‘రెండు నలుపులు కలిస్తే ఒక తెలుపు కానే కాదు…’ అన్నారు పెద్దలు. అలాగే ఉంది వారిద్దరి వరస. ఒకరేమో ప్రభుత్వాధినేత.. మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేత… ఇటీవల వీరిద్దరూ నిర్వహించిన భారీ బహిరంగ సభలతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఏం సందేశమిచ్చా రనేది భూతద్దం పెట్టి వెతికినా కానరావటం లేదు. ‘మళ్లీ అధికారంలో కొస్తాం…’ అంటూ ఒకరు హూంకరిస్తే, ‘ఎట్లా వస్తారో చూస్తాం…’ అంటూ మరొకరు రంకెలేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణ భాషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు దాటి వ్యక్తిత్వ హననం, ఆవేశం హద్దులు దాటి ద్వేషం, ఆ స్థానంలో బూతు పురాణాలు ఊపందుకున్నాయి. కొన్ని పత్రికలు ఎలాంటి కత్తిరింపులు లేకుండా ఆ ఇద్దరు నేతలు వాడిన భాషనే యధాతథంగా ప్రచురించాయి. ఇంతకీ సీఎం, మాజీ సీఎం పరుష పదాల ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
రాష్ట్రంలో అసలు సమస్యలే లేనట్టు.. ఉన్నా అవి అప్రధానమన్నట్టు వారిరువురూ వ్యవహరిం చటం అత్యంత శోచనీయం. పదేండ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ… తెలంగాణను అప్పుల కుప్ప చేయగా.. ఆ అప్పులను సాకుగా చూపి, హామీల ఎగవేతకు శ్రీకారం చుట్టింది హస్తం పార్టీ. పైగా ‘రొట్టే లేదురా అంటే.. అది ఉంటే నెయ్యి వేసుకుని అద్దుకు తినేవాణ్ని…’ అన్నట్టు ఇరువురూ తమ తమ వాగాడంబరంతో అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ప్రజలకు దీర్ఘకాలంలో అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉపాధి, సంక్షేమం తదితరాంశాలపై వారు పెదవి విప్పలేదు. రాష్ట్రంలోని రైతాంగం సమస్యలు, ఎరువుల కొరతను ఏకరువు పెట్టలేదు. నూతన విద్యా విధానం, విద్యుత్ పాలసీలు, ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కేంద్రం.. రాష్ట్రంపై చేస్తున్న ఒత్తిడి గురించి మచ్చుకైనా మాట్లాడలేదు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మె గురించి వీరికి అసలు పట్టనే లేదు. ఆ సంస్థలోని సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ మాటిచ్చిన మాజీ సీఎం… తాను గద్దె దిగిపోయేదాకా ఆ పనిచేయేలేదు. ఏపీలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామంటూ ఎన్నికల సమ యంలో చెప్పిన నేటి సీఎం… ఆ అపాయింట్ మెంట్ డేట్ గురించి ఎప్పుడో మరిచిపోయారు.
మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని డీలిమిటేషనే ధ్యేయంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన బిల్లుల గురించి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సభలో చెప్పకపోవటం విడ్డూరం. విధాన పరంగా కాంగ్రెస్ దీన్ని పార్లమెంటులో వ్యతిరేకించింది. గులాబీ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. కానీ వేలాది మంది ప్రజలు హాజరైన సభల్లో ఈ అంశాన్ని ఎత్తిచూపటం ద్వారా మోడీ సర్కార్ వైఖరిని ఎండగట్టాలన్న సోయి ఇద్దరికీ లేకపోవటం ఆందోళనకరం. కార్మికులకు అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లను అమలు చేసి తీరాలంటూ రాష్ట్రాల మెడపై కేంద్రం కత్తి పెట్టింది. తెలంగాణలోని లక్షలాది మంది అసంఘటితరంగ కార్మికులు ఇది ఆశనిపాతం. ఈ విషయంలో కేంద్ర విధానాలను తూర్పారబట్టాల్సిన సీఎం, మాజీ సీఎం కిమ్మనకపోవటం దేనికి సంకేతం? సమగ్ర ఓటరు సవరణ (సర్) ద్వారా అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోని ఓట్లను తొలగించేం దుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ సారు, గులాబీ బాసు ఇద్దరూ సైలెంట్‌గా ఉండటం రాష్ట్రానికి క్షేమదాయకం కాదు.
వీరిద్దరి భాష, వ్యవహారశైలి చూస్తే ఆంధ్రా, తమిళనాడు తరహాలో తెలంగాణ కూడా ‘పవర్ పాలిట్రిక్స్’ చక్రబంధంలో చిక్కుకుపోయిందనే ప్రమాదకర సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. సబ్జెక్ట్ (విషయం) పక్కకుపెట్టి… ఆబ్జెక్ట్ (పైపైన కనిపించేవి)కే మన నేతలు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నట్టు కనబడుతోంది. ఇలాంటి వాటికి తాత్కాలికంగా జనాలు ఈలలేయొచ్చు.. చప్పట్లతో సభా ప్రాంగణాలు మార్మోగిపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంతమాత్రమూ ఉపయోగపడని అంశాలివి. సీపీఐ(ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి… ‘నేతా నహీ.. నీతి బదలావో…’ అని ప్రజలకు సూచించారు. అంటే నేతలను కాదు.. వారి విధానాలను చూడండి అని అర్థం. అందుకే అధికార పక్షం ఎప్పుడూ బాధ్యతనెరిగి ప్రవర్తించాలి. సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కండ్లని చెప్పటం కాకుండా చేతల్లో చూపించగలగాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యక్తుల ఆధారంగా కాకుండా విధానాల ప్రాతి పదికన మాట్లాడాలి. తద్వారా నిర్మాణాత్మక సూచనలు, సలహాలను ఇవ్వాలి. ఇవి రెండూ జరిగితేనే ప్రజలకు ప్రయోజనం. లేదంటే ఒక నాయకుడు వస్తాడు, మరో నాయకుడు పోతాడు, ఓ పార్టీ గెలుస్తుంది, మరో పార్టీ ఓడిపోతుంది… కానీ అంతిమంగా ప్రజలు మాత్రం నిత్యం ఓడిపోతూనే ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో వారెప్పటికీ ఓడిపోకూడదు.
ఏం సందేశమిచ్చారు…?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



