Sunday, September 13, 2026
E-PAPER
Homeదర్వాజఇంటి చిట్కాలతోనే....

ఇంటి చిట్కాలతోనే….

- Advertisement -

చాలామంది తమలో కనిపిస్తున్న అలసటను, మూడ్ స్వింగ్స్‌ను కేవలం పని ఒత్తిడి అనుకుని పొరబడుతుంటారు. కానీ, హఠాత్తుగా పెరిగే బరువు, మానసిక స్థితిలో మార్పుల వెనుక థైరాయిడ్ అసమతుల్యత ఉండే అవకాశం ఉంది. ఈ సమస్య మహిళల్లోనే కాస్త ఎక్కువగా ఉంటుంది. మన గొంతు భాగంలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి, మన శరీర జీవక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కేవలం శారీరక శక్తే కాదు, మన మానసిక ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. అందుకే, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని సులభమైన, సహజమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…
సెలెనియం అధికంగా ఉండే ఆహారాలు : థైరాయిడ్ పనితీరును సక్రమంగా ఉంచడంలో సెలెనియం అనే ముఖ్యమైన ఖనిజం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలలో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్​ను సమతుల్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

కొబ్బరి నూనె : ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు మద్ధతు ఇస్తాయి. దీనిని ఆహారంలో చేర్చుకోవడం లేదా వంటలో ఉపయోగించడం వల్ల T4 హార్మోన్ T3 హార్మోన్​గా మారే ప్రక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమంటున్నారు. అందుకే, దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.వ్యాయామం: ఆరోగ్యకరమైన థైరాయిడ్ కోసం ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా, థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. ఈ పద్ధతులను దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.
అయోడిన్: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ చాలా అవసరం. సముద్రపు నాచు (సీవీడ్), అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఆహారం వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అయితే అయోడిన్​ను తగినంత మోతాదులోనే తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఎందుకంటే, ఇది ఎక్కువైతే థైరాయిడ్ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -