంపై ఇరాన్ తన ప్రభావాన్ని విస్తరించినట్లు అయింది. యెమెన్‌లోని ఎర్ర సముద్రం తీరంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న హౌతీలు గురువారం బాబ్ ఎల్మందెబ్ సమీపంలోని ఓడరేవు పట్టణమైన మోఖాను తన అధీనంలోకి తీసుకున్నారు. ఇదిలావుండగా హౌతీల తాజా దాడులు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ దాడుల కారణంగా చమురు రవాణా, ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక అమెరికా - ఇరాన్ యుద్ధం మరో మలుపు తిరగవచ్చునని అనుమానిస్తున్నాయి. బాబ్ ఎల్మందెబ్ జలసంధి ఎర్ర సముద్రం, సూయజ్ కాలువ ద్వారా ఆసియా, యూరప్‌లను కలుపుతోంది. ఈ జలసంధి మీదుగా ప్రతి రోజూ లక్షలాది బ్యారల్స్ చమురుతో పాటు ప్రపంచ దేశాలకు నిత్యావసర సరుకులు రవాణా అవుతున్నాయి. ఇదిలావుండగా యెమెన్ ప్రభుత్వ దళాలు శనివారం అల్ – ధాలే రాష్ట్రంలోని హౌతీల స్థావరాలపై డ్రోన్ దాడులు జరిపాయి. హౌతీ సభ్యుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరిగాయని ప్రభుత్వ దళాలు విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. హౌతీలు యెమెన్‌లోని దక్షిణ తీరం వెంట ముందుకు సాగుతుండడంతో ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 11,400 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సౌదీపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులలో మహిళలు, చిన్నారులు సహా 73 మంది గాయపడ్డారు. అనేక గ్రామాలు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -