పశ్చిమాసియాలో తనకు కొరకరాని కొయ్యగా ఉన్న ఇరాన్‌ను మింగివేయాలని చూసిన అమెరికాకు ఎదురు దెబ్బతగిలింది. నాలుగైదు వారాల్లో ఇరాన్ పని అయిపోతుందని, దాడులు నిలిచిపోతాయని తొలిరోజుల్లో చెప్పిన ట్రంప్ యాభై ఐదు రోజుల తరువాత మాట మార్చాడు. కాల్పుల విరమణ పొడిగింపునకు ఎలాంటి కాలవ్యవధి లేదని తాజాగా చెప్పాడు. మధ్యంతర ఎన్నికల కోసం పోరు ముగించాలని తాను అనుకుంటున్నట్లు చెబుతున్నారని, తనమీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పుకున్నాడు. తాజా దాడులతో అమెరికా ఇప్పటికే అరవై బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయిందని, ఇంకా అంతకంటే ఎక్కువగానే పౌరులపై ఇంథన భారం పడిందని చెబుతున్నారు. బర్రె చచ్చిన తరువాత పాడి గురించి బయటపడుతుందన్న సామెత మాదిరే పోరు ముగిసిన తరువాత జరిగిన పూర్తి నష్టాలు వెల్లడౌతాయి. ఇరాన్‌పై ఉత్తి పుణ్యానికి దాడులను ప్రారంభించి ఇప్పుడు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా చెరబట్టింది. ఈ దుర్మార్గపు ఉన్మాదంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు. ఇప్పటికే ఒక ముఖ్య సైనికాధికా రిని తొలగించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు నౌకాదళ మంత్రిని బర్తరఫ్ చేసింది. తమ వైఖరితో విబేధించిన వారిని, భజన చేయని ఇంకా ఎంత మందిని ఇంటి బాటపట్టిస్తారో తెలియదు. ఇలాంటి మతిమాలిన చర్యలు అమెరికా మిలిటరీ, పౌర యంత్రాంగంలో విబేధాలను పెంచేవే తప్ప మరొకటి కాదు.
పశ్చిమాసియా సంక్షోభం రోజురోజుకూ ప్రపంచంలోని అనేక దేశాల ఇబ్బందులను పెంచుతోంది. ఇరాన్ రోజుకు యాభై కోట్ల డాలర్లు నష్టపోతున్నదని ట్రంప్ సంబరపడవచ్చు,అతగాడి మిత్రులైన ఐరోపా దేశాలకు అంతకంటే ఎక్కువగా అరవై కోట్ల డాలర్లమేర చమురు వదులుతున్నది. మనకూ చాలా నష్టం జరుగుతున్నప్పటికీ ప్రధానితో సహా అనేక దేశాల నేతలు నోటికి తాళాలు వేసుకోవటాన్ని జనం గమనిస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో తాము గనుక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఇరాన్‌తో ఎన్నటికీ ఒప్పందం కుదిరే అవకాశం లేదని, లేకపోతే ఇరాన్ మొత్తాన్ని పేల్చివేయాల్సి ఉంటుందని డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు. తమ రేవులను చెరబట్టిన అమెరికా అక్కడినుంచి తప్పు కుంటే తప్ప చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ పదేపదే చెబుతోంది. తమను ఇబ్బంది పెట్టే అమెరికా స్థావరాలకు స్థానమిచ్చిన దేశాలను వదిలేదిలేదని, అవసర మైతే సముద్ర గర్భంలో ఉన్న సమాచార వైర్లను కూడా ధ్వంసం చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. విధిలేని స్థితిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తు న్నట్లు ట్రంప్ చెప్పాల్సి వచ్చింది.ట్రంప్ మాటలకు చేతలకు పొంతనలేదని ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాడని, దీన్ని యావత్ ప్రపంచం చూస్తున్నదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాషికియన్ చేసిన వ్యాఖ్యలు నూటికి రెండువందల శాతం వాస్తవం. జలసంధిలో నౌకల నుంచి కప్పం వసూలు చేసినట్లు తొలిసారిగా ఇరాన్ ప్రకటించింది. వాటిలో తమవిగానీ, ఇజ్రాయిల్వీ లేవని అందువలన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లం ఘించినట్లు తాము భావించటం లేదని అమెరికా ప్రకటించటం గమనిం చాల్సిన విషయం. దీన్నిబట్టి ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉంది, అది అంతిమంగా దిగిరాక తప్పదు, ఎలా అన్నదే ఆసక్తి కలిగించే అంశం.
ఒకవైపు అమెరికాలో చర్చలు అంటూనే లెబనాన్ అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధుల మీద ఇజ్రాయిల్ ఏదో ఒక సాకుతో దాడులు కొనసాగిస్తున్నది. దాని చర్యలు విరమించకపోతే హార్ముజ్ జలసంధిని తెరవటం జరగదని మరోసారి హెచ్చరించింది. తమ ఆంక్షలను ఉల్లంఘిం చిన నౌకలమీద దాడులు చేస్తూ ఎలా కాపాడుకుంటారో చూస్తామన్నట్లుగా అమెరికాకు సవాలు విసురుతున్నది. టెహరాన్‌కు మూడు నుంచి ఐదు రోజుల గడువు ఇస్తున్నానని ఈలోగా ఒప్పందానికి రాకపోతే పొడిగించిన కాల్పుల విరమణ నిర్ణయాన్ని రద్దుచేస్తానని ట్రంప్ బెదిరించటంలో పసలేదు. ఈ పూర్వరంగంలోనే పరాభవ ఉక్రోషాన్ని ఎలా వెళ్లగక్కాలో దిక్కుతోచక చైనా, భారత్ నరకకూపాలని నోరు పారవేసుకున్నాడు. ఇరాన్‌పై దాడిని చైనా పూర్తిగా ఖండించగా భారత్ మౌనంగా ఉన్నప్పటికీ ట్రంప్ ఆశించినట్లుగా మద్దతుదారుగా ఉండేం దుకు సిద్ధ్దంగాక పోవటంతో మనదేశాన్ని వదల్లేదు. జన్మతో అమెరికాలో పౌరసత్వహక్కుకు వ్యతిరేకంగా ఉన్న ఒక లేఖను సమర్ధిస్తూ అమెరికాలో ఒక బిడ్డపుడితే పౌరసత్వం వస్తుంది, తరువాత ఆ బిడ్డపేరుతో భారత్, చైనాల వంటి నరక కూపాల నుంచి మొత్తం కుటుంబాలు వచ్చి తిష్టవేస్తాయంటూ వాగాడు. నిజానికి ఈ రెండు దేశాలూ నాలుగువేల సంవత్స రాలుగా పురాతన నాగరికతలను కొనసాగిస్తున్నవని, నిన్నగాక మొన్న 250 ఏండ్ల నాడు ఉనికిలోకి వచ్చిన అమెరికానే నిజ మైన నరకమని ఇరాన్ వ్యాఖ్యానించింది. ట్రంప్ వ్యాఖ్యలపై మనవిదేశాంగ శాఖ స్పందన దున్నపోతుమీద వానలా ఉంది. ‘అలాంటి వార్తలను చూశాము, ఇంతకంటే చెప్పేదేమీ లేదనటం’ గర్హనీయం. అమెరికాకు బానిసల మాదిరి ఇంతగా లొంగిపోవాలా!
ట్రంప్ దిగొస్తున్నాడా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



