నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని ఏసాపూర్ గ్రామానికి చెందిన మడావి పూజ (23), భర్త గజానంద్‌కు రెండవ కాన్పు సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 11:59 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు తీవ్రంగా పెరగడంతో పాటు శిశువు మెడ చుట్టూ బొడ్డు తాడు చుట్టుకుపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఏసాపూర్ గ్రామంలోనే అంబులెన్స్‌లో అత్యవసర ప్రసవం నిర్వహించారు.
ఇఆర్సిపి డాక్టర్ శ్రావణ్ మార్గదర్శకత్వంలో ఉదయం 12:18 గంటలకు పండంటి ఆడ శిశువు జన్మించింది. అనంతరం తల్లి, శిశువును బజార్ హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ సురేష్, పైలెట్ రాజారామ్ తెలిపారు.



